dataraya

రికొత్త సంవత్సరం ‘దుర్ముఖి’ ఉగాది వేడుకలను రాష్ట్ర దేవాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్‌ 8న ఘనంగా నిర్వహించాయి. జరిగింది. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార శాస్త్రి పంచాంగ పఠనం గావిస్తూ శ్రీ దుర్ముఖి సంవత్సరంలో మన రాష్ట్రం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. శుక్రుడు నవనాయకులకు అధిపతి స్థానంలో రాజుగా అవతరించడం వల్ల పంట పొలాలు సమృద్ధిగా పండుతాయి” అని అన్నారు. సస్యాధిపతి ‘శని’ అవడం వల్ల, నల్ల ధాన్యాలు విరివిగా పండుతాయని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు విజయవంతమై అద్భుతమైన ఫలితాలనందిస్తాయని వివరించారు.ఆ తరువాత శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం రాష్ట్రానికి మేలు చేస్తుందని ప్రజలకు ఉగాది సందేశాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రసంగించారు.

సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి పునాదులను ఇప్పుడే వేస్తున్నామని, ఇప్పుడే జాగ్రత్తగా, అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. పునాదులు వేసే సమయంలోనే అన్ని విషయాలపై లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం వుంటుందని, ఈ పనిని తాము పకడ్బంధీగా పాటించామని చెప్పారు.

రాష్ట్ర ఆదాయంలో కూడా మంచి పురోగతిని అందుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యేడు రాష్ట్ర రాబడి 15 శాతం అధికంగా వచ్చిందని చెప్పారు. దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాలలో ఈ స్థాయి ప్రగతి సూచికను ఎవరూ అందుకోలేదని సీఎం కేసీఆర్‌ తెలియజెప్పారు. మన రాష్ట్ర నికర ఆదాయవనరుల లెక్క నిర్ధిష్టంగా తేలడం వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే సాగింది అని కేసీఆర్‌ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించుకోవడంతోనే నిధులు మన వశమయ్యాయని, నియామకాలు కూడా మన బిడ్డలకే దక్కుతున్నాయన్నారు. ఇక మిగిలిన నీటి అంశంలో ఆచితూచి అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో చిన్న తప్పు జరిగినా భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోతాయని, అందుకే పూర్తి అవగాహనతోనే అడుగులు ముందుకు కదుపుతున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ధనిక ప్రాంతమని, ఇక్కడి సంపదనంతా దోచుకుంటున్నారని, ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని, ఒకే ఒక ఆర్థిక సంవత్సర నికరాదాయ వనరులను పరిశీలించడం ద్వారా తేటతెల్లమయ్యిందని ముఖ్యమంత్రి అన్నారు. కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో భారతదేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటున్నామని అన్నారు.

తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరు అందించడం, మంచినీటి ఎద్దడి నివారించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నామని అన్నారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం ఉన్నప్పటికీ, గోదావరినదిలో నీటికి కరువు లేదని, అత్యంత తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో కూడా గోదావరి నదిలోని 1500 టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలిశాయని పేర్కొన్నారు.

ఇకముందు వర్షాలు పడక కరువు పరిస్థితులు ఏర్పడ్డా! సాగునీటికి, మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వుండాలని, అన్ని కోణాల్లో ఏడాది కాలం పరిశీలించిన తర్వాతనే ప్రాజెక్టుల ఆకృతులకు తుది రూపం ఇవ్వడం జరిగిందని అన్నారు.

ప్రసంగంలో చివరగా పంచాంగ ఫలితాలపై స్పందిస్తూ, పంచాంగం మార్గనిర్దేశం చేస్తుందని, అయినాకూడా మన ధర్మవర్తన, సత్ప్రవర్తనే మనకు ఆలంబనగా వుంటాయని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిగమిద్దామని, భయపడవలసిన పనిలేదని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. రాష్ట్ర, దేశ, విదేశాలల్లో వున్న తెలంగాణ బిడ్డలందరికీ సీఎం చంద్రశేఖర రావు శుభాకాంక్షలను అందజేశారు.

అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పండుగలన్నింటిలోనూ ఒక్కో గొప్ప సందేశం ఉంటుందని అన్నారు. ఈ ‘దుర్ముఖి’ సంవ త్సరానికి ‘శ్రమయేవ జయతే’ అనేది ఉప శీర్షిక కావాలని ఆకాంక్షిస్తూ, సీఎం కేసీఆర్‌ కర్తవ్య దీక్షతో తెలంగాణ ప్రగతివైపు దూసుకెళ్తుందని ప్రశంసిం చారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు పురాణం మహేశ్వర శర్మను మాడుగుల మాణిక్య సోమయాజులును, ఫణిశశాంకశర్మను, గోపీ కృష్ణశర్మను, యాదాద్రి అర్చకులు లక్ష్మీ నరసింహ ఆచార్యులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, ఉపముఖ్య మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 7న ఇరు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో నూతన తెలుగు వత్సరాది వేడుకలను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ ఉగాది పచ్చడి సేవించిన తర్వాత సిద్ధాంతి కొండగడప శ్రీధరశర్మ పంచాంగాన్ని చదివి వినిపించారు. అంతా శుభప్రదంగానే వుంటుందని అన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం పేరును చూసి భయపడే అవసరం లేదన్నారు. నరసింహ అవతారం కూడా భయ పెట్టేలాగా వుంటుంది కాని స్వామి అందరికీ మంచే చేస్తాడని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మాట్లాడుతూ మన గవర్నర్‌ గారు తెలుగుదనం ఉట్టిపడే తీరులో వస్త్రధారణ చేసి తెలుగు సంవత్సరాదిని అధికా రికంగా నిర్వహించ డం శ్లాఘనీయమని అన్నారు. ఉగాది పంచాంగకర్తలతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ప్రకటించడం ఎంతో సంతోషకరమైన అంశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఉగాది పండుగ అన్ని విషయాలను సమన్వయంగా నిర్వహించుకోవడాన్ని తెలియజేస్తుం దని అన్నారు. రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురవాలి, కరువు పోవాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మానికి ఇరు రాష్ట్రాలలోని రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Other Updates