రైతు మురిసిన.. ప్రజలు మెచ్చిన షాపింగ్ మాల్ సిద్ధిపేట రైతన్నకు కానుకగా వచ్చింది. మార్కెటింగ్ శాఖలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సిద్ధిపేట పట్టణంలో మోడల్ రైతు బజారు నిర్మితమై విప్లవాత్మకమైన మార్పులకు నిదర్శనంగా నిలిచింది. ప్రజలు మెచ్చిన.. రైతు మురిసిన మోడల్ రైతు బజారును షాపింగ్ మాల్ గా తీర్చిదిద్దిన ఘనత మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్ రావు పనితీరుకు అద్దం పట్టింది. నిత్యం సుమారు 6వేల మందిపై చిలుకు వచ్చిపోయే వినియోగదారుల ప్రజా ప్రయోజనార్థం దాదాపు 8కోట్ల 16 లక్షల ఖర్చుతో సెల్లారు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో సిద్ధిపేట రైతు మోడల్ రైతు బజార్ నిర్మితమైంది.తాము పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు శాశ్వత చిరునామా రైతుల కళ్ల ముందు సాక్షాత్కరించింది.దేశంలోనే అత్యాధునిక మోడల్ రైతు బజారు నిర్మాణంతో కూరగాయలు సాగు చేసే రైతు కళ్లలో ఆనంద కాంతులు వెల్లి విరుస్తున్నాయి.
సిద్ధిపేట పట్టణంలోని మెదక్ రోడ్ లోని నూకసాని కుంటలో ఉన్న ఈ రైతు బజారులో అసౌకర్యాల మధ్య కూరగాయలను విక్రయించి ఇటు రైతులు, అటు వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఎటు చూసినా అపరిశుభ్రమైన వాతారణంలో కూరగాయలను విక్రయించే పరిస్థితి కనిపించేది. దీంతో పట్టణ వాసులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ కూరగాయలను కొనేవారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ ఏడాది కిందట మోడల్ రైతు బజారు కోసం రూపకల్పన చేశారు.నియోజక వర్గంలోని కూరగాయలు విక్రయించే రైతులకు, పట్టణ ప్రజలకు అవసరమైన ఈ రైతు బజారును అద్భుతంగా తీర్చిదిద్దడానికి మంత్రి ప్రత్యేక దష్టి పెట్టారు. రూ.8కోట్ల 16 లక్షల ఖర్చుతో సెల్లారు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో సిద్ధిపేట మోడల్ రైతు బజార్ నిర్మించారు. శంకుస్థాపన మొదలు ప్రారంభం అయిన తర్వాత కూడా సందర్శిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రతి అంశంపై అధికారులకు మంత్రి సూచనలు చేస్తూనే ఓ కార్పోరేట్ లుక్ తెచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ కు తీసిపోని తరహాలో ప్రభుత్వ రైతు బజారును కళాత్మకంగా నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపు ఏడాది పట్టింది. ఒకప్పుడు వానలకుతడిసి, ఎండకు ఎండి.. చలిని తట్టుకుని కూరగాయలుపెట్టుకుని అమ్ముకున్న రైతులు.. ఇప్పుడు అధునాతన హంగులతో ఏర్పాటుచేసిన ఆధునిక రైతుబజారులో దర్జాగా కూరగాయలు విక్రయిస్తున్నారు. ఏరోజుకారోజు తాజా కూరగాయలు అమ్మే మార్కెట్ కావడం, ప్రత్యేకించి షాపింగ్ మాల్ తరహాలో నిర్మాణం చేయడంతో కూరగాయలు సాగుచేసే రైతు కళ్లల్లో ఆనంద కాంతులు వెల్లివిరుస్తున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
కింద కూర్చుని కూరగాయలు అమ్మడం ద్వారా దుమ్ము- ధూళితో క్రయ విక్రయాలు జరపడమనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి లేదు. క్రిమి కీటకాలకు దూరంగా ఉండేలా 3 అడుగుల ఎత్తులో కూరగాయల క్రయ విక్రయాలు జరిపితే ఇటు రైతుకు ఇబ్బందులు ఉండవు, అలాగే వినియోగదారులకు కూడా కొనుగోలు చేసిన కూరగాయలు తాజాగా
ఉంటాయన్నది సైన్స్ చెప్పినమాట. కూరగాయల క్రయ విక్రయాలను ఇలాగే జరపాలని మంత్రి హరీశ్ ముందు చూపుతో.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 3 అడుగుల ఎత్తులో రైతుకూర్చుని క్రయ విక్రయాలు జరిపే వారికోసం ప్రత్యేక చాంబర్లు, పైనే కూర్చునేలా గద్దెల నిర్మాణం చేయించారు. ఇన్నాళ్లు కింద కూర్చుని అమ్మకాలు జరిపిన రైతులకు ఈ సౌకర్యం బాగున్నదని సంబురంతో కూరగాయల క్రయ విక్రయాలు జరుపుతున్నారు.
500 పెట్టెలు నిల్వ చేసే సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీ
రైతులు అమ్మకాలు జరిపిన తర్వాత మిగిలిన కూరగాయలను భద్రపర్చుకునేందుకు సెల్లారులో 5 మెట్రిక్ టన్నుల నిల్వసామర్థ్యంతో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేశారు. దాదాపు 500 పెట్టెల వరకు నిల్వ చేసే సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీ రాష్ట్రంలోనే మరెక్కడా లేదు.
వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి
నిత్యం రైతు బజారులో వృధాగా మిగిలిపోయే కూరగా యలు.., వ్యర్థ పదార్థాలతో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. దీంతో ఈ రైతు బజారుకు కావల్సిన విద్యుత్తును తామే స్వయంగా ఉత్పత్తి చేసుకునే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలుతీసుకుంటున్నారు.ఇందు కోసం ప్రతి ఫ్లోర్ లో చెత్త బుట్టలు ఏర్పాటు చేశారు.
ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పట్టణ అభివృద్ధి ప్రచారం..
రోజువారీ కూరగాయల ధరల పట్టికను ప్రదర్శించేలా ప్రతి ఫ్లోర్‌లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. రైతు బజారు బయట ఆవరణలో రూ.28 లక్షలతో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ లో సిద్ధిపేట పట్టణ అభివృద్ధితో పాటు రైతు బజారులో కూరగాయల ధరలు, పట్టణంలో చేపడుతున్న తడి, పొడి చెత్త గురించి అవగాహన కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొదటి అంతస్తులో ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వసతి కూడా ఉన్నది. నగదు రహిత లావాదేవీలు కూడా జరిపేందుకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు స్వైపింగ్ మిషన్లు, తూకంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్ట్రానిక్ మిషనరీలు,రైతుల కోసం ప్రతి ఫ్లోర్‌లో టాయిలెట్స్, ఎల్‌ఈడీ లైటింగ్ సదు పాయం, సీసీ కెమెరాల నిఘా, పరిశుభ్రతను సూచిం చేలా నీతివాక్యాలు, షాపింగ్ మాల్‌ను తలపించేలా సకల వసతులు, మరుగుదొడ్ల సౌకర్యాలు, జనరేటర్, అలాగే రైతుల కోసం మినరల్ వాటర్ ఫ్లాంట్, కూలర్, వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి.
నిత్యం600 క్వింటాళ్ల కూరగాయలు అమ్మకాలు
సిద్ధిపేట రైతు బజారును దేశంలోనే ఆదర్శంగా ఉండేలా.. షాపింగ్ మాల్ తరహాలో సకల సౌకర్యాలతో నిర్మించాం. నిత్యం సుమారు 6వేల మంది వరకూ వినియోగదారుల తాకిడి పెరుగుతుంది. ఇక్కడఈ మోడల్ రైతు బజారులో సీజన్‌లో ప్రతి రోజు 500 నుంచి 600 క్వింటాళ్ల కూరగాయలను విక్రయిస్తున్నారు. ప్రతిరోజు రూ.10 లక్షల మేర టర్నోవర్ వరకు జరుగుతుండగా., సీజనులేనప్పుడు 300 నుంచి 400 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతూరూ.6 లక్షల మేర టర్నోవర్ జరుగుతుంది. కూరగాయలు విక్రయాలు జరిపే వారి కోసం ప్రత్యేక చాంబర్లు, పైగా వారు పైనే కూర్చునేలా గద్దెల సౌకర్యం కల్పించాం. నిత్యం మిగిలిపోయిన కూరగాయలను నిల్వ చేసుకునేందుకు ఓ కోల్డ్ స్టోరేజ్ పెట్టాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోల్డ్ స్టోరేజ్ ఉన్న ఏకైక రైతు బజారు మనదే.
మామిడాల రాము
– రాష్ట్రనీటి పారుదల,
మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు