అ టి.యు.
sasaఅంటరానివారుగా హిందువులు దూరంగా ఉంచిన వారిని ‘‘ఆది హిందువులు’’గా ఈ పవిత్ర భారతదేశంలో తొట్టతొలుత నివసించిన సంతతిగా భాగ్యరెడ్డి వర్మ నిరూపించారు. ఈ క్రమంలో తెలుగుదేశంలో యుగయుగాలుగా నివసిస్తున్న దళితులే ఆదివాసులని, అసలు సిసలు భూమిపుత్రులని చాటారు. స్వాతంత్య్రానికంటే పూర్వమే 1906లో ‘‘జగన్‌మిత్ర మండలి’’ అనే సంస్థను ఆయన నెలకొల్పారు. దాన్నే ఆ తర్వాత ఆయన 1911లో ‘‘మన సంఘం’’గా మార్చారు. చివరికి దాన్ని ‘‘ఆది హిందూ సాంఘిక సేవా సంస్థ’’గా 1922లో తీర్చిదిద్దారు. అంటరానితనంపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఆయన అకుంఠిత పోరాటం కుల, వర్గ పోరాటాల మాదిరిగా కాకుండా విజ్ఞుల, అభ్యుదయకాముకుల సహకారం, సమన్వయంతో ఆదర్శనీయంగా సాగడం విశేషం. భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా అది విజయవంతమైంది. అందుకే వారి బహుముఖ సేవలను భారత కోకిల సరోజిని దేవితో పాటు మహాత్మాగాంధీ అంతటి మహనీయుడు పలు సందర్భాలలో ప్రశంసించారు.

1917 డిసెంబర్‌ 15వ తేదీన కలకత్తాలో ‘‘అఖిల భారత హిందూ సంస్కరణ మహాసభ’’ జరిగింది. మహాత్మా గాంధీ పాల్గొన్న ఈ సభలో పాల్గొనవలసిందిగా భాగ్యరెడ్డి వర్మకు కూడా ఆహ్వానం అందింది. ఆ సభలో మాట్లాడడానికి భాగ్యరెడ్డి వర్మకు కేవలం పది నిముషాల సమయం కేటాయించారు. భాగ్యరెడ్డి వర్మ తన ప్రసంగాన్ని ప్రారంభించి పది నిమిషాల్లో ముగించగా, ప్రేక్షకులు ఆయన ప్రసంగం ఇంకా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మహాత్మా గాంధీని సైతం భాగ్యరెడ్డి వర్మ అనర్గళంగా, అర్థవంతంగా ఆలోచనాత్మకంగా జేసిన ఉపన్యాసం ఆకర్షించింది.
ఆ మరునాడే కలకత్తా వై.ఎం.సి.ఏ. హాల్‌లో మహాత్మాగాంధీ అధ్యక్షతన మరో సమావేశం జరిగింది. దానికి రావడానికి భాగ్యరెడ్డి వర్మకు కొంత ఆలస్యం కాగా, కూర్చునేందుకు ఆయనకు సీటు లభించలేదు. వేదిక మీదకు తీసుకురావలసిందిగా చెప్పి తన ప్రైవేట్‌ కార్యదర్శిని క్రిందికి మహాత్మాగాంధీ పంపించారు. భాగ్యరెడ్డి వర్మ వేదిక మీదికి వచ్చాక తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు అంటే ఆయన పట్ల మహాత్మాగాంధీకి ఎంత గౌరవమో సుస్పష్టమౌతున్నది.

మహాత్మాగాంధీ 1928లో ఆంధ్ర పర్యటించినప్పటికి ఏప్రిల్‌ 6వ తేదీన హైదరాబాద్‌ వచ్చారు. సరోజినీ నాయుడు నివాసం గోల్డెన్‌ త్రీషోల్డ్డ్‌లో బస చేశారు. 7వ తేదీన మోటారు కారులో ఊరేగింపుగా వివేకవర్ధిని థియేటరుకు వచ్చారు. అక్కడ ఆయన ఖద్దరుధారణ, మద్యనిషేధం, అంటరానితనం గురించి మాట్లాడారు. అదే రోజు ఆయన ఆది హిందూ ప్రాథమిక పాఠశాలలు మూడింటిని సందర్శించారు. ఈ సందర్భంగా హిందీ భాష కూడా విద్యార్థులకు బోధించవలసిందిగా వారికి సూచించారు. అక్కడి నుంచి బయలుదేరి ఇసామియా బజార్‌లోని ఆది హిందూ సాంఘిక సేవా సంఘం కార్యాలయానికి మహాత్మాగాంధీ వచ్చారు. ఆ ప్రక్కనే గల విక్టరీ మైదానం మొత్తం మహాత్మాగాంధీని దర్శించడానికి, ఆయన మాటలు వినడానికి వచ్చిన వేలాదిమంది సందర్శకులతో కిటకిటలాడి పోయింది. అక్కడ ప్రసంగించిన గాంధీ మహాత్ముడు, ఆది హిందూ సంస్థ చేస్తున్న సేవలను, కార్యక్రమాలను మెచ్చుకున్నారు. ఆ తర్వాత అంటరానితనం మహాపాపమనీ, హిందూత్వానికి అది మచ్చ అని హితవు చెప్పారు. అదే సందర్భంగా మహాత్మాగాంధీ 1917 డిసెంబర్‌ మాసంలో కలకత్తాలో భాగ్యరెడ్డి వర్మను కలుసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ తరుణంలో కొందరు హిందూ ఛాందసులు కలుసుకుని ఆది హిందూభవన్‌ సందర్శించవలదని కోరినా, గాంధీజీ వారి సూచనలను తిరస్కరించి, ఇసామియాబజార్‌ లోని ఆది హిందూ భవన్‌కు వచ్చారంటే భాగ్యరెడ్డి వర్మ పట్ల ఎంత ఆదరాభిమానాలు, విశ్వాసం ఉందో వేరుగా చెప్పనవసరం లేదు కదా?

మహాత్మాగాంధీ దృష్టిని ఇంతగా ఆకర్షించి అంటరానితనం నిర్మూలనకు ఆహరహం పాటుపడిన భాగ్యరెడ్డి వర్మ – మాదిరి వెంకయ్య, శ్రీమతి రంగమాంబ దళిత దంపతుల ద్వితీయ కుమారుడుగా, 1888 మే 22వ తేదీన జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు భాగ్యయ్య అని పేరు పెట్టారు. అయితే శివభక్తుడు, విద్యాధికుడైన వారి కుటుంబ గురువు, ఆ బాలుడికి భాగ్యరెడ్డిగా నామకరణం చేశారు. ఆర్యులు హిందూ దేశానికి వలస రాకముందు ప్రస్తుతం అస్పృశ్యులుగా సమాజం ముద్ర వేసిన ఆది హిందువులే పాలకులని ఆయన వాదం. ‘‘రెడ్డి’’ అన్నది పాలకుడనే అర్థం గల ‘‘రేడు’’ అనే పదం నుంచి ఉద్భవించింది. అందుచేత మాదిరి వెంకయ్యగారి భాగ్యయ్యకు రెడ్డిని జత చేశానని ఆయన చెప్పారు. ఆ తర్వాత 1913లో మాదిరి వెంకయ్యగారి భాగ్యరెడ్డిని హిందూ సమాజానికి ఆయన చేసిన అపూర్వ సేవలకు గుర్తింపుగా ఆర్య సమాజ్‌ వార్షికోత్సవాల్లో సత్కరించి ‘‘వర్మ’’ అనే బిరుదు ప్రదానం చేశారు. ఆనాటి నుంచి మాదిరి వెంకయ్యగారి కుమారుడు భాగ్యరెడ్డి వర్మగా, ఎం.వి. భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధికెక్కాడు.

భాగ్యరెడ్డి పదవయేటనే తండ్రి చనిపోవడం వల్ల ఆయన చదువు సరిగా సాగలేదు. తల్లి వెంకమాంబ ఐదుగురు సభ్యులు గల కుటుంబాన్ని కాయకష్టం చేసి పోషించవలసి వచ్చింది. ఒకరోజు భాగ్యరెడ్డిపై తల్లి కోపగించడంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి, ఫ్రాన్సిస్‌ క్జావియర్‌దాస్‌ సంతోష్‌ అనే రోమన్‌ కాథలిక్‌ బారిస్టర్‌ వద్ద పనికి కుదిరాడు. అక్కడే ఆయన చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. అక్కడ న్యాయవాదుల సహవాసంతో పాటు పలు పత్రికలు చదివి విశేషాలు తెలుసుకునే జిజ్ఞాస ఏర్పడిరది. రావిచెట్టు రంగారావు జాగిర్దారు ‘‘విజ్ఞాన చంద్రికా మండలి’’ ప్రచురణలు, ఇతర పుస్తకాలు భాగ్యరెడ్డికి బహూకరించడంతో పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. ఆయన పద్దెనిమిదవ యేట లక్ష్మీదేవితో వివాహమైంది. ఆమె సహకారంతో భాగ్యారెడ్డి వర్మ కార్య క్రమాలు మరింతగా ఉపందుకున్నాయి. తన యజయాని ఇంటికి వెళుతూ ఒక విజయదశమి రోజున బలి ఇచ్చిన గొర్రెను చూసి ఆయన ఎంతో కలత చెందాడు. ఆనాటి నుంచీ ఆయన శాఖాహారి అయ్యాడు. అంతేకాదు ఆయన ప్రారంభించిన ‘‘జగన్‌మిత్ర మండలి’’లో సభ్యత్వం కోరేవారు మద్య మాంసాలు సేవించ కూడదనీ, పొగకూడా తాగకూడదనే నిబంధన అమలు చేశాడు.

ఈ విధంగా తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చైతన్యం తేవడానికి భాగ్యరెడ్డి వర్మ నిస్వార్థసేవ చేశాడు. దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత మహిళలు దేవదాసీలుగా, జోగినులుగా, పార్వతులుగా, మరళిలుగా మారి భక్తుల కోరికలు తీర్చడానికి ఆలయాల్లోనే కాకుండా క్రమంగా శవయాత్రల్లోను నర్తించే తతంగాన్ని, ఆ నర్తన పూజ ముసుగులో సమాజం ఆమోదించిన వ్యభిచారుణులయ్యే ఆచారాన్ని భాగ్యరెడ్డి వర్మ తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రదానంగా దళిత మహిళను, ఆ తర్వాత వెనకబడిన తరగతులకు చెందిన యువతులను ప్రత్యేకంగా దేవునికి అంకితమిచ్చే కార్యక్రమాలు నైజాం రాష్ట్రంలోని తెలంగాణా, మరట్వాడా, కన్నడ ప్రాంతాల్లో పురోహితులనబడే జంగాలు నిర్వహించేవారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి భాగ్యరెడ్డి వర్మ ఎంతో దూరదృష్టితో కార్యాచరణ చేపట్టారు. అనేక సభలలో దళితుల్లో, వెనకబడిన తరగతుల వారిలో జాగృతి కలిగించే విధంగా ప్రసంగాలు చేశారు. ఆదిహిందువులు నివసించే ప్రాంతాలలో కులనాయకులతో ‘‘పంచాయతీలు’’ ఏర్పాటు చేసి, ఈ దురాచారం నిర్మూలనకు దోహదం చేశాడు. గ్రామకుల నాయకుల సమావేశాల్లో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలపై కొందరు కరడుకట్టిన ఇస్లాం వాదులు, భాగ్యరెడ్డి వర్మ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని నైజాం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా తోపులబట్టిలో జరిగిన తొలి కుల నాయకుల సమావేశంలో చేసిన తీర్మానం విధించిన నిబంధనలు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తున్నాయని దేవదాసీలు, జోగినులు పోలీసు అమీనుకు నివేదించారు. దాంతో కులనాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరుణంలో భాగ్యరెడ్డి వర్మ ఎంతో సమయ స్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే దళితులు, వెనకబడిన కులాలకు చెందిన పెద్దలు, కుల నాయకుల సమావేశంలో చేసిన తీర్మానాల ప్రతితో మహజరునామా ప్రయత్నానికి పంపారు. దీన్ని కూలంకుషంగా పరిశీలించిన ప్రభుత్వం అరెస్టు చేసిన వారిని విడుదల చేసింది. కులనాయకులను సదర్‌ అమీన్‌ విచారించి, వారు అమలు చేయ సంకల్పించిన సంస్కరణ తమ ప్రభుత్వ ‘‘అసఫియా వ్యభిచార నియంత్రణ చట్టా’’న్ని అమలు చేయడానికి సహకరిస్తున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ లిఖిత ప్రతులను దేవదాసీలు నివసించే ప్రాంతాలకు పంపించడంతో దేవదాసీలు, జోగినులు ఈ దురాచారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. నవ యువతులను ఈ దురాచారంలోకి దింపే పూజారులు, జంగాలు తమ ఉనికిని కోల్పోయారు. దాంతో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమం ఊహాతీతంగా విజయవంతమైంది. అంటరానితనం, దేవదాసీ వృత్తికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటుగా బాల్య వివాహాలు నిషేదించడానికి, వితంతు వివాహాలు జరిపించడానికి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. కొంతకాలం క్రాంప్టన్‌ అండ్‌ కో అనే ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ, మరికొంతకాలం నిజాం ప్రభుత్వ విద్యుత్‌ శాఖలో మీటర్‌ రీడింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ, అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొనేవారు.

1917లో బెజవాడలో జరిగిన తొలి పంచమ మహాసభకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. ఈ మహాసభలో ఆయన ప్రసంగానికి ప్రభావితులైన నిర్వాహకులు ‘‘ఆంద్రదేశ తొలి ఆది ఆంధ్ర మహాసభ’’గా పేరు మార్చి బ్యానర్లు కూడా మార్చారు. ఆ తర్వాత 1919లో బందరులో, 1921లో ఏలూరులో, భీమవరంలో, 1925లో అనంతపూర్‌లో, 1933లో నాగపూర్‌లో, 1938లో కాకినాడ తదితర చోట్ల జరిగిన ఆది ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు. 1922లో హైదరాబాద్‌లో జరిగిన ఆది హిందూ మహాసభలకు కార్యదర్శిగా ఉండి కృషి చేశారు. 1930లో అఖిల భారత ఆది హిందూ మహాసభకు, 1931లో బొల్లారంలో జరిగిన ఆది హిందూ రాజకీయ మహాసభలకు ఆయనే అధ్యక్షత వహించారు. తగిన తీర్మానాలు చేయించి, వాటి అమలుకు పాటుపడ్డారు.

1923లో ఆది హిందూ సామాజిక సంఘం సభకు అధ్యక్షత వహించిన శ్రీ గోస్వామి రాజాధర్‌ రాజ్‌గిరి జీ నరసింగ్‌జీ చేసిన వాగ్దానం మేరకు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ వంతెన సమీపంలో ఆది హిందూ భవనం నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఈ భవనంలో భాగ్యస్మారక బాలికోన్నత పాఠశాల పనిచేస్తున్నది.

భాగ్యరెడ్డి వర్మ దక్కన్‌ మానవతా సంఘానికి కార్యదర్శిగా ఎంతో చురుకుగా పని చేశారు. ఆది హిందువులలో విద్యా వ్యాప్తికి కంకణం కట్టుకుని 1906లో ఆది హిందూ ప్రాథమిక పాఠశాలను భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించారు. 1933 నాటికి ఆది హిందూ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 26కు పెరిగింది. ఆ తర్వాత ఆ పాఠశాలల యాజమాన్యాన్ని నిజాం ప్రభుత్వం స్వీకరించింది.

అస్పృశ్యతా నివారణకు భాగ్యరెడ్డి వర్మ లాగా కృషి చేసిన నాయకుడు, సంస్కర్త మరొకరు లేరు. అందుకే హైదరాబాద్‌లోని ఇసామియా బజార్‌ ప్రధాన రోడ్‌కు ‘భాగ్యరెడ్డి వర్మ మార్గ్‌’ అని నగర పాలక సంస్థ దేశ స్వాతంత్య్రానికంటే ముందే నామకరణం చేసింది. వీరి సేవలకు గాను ధరమ్‌వీర్‌ వామన్‌ నాయక్‌ జాగీర్దార్‌ అధ్యక్షతన ‘శివశ్రేష్టి’ బిరుదు ప్రదానం చేశారు. ఏలూరు ఆది ఆంధ్ర మహాసభలో ‘సంఘమన్య’ బిరుదు ఇచ్చారు. 1931లో భాగ్యరెడ్డి వర్మ ‘భాగ్యనగర్‌ పత్రిక’ స్థాపించారు. దాన్నే ఆ తర్వాత ‘ఆది హిందూ’గా మార్చారు. ఈ పత్రిక ద్వారా మానవతా దృక్పథాన్ని ప్రచారం చేశారు. ‘స్వస్తిక్‌ సేవా దళం’ ఏర్పాటు చేసి నగర ప్రజలకు ఎంతో సేవ చేశారు. నిర్విరామ బహుముఖ కార్యక్రమాలతో ఆరోగ్యం బాగా దెబ్బతిని భాగ్యరెడ్డి వర్మ 1937 ఫిబ్రవరి 18వ తేదీన కన్నుమూశారు.

Other Updates