magaకష్టజీవులకూ, కర్మజీవులకూ నెలవైన భారతభూమిలో పండుగలకూ, పర్వదినాలకూ కొదువలేదు. నిత్యకల్యాణం, పచ్చతోరణంలా భాసిల్లే సంస్కృతికి భారతావనిలోని జనపదాలన్నీ నెలవులే. అలాంటి విశిష్ట సంస్కృతికీ, సంప్రదాయాలకూ, జనజీవన మాధుర్యానికీ తెలంగాణ రాష్ట్రం పుట్టినిల్లు. పురాతనకాలంనుంచి తనకు సంక్రమించిన వారసత్వ సంపదతోపాటు అన్ని సంస్కృతులనూ తనలో లీనం చేసుకొని సాగిపోతున్న తెలంగాణ నేల ఎందరో దేవతలకు కొలువైన భవ్యసీమ. ఎన్నో ఆరాధనా విధానాలకు గరిమ. ఇలాంటి విశిష్ట మాతృభూమిలో ప్రతియేటా జనులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగల్లో ముఖ్యమైంది. ‘దీపావళి’ ‘దీపాల వరుస’ అనే అర్థాన్ని ఇచ్చే పండుగ. పేరుకు తగ్గట్టే వెలుగుల్ని జగత్తుకు పంచుతోంది.

ఆశ్వీయుజ మాసంలోని కృష్ణపక్షంలో సంభవించే ఈ పండుగ ముందు, వెనుకలతో కలిపి మొత్తం అయిదు రోజుల పండుగగా జరుపుకోవడం జనుల ఆచారాలలో ఉంది. ఆశ్వీయుజ కృష్ణ త్రయోదశిని ‘ధనత్రయోదశి’ అని అంటారు. దీనికే ‘ధన్‌తేరస్‌’ అని మరొక పేరు. ఈ దినాన లక్ష్మీదేవి భువిపైకి అవతరించి, అందరి ఇండ్లలోనూ నివసిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ దినాన జనావళి లక్ష్మీదేవిని పూజిస్తూ, లక్ష్మీదేవికి ప్రతిరూపమైన బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఇంటిలో దాచుకొంటారు. ఇలా చేస్తే ఇక శాశ్వతంగా తమ ఇళ్లల్లో లక్ష్మీదేవి నివాసం చేస్తుందని గట్టి నమ్మకం. ఇళ్లల్లోనే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ స్థానాలలోనూ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలను కోరుతూ అర్చనలు చేయడం శుభాన్నీ, లాభాన్నీ కలిగించాలని ప్రార్థించడం కనబడుతుంది. ఇలా దీపావళి పండుగలోని మొదటిదినంగా ధనత్రయోదశి ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోంది.

ఇక రెండవ దినం నరక చతుర్దశి. ఈ పవిత్ర దినాన శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురునిపై విజయం సాధించి, లోకానికి రాక్షస బాధ లేకుండా కాపాడాడని అందరి విశ్వాసం. అందుకే ఈ దినాన రాక్షసునిపై విజయానికి సంకేతంగా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంటారు. నరకాసురుడంటే కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కాదనీ, మనిషికి మరణానంతరం పాపాలను అనుభవించేందుకు నరక లోకబాధ ఉంటుందనీ, ఆ నరకబాధను తప్పించుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ ఈ దినాన జనులందరూ చేస్తారనీ, అందుకే దీనికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందనీ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దినాన ఉషోదయంలోనే మేల్కొని మంగళప్రదంగా అభ్యంగన స్నానాలను ఆచరించి, ఇష్టదేవతలను ఆరాధించి, ఇంటిలోనూ, ఇంటి వాకిటిలోనూ దీపాలు వెలిగించి, చీకటిలోకమైన నరకం సంభవించకుండా, వెలుగులతో కూడిన ఉత్తమలోకాలు సంభవించాలని కోరడం ఈ పండుగనాడు కనబడుతుంది. ఈ దినాన వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కాడనీ, శ్రీరాముడు తన సామ్రాజ్య సింహాసనంపై పట్టాభిషిక్తుడైనాడనీ పురాణాలు చెబుతున్నాయి.

మూడవ దినం అయిన ‘అమావాస్య’నాడు ‘దీపావళి’ పండుగను జరుపుకొంటారు. ఈ దినం లోకంలో అందరికీ కొత్త వెలుగులను అందిస్తుందని అందరి నమ్మకం. సకల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి పుట్టినదినంగా అందరూ విశ్వసించే ఈ పుణ్యదినాన జనులందరూ తమతమ గృహాలను చక్కగా అలంకరించి, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. తమ ఇంటిలోని ధన, కనక, వస్తు, వాహనాలను లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావించి, పూజలు చేస్తారు. టపాకాయలను కాలుస్తూ పెద్దఎత్తున తమ ఆనందాన్ని ప్రకటిస్తారు. రాత్రంతా జాగరణచేస్తూ, లక్ష్మీదేవి తమ గృహాలలోకి అడుగుపెడుతుందని నమ్ముతూ, గృహద్వారా లను రాత్రింబవళ్లూ తెరిచి ఉంచుతారు. చక్కగా పిండి వంటలను, తీపి పదార్థాలనూ నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. చీకటివంటి చెడుపై వెలుగువంటి మంచి విజయం సాధిస్తుందనే భావనను స్పష్టం చేయడానికి కూడా ఈ పండుగను ఆచరిస్తారు. వేదాలలోని ‘తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ’వంటి సూక్తులు దీపావళి పండుగలో ప్రతిఫలిస్తున్నాయి. ఈ దినాన రాత్రివేళ పిల్లలూ, పెద్దలూ రంగురంగుల టపాకాయలను పేలుస్తూ దిక్కులన్నీ వెలుగులతో నిండిపోయేలా కాంతివంతంగా పండుగను జరుపుకొంటారు.

దీపావళి మరుసటి దినం ‘బలిపాడ్యమి’ ఈ దినాన పితృదేవతలకు ప్రీతిని కలిగించడానికీ, వారి ఆశీస్సులను పొందడానికీ ‘బలులు’ (నివేదనలు) సమర్పిస్తారు. అందుకే ఈ పవిత్ర దినానికి బలిపాడ్యమి అనే పేరు వచ్చింది. ఎప్పుడో మరణించి, పితృలోకాలలో ఉన్న తమ పూర్వులు ఈ దినాన భువిపైకి వచ్చి, తాము సమర్పించే బలులను స్వీకరించి సంతృప్తి చెందుతారని లోకంలోని ప్రజల నమ్మకం.

బలిపాడ్యమి మరుసటిదినాన్ని ‘యమద్వితీయ’ లేదా ‘భ్రాతృద్వితీయ’ అని పిలుస్తారు. ఈ పవిత్రదినాన అన్నలు, తమ్ముళ్లు తమ చెల్లెండ్లు, అక్కల ఇళ్లకు వెళ్లి, వాళ్లు స్వయంగా వండి, వడ్డించిన షడ్రసోపేతమైన విందులను ఆరగించి, అక్కలకూ, చెల్లెళ్లకూ కట్నాలూ, కానుకలూ సమర్పించి, వారిని ఆదరిస్తారని నమ్ముతారు. దీనికి ఒక పురాణగాధ కూడా ఉంది. పూర్వం యమధర్మరాజు సోదరి అయిన ‘యమున’ తన అన్నను భోజనానికి రమ్మని ఆహ్వానించిందట. ఎప్పుడూ విరామంలేని యమలోక బాధ్యతలతో యమధర్మరాజు సోదరి ఆహ్వానాన్ని విస్మరించాడట. చివరికి ఒకనాడు తాను విస్మరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని, పశ్చాత్తాపపడి యమున ఇంటికి వెళ్లాడట. తన కోరికను మన్నించి వచ్చిన అన్నను చూచి యమున ఎంతో ఆదరించి, షడ్రసోపేతమైన భోజనం పెట్టిందట. అలా ప్రీతి భోజనం చేసిన యముడు చెల్లెలి చేతి వంటలోని మాధుర్యానికి పొంగిపోయి, ఆమెకు ఒక వరం ఇచ్చాడట. అదేమంటే-‘ప్రతి యేడాదీ కార్తిక శుద్ధద్వితీయ నాడు తనవలె లోకంలో ఎవరు తమ అక్కలూ, చెల్లెళ్ల ఇండ్లకు వెళ్లి, విందును ఆరగిస్తారో, వారికి నరకబాధ ఉండదు! అని! ఇది విని దేవతలూ ఆనందించారు. భూలోకవాసులు అంతులేని ఆనందంలో తేలియాడారు! అందుకే ఈ పవిత్రదినానికి ‘భగినీ హస్త భోజనం’ (అక్కలూ, చెల్లెళ్ల చేతివంటలను ఆరగించే శుభదినం) అనే పేరు కూడా ఉంది. ఇలా దీపావళి పండుగ, ఐదు దినాలుగా లోకాన్ని ఆనందదాయకం చేస్తోంది.

లోకంలో మనిషి ప్రకృతిశక్తులు అందించే వనరులపైనే జీవనం గడుపుతాడు. ఇలాంటి ప్రకృతిశక్తుల ఆరాధనలే పండుగలుగా రూపుదిద్దుకొన్నాయి. దేవతలు మనుష్యులకు ప్రత్యక్షంగా కనబడకపోవచ్చుగానీ ప్రకృతిశక్తుల రూపంలో, ప్రకృతి వనరుల రూపంలో దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించి, పూజలూ, పండుగలూ చేస్తే మనిషి మనస్సులో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అవే సౌఖ్యజీవనానికి, జీవిత పరమార్థానికీ దారితీస్తాయి. ఇదే పండుగలలోని ఆంతర్యం!

ఆయాచితం నటేశ్వరశర్మ

Other Updates