”ఏ ఒక్క ఓటునూ వదిలి వేయకూడదు” అన్న ఆదర్శ సూత్రంతో ఎన్నికల నిర్వహణకు రంగం లోకి దిగుతున్న భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో దివ్యాంగులు కూడా పూర్తిస్థాయిలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహించే విధంగా ఈ ఏడాది ఎన్నికలకు ”అందుబాటులో ఎన్నికలు” అనేది ప్రధాన ఇతివత్తంగా (థీమ్) ప్రకటించింది.
ఈ లక్ష్యాన్ని ఆచరణలో చూపడానికి – ర్యాంప్, వీల్‌ఛైర్ (సహాయకుడితోసహా), ఉచిత రవాణా సౌకర్యం, బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డు, ఓటరు స్లిప్, ఓటు ఎలా వేయాలో తెలిపే విధానాన్ని సంకేత భాషలో తెలిపే బోధనాత్మక వీడియోలు, ఇతరత్రా అసౌకర్యాలేవయినా ఉంటే వాటిని పరిష్కరించడానికి మరికొన్ని ఏర్పాట్లతో ఎన్నికల యంత్రాంగం సిద్ధమయింది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులలో పేరెన్నికగన్నవారితో ఎన్నికల ఉన్నతాధికారులు ముఖాముఖి సమావేశమయి ఓటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచార సామాగ్రిని విడుదల చేసారు.
ఈ సందర్భంగా చూపులేనివారికోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన ఎపిక్ (జుూIజ) కార్డులను, కరపత్రాలను ఎన్నికల అధికారులు విడుదల చేసారు.
అలాగే వినికిడిలోపంతో ఉన్నవారికోసం సంకేతభాషతో రూపొందించిన బోధనాత్మక సిడిలను కూడా విడుదల చేసారు.
ఢిల్లీనుండి 11మంది బందంతో వచ్చిన ఎన్నికల ప్రధాన అధికారి ఓ.పి.రావత్, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమీషనర్, డైరెక్టర్ శ్రీమతి బి. శైలజ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దివ్యాంగుల తరఫున హాజరయిన ప్రముఖులలో శ్రావ్య (గాయని), మహేందర్ వైష్ణవ్, జి.మధు(అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు), అనీస్ సుల్తానా (ఐటి డెవలపర్), టి. వెంకటేశ్ (రేడియో జాకీ), అభినయ(సినీనటి), థండన్ బాబునాయక్ (శాస్త్రవేత్త), నర్శింగ్ రావు (ప్రచారకర్త), సుజాత (టివి యాంకర్) ఉన్నారు.