magaదేశంలోనే అతిపెద్ద వైద్యోపకరణాల పార్కును ప్రారంభించుకున్నామని, ఈ ఘనత తెలంగాణకే దక్కిందని, ఇక చౌకగా వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన వైద్యోపకరణాల పార్కును ఆయన నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత పేద ప్రజలకు మేలు చేయాలని సీఎం చెపుతుంటారని, దానికి అనుగుణంగానే ఇప్పుడు అతిపెద్ద వైద్యోపకరణాల పార్కును ప్రారంభించుకుంటున్నామన్నారు.

ఇప్పటికే తొలిదశలో 250 ఎకరాలు కేటాయించడం జరిగిందని, అవసరమైతే మరో 200 ఎకరాల భూమి కేటాయిస్తామని తెలిపారు. 14 కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయన్నారు. కేవలం వైద్యోపకరణాలు ఏర్పాటు చేయడమే కాకుండా పరిశోధనలు, అభివృద్ధికి కూడా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 4వేల మందికి, పరోక్షంగా మరో 8వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఇక్కడి స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అవసరమైతే యువకులకు శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లో పెట్టిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఫార్మా క్యాపిటల్‌గా తయారైందని, ప్రపంచానికి అవసరమైన బల్క్‌డ్రగ్స్‌లో 35 శాతం ఇక్కడే తయారవుతున్నాయన్నారు. ఇక్కడి వైద్యోపకరణాల పార్కులో పెట్టుబడులు పెట్టడానికి కొరియా, జపాన్‌, అమెరికాలలో పర్యటించి ప్రముఖ కంపెనీల యజమానులతో మాట్లాడడం జరిగిందన్నారు. అక్కడి పారిశ్రామిక వేత్తలనుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన మూడు సంవత్సరాల్లోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు.

నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ, ఉద్యమంలో ఎలా దూసుకుపోయారో, అభివృద్ధిలో కూడా అదే ఉద్యమ స్పూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూసుకుపోతున్నాడన్నారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నాడని ప్రశంసించారు. పరిశ్రమలశాఖ మంత్రిగా కేటీఆర్‌

ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దూసుకుపోతున్నదని, ఇది కేటీఆర్‌ వల్లనే సాధ్యమైందని ప్రశంసించారు. ఇక్కడ స్థాపించిన పరిశ్రమల్లో సెమి స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ విషయంలో స్థానికులకే అవకాశం కల్పించాలని మంత్రి హరీశ్‌ పారిశ్రామిక వేత్తలను కోరారు. టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Other Updates