దేశ స్వాతంత్య్రంకోసం, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పరితపించి, వివిధ పోరాటాలలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణను కనులారా తిలకించిన ఇద్దరు తెలంగాణ దిగ్గజాలు ఫిబ్రవరి 2015లో కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధునిగా సోషలిస్టుగా, పాత్రికేయునిగా సేవలందించిన సంతపురం రఘువీరరావు ఫిబ్రవరి 5న తన 83వ ఏట హైదరాబాద్‌లో పరమపదించగా, గాంధీజీ శిష్యరికంలో ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ సేవాపథంలో నడిచిన భూపతి కృష్ణమూర్తి తన 91వ ఏట ఫిబ్రవరి 15న వరంగల్‌లో కన్నుమూశారు. తెలంగాణ ‘దిగ్గజాలు’ వీరిద్దరి మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీ ఆచార్య ఎస్వీ రామారావు
స్వాతంత్య్ర సమరయోధుడు, సోషలిస్టుపార్టీ కార్యకర్త, పాత్రికేయుడు సంతపురి
రఘువీరరావు తన 83వ ఏట 5 ఫిబ్రవరి 2015న పదించటంతో హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఒక శకం ముగిసింది. 1932 నవంబర్ 16న వరంగల్‌జిల్లా కూనూరులోని వారి పెద్దమ్మ ఇంటిలో తిరుమలరావు, యశోదమ్మ (మొదటి భార్య) దంపతులకు జన్మించిన రఘువీరరావు స్వగ్రామం మెదక్‌జిల్లా గజ్వేల్ తాలూకాలోని నర్సంపల్లి. ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు, ముగ్గురు సోదరీమణులు.
బాల్యంలో రఘువీరరావు విద్యాభ్యాసం అమ్మమ్మ ఊరు ప్యా(పే)రారంలోనే సాగింది. తాతగారు ఉద్యోగం చేస్తున్న సంగారెడ్డిలో ఉండి 7వ తరగతి చుదువుతున్నప్పుడు కందిలో జమలాపురం కేశవరావు అధ్యక్షతనలో 13వ ఆంధ్రమహాసభలు జరిగాయి. ఆ సభకు వాలంటీర్లుగా పనిచేసిన విద్యార్థులను హెడ్మాష్టరు బెత్తంతో కొట్టడం ఆయనలో స్వేచ్ఛాభావాలకు అంకురార్పణం చేసింది. పినతండ్రి ఉద్యోగరీత్యా ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు 8వ తరగతి విద్యార్థిగా ఊరేగింపులకు, సభలకు వెళ్లటం, లైబ్రరీకి వెళ్ళి పత్రికలు చదవటం అలవాటైంది.
తర్వాత హైదరాబాదు పాతబస్తీ లాల్‌దర్వాజలో ఉన్న అన్నగారింట్లో ఉండి ముఫీదుల్ అనాం స్కూల్లో 9వ తరగతిలో చేరినపుడు విద్యార్థి సంఘాలతో, యువకులతో పరిచయాలు పెరిగినాయి. సాయుధ పోరాటంలో శిక్షణ తీసుకోవడానికి విజయవాడ వెళ్లి జయంతి క్యాంపులో ఉన్నవారిలో రఘువీరరావు ఒకరు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చి సత్యాగ్రహ బృందాలు తయారు చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు పోలీసులు హాస్టలుపై దాడిచేసి విద్యార్థులను అరెస్టుచేసి వారిపై క్రిమినల్ కేసులు బనాయించి అండర్ ట్రయల్ ఖైదీలుగా చంచల్‌గూడా జైలులో వేశారు. పదహారవ ఏట (1948) పదవ తరగతి విద్యార్థిగా 7 నెలలు జైలు శిక్షకు గురి అయ్యారు. ఇంటర్‌లో ఉండగానే మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి తాలూకా శ్రీరంగాపురం వాస్తవ్యులు సూగూరు వాసుదేవరావు కుమార్తె (మా పెద్దక్క) వెంకట రమాదేవితో (1950) వివాహం జరిగింది. ఒకవైపు రాజకీయాల ప్రభావం, మరోవైపు వివాహం కారణంగా ఇంటర్ పరీక్షలకు హాజరుకాలేదు. తాను చదువుకొన్న ముఫీదుల్ అనాం స్కూలుకు వెళ్లి అడిగితే హెడ్మాస్టరు ఏ.యస్.రావు టీచర్ ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్‌లో, జనశక్తి, నవశక్తి, ప్రజావాణి (1951`52), ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ, తదితర పత్రికలలో పనిచేశాడు. ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ అనువాద శాఖలో, మునిసిపల్ కార్పొరేషన్ పబ్లిసిటీ ఆఫీసులో, మహబూబ్‌నగర్ కలెక్టర్ ఆఫీసులో క్లర్క్‌గా పనిచేశారు.
ఆ రోజుల్లోనే భార్య రమాదేవి తొలి కాన్పులోనే పక్షవాతంతో జబ్బుపడటంతో ఉద్యోగం వదులుకొని చికిత్స కోసం నానా ఇబ్బందులు పడ్డారు. సర్వోదయ నాయకులు ఉమ్మెత్తల కేశవరావుతో పరిచయం కలిగి సాన్నిహిత్యం ఏర్పడటంతో ఆచార్య వినోబా బావే నిర్వహిస్తున్న భూదానోద్యమ యాత్ర లో పాల్గొన్నాడు. రాష్ట్రస్థాయి సోషలిస్టు పార్టీ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే బద్రీవిశాల్ పిట్టీ సారథ్యంలో వెలువడుతుండిన ‘నవశక్తి’ వారపత్రికలో సంపాదకవర్గసభ్యునిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలిదశలో రఘువీరరావు కీలకపాత్ర వహించారు. 1969లో గౌలీగూడ లోని వతన్‌దారుల భవనంలో ప్రతాప్‌కిశోర్, మదన్ మోహన్ లతో కలిసి తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేశారు. మర్రి చెన్నారెడ్డి ప్రభృతులతో రాజమండ్రిలో కారాగారవాసం అనుభవించారు. ఉద్యమనేతగా చార్మినార్ నియోజక వర్గంనుంచి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచారు.
పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబావారి పిలుపుతో ప్రశాంతి నిలయంలో నివసిస్తూ ‘సనాతన సారథి’ మాసపత్రిక సంపాదకత్వ బాధ్యతను నిర్వర్తించారు. కాని స్వామి భక్తురాలైన అర్థాంగి రమాదేవి అకాల మరణంతో ఒంటరి వాడైనారు. తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్లీ వివాహం చేసుకున్నారు. వారసుడు వంశీకృష్ణ జన్మించారు. కొంతకాలం ‘వేదమాత’ పేరుతో స్వయంగా ఆధ్యాత్మిక మాసపత్రికను నడిపారు. ‘స్వాతంత్య్రోద్యమంలో సోషలిస్టు పాత్ర’ (2009) అన్న గ్రంథం ఆయన స్వాతంత్య్ర పిపాసను, ‘అన్వేషణ’ (2014) కవితా సంపుటి ఆయన కవితా హృదయాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రబలమై టి.ఆర్.ఎస్. ఆవిర్భావం జరిగిన సందర్భంలో రఘువీరరావు కె.సి.ఆర్. వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆయన కల సాఫల్యమైన తర్వాతే కన్నుమూశారు.
గాంధీజీ శిష్యరికంలో సమాజసేవే పరమావధిగా ముందుకు సాగిన మహానీయుడు భూపతి కృష్ణమూర్తి. 1944లో మహాత్ముని జన్మదినం సందర్భంగా అక్టోబరు 2న వార్దా సభకు వెళ్ళి అక్కడే పది రోజులపాటు గడిపారు. ఉదయం, సాయంత్రం సత్యం, అహింస మీద గాంధీజీ ఉపన్యాసాలు వినేవారు. సాయంత్రం గాంధీజీతో వ్యాహ్యాళికి వెళ్ళేవారు. దీనితో భూపతి కృష్ణమూర్తి ఎంతో ప్రభావితుడయ్యాడు. పోరాటపటిమ పెరిగింది. అనంతరం ఎన్నో సమాజసేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సమాజంలో అవినీతి, అన్యాయాలను పారద్రోలడానికి తనవంతు కృషి చేశారు.
తెలంగాణను నిజాం పాలన నుంచి విముక్తిచేయడానికి జరిగిన పోరాటంలో వరంగల్ కేంద్రంగా ఎన్నో పోరాటాలు సలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హయగ్రీవాచారితో కలిసి 1946లో ఖాదీ ప్రచారకమిటీ సభ్యులుగా ఎన్నికై వరంగల్ కోటలో ప్రతి వారం జెండావందనం జరిపేవారు.
కరీంనగర్ జిల్లా ముల్కనూరులో 21 ఫిబ్రవరి 1926న జన్మించిన కృష్ణమూర్తి 3వ తరగతి వరకు ముల్కనూరులో ఆ తదనంతరం 4వ తరగతి నుంచి 8వ తరగతి బోర్డు పరీక్ష వరకు హన్మకొండలో చదివారు. కారణాంతరాల వల్ల చదువును ముందుకు కొనసాగించలేదు. 16వ ఏటనే తాత,తండ్రి ప్రోద్బలంతో వారి అడ్తీ వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అదే సంవత్సరం కనకలక్ష్మితో వివాహం జరిగింది. వ్యాపారం చేస్తున్న తరుణంలోనే జాతీయ భావాలకు ఆకర్షితులై 1943లో నేషనల్ క్లబ్‌ను స్థాపించారు. ఈ క్లబ్ ద్వారా క్రీడలను ప్రోత్సహించారు.
యువకుల్లో క్రీడాస్పూర్తిని పెంపొందిస్తూనే ఆంధ్రమహాసభతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. మెల్లమెల్లగా రాజకీయాలవైపు మళ్ళి 1941 నుంచి 46 వరకు వరంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి కోశాధికారిగా వ్యవహరించారు. అప్పట్లో కాగ్రెస్ సిద్ధాంతాలను గ్రామగ్రామాన ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1946లో ఖాదీ ప్రచారకమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. భూపతి కృష్ణమూర్తి జీవితంలో 1946, ఆగస్టు 11 మరపురాని ఘట్టంగా మారిపోయింది. ఆరోజు హయగ్రీవాచారి వెంట సైకిళ్ళపై వరంగల్ తూర్పు కోటకు వెళ్ళి అక్కడ జెండా ఎగురవేసి బత్తిని రామస్వామి ఇంట్లో తన తోటి మిత్రులతో కలిసి సమావేశమై ఉండగా ఆ సమావేశంపై రజాకార్ల దాడి జరిగింది. ఈ దాడిలో బత్తిని మొగిలయ్య అనే కార్యకర్త కాశీంషరీఫ్(లక్డీ మాష్టారు) చేతిలో మృతి చెందారు. ఈ పోరాటంలో భూపతి కృష్ణమూర్తి తలకు రాయిదెబ్బ తగిలింది. అయినా వీరోచిత పోరాటం చేశారు. 1947`48 మధ్యకాలంలో తెలంగాణ విమోచన పోరాటంలో చురుకుగా పాల్గొని అజ్ఞాత జీవితం గడిపారు.
సమాజంలో ప్రతి వ్యక్తికి ఆర్థిక పరిపుష్టి కలగాలనే సత్సంకల్పంతో శ్రీ పడాల చంద్రయ్య ఆలోచనతో, కృషితో 1953లో రైతులు సభ్యులుగా ముల్కనూరు కో`ఆపరేటివ్ సొసైటీ (రూరల్ బ్యాంక్) స్థాపించబడిరది. ఈ సొసైటీ భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన అలిరెడ్డి విశ్వనాథరెడ్డి ఛైర్మన్‌గా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇది విజయవంతంగా కొనసాగింది. 1970 నుండి 74 వరకు భూపతి కృష్ణమూర్తి చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఈ సొసైటీ ఆసియా ఖండంలోనే పెద్దదిగా పేరుగాంచింది. వరంగల్ వ్యవసాయ గ్రేన్ మార్కెట్ కమిటీ సభ్యుడిగా 1953 నుంచి 1985 వరకు విధులు నిర్వహించారు. వీరి కృషివల్లనే మార్కెట్ యార్డులో నెంబ రింగ్ పద్ధతి అమలులోకి వచ్చింది. రైతుల సౌకర్యాల కోసం మార్కెట్‌యార్డులో తూకాలువేసే షెడ్లు, మూత్రశాలలు, పశువులకు నీళ్ళట్యాంకులు, గుమాస్తాలకు, వ్యాపారస్తులకు రీడిరగ్ రూంలు తదితర సౌకర్యాలు కల్పించబడ్డాయి. 1967లో మున్సిపల్ కౌన్సిల్‌లో 8వవార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్థుతం వరంగల్ పట్టణంలో పేరెన్నిక గన్న సి.కె.ఎం.(చందా కాంతయ్య మెమోరియల్) కళాశాల స్థాపన వెనక కృష్ణమూర్తి గారి కృషి ఎంతో ఉంది. ఇదే కాకుండా భూపతి 1972` 77లో వరంగల్ పట్టణ వైశ్యసంఘం అధ్యక్షులుగా పదవి నిర్వహించారు. 1987లో జిల్లా వైశ్య సంఘం అధ్యక్షునిగా కొనసాగారు.
తెలంగాణా కోసం పోరాటం
భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అవిశ్రాంత పోరాటం చేశారు. 1968 నుంచి 1971 వరకు టి.పురుషోత్తమరావుతో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్ళారు. ఆ సమయం లో తెలంగాణ ప్రజాసమితి వరంగల్ జిల్లా కోశాధికారిగా పనిచేశారు. హమాలీలు, వ్యాపారస్తులు, ఉత్తేజితులై ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో వరంగల్‌కు ప్రథమ స్థానాన్ని కల్పించారు. తుదిశ్వాస విడిచేవరకు తెలంగాణ వాదిగానే ఉన్నారు. ఇదే కాకుండా కృష్ణమూర్తి నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ స్థాపకులలో ఒకరు. విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల పాలకవర్గంలో సభ్యులుగా ఉన్నారు. సి.కె.ఎం. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సలహా మండలి సభ్యులుగా ప్రభుత్వంచేత నామినేట్ చేయబడ్డారు. 1977వ సంవత్సరంలో జనతాపార్టీలో చేరి పార్టీ విస్తరణకు కృషి చేశారు. 1980లో బిజెపిలో చేరారు. ఆ సమయంలో అగ్రశ్రేణి నాయకుల ప్రశంసలు పొందారు. 1982`85 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యులుగా ఉన్నారు. 1970`74 మధ్య కాలంలో దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహా మండలి సభ్యులుగా ఉన్నారు. కార్మిక సంఘాల జాతీయ సమన్వయ సంఘం పిలుపు మేరకు 1982 జనవరి 19న భారత్‌బంద్ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు కాబడి వారం రోజులపాటు జైలు జీవితం అనుభ వించారు. తెలంగాణ జనసభకు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వైశ్యరత్న, ప్రజాబంధు బిరుదులు పొందిన భూపతి కృష్ణమూర్తి 2015 ఫిబ్రవరి 15న స్వర్గస్థులైనారు.