maga

రాజాబహద్దుర్‌ వేంకటరామారెడ్డి స్థాపించిన విద్యాసంస్థలు దేశంలోనే ప్రఖ్యాతి కలిగిన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా తయారు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా నిర్వాహకులు కృషి చేయాలని సీఎం కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని బుద్వేల్‌ గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో రెడ్డి హాస్టల్‌ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.

దేశంలోని వివిధ కంపెనీలు ఇక్కడకు వచ్చి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో మన పిల్లలను సెలెక్ట్‌ చేసుకోవాలని అభిలషించారు. వేంకటరామారెడ్డి శిఖరాయమాన వ్యక్తిత్వానికి దీటుగా విస్తరించాలన్నారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ప్రఖ్యాత విద్యాసంస్థల ప్రాంగణంగా ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం మరో ఐదెకరాల స్థలాన్ని రెడ్డి హాస్టల్‌కు కేటాయిస్తున్నట్టు సభావేదికపైనే ప్రకటించారు. ప్రస్తుతం పది కోట్లు కేటాయించామని, అవసరమనుకుంటే మరో పది కోట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. అవికూడా సరిపోవనుకుంటే బయట నుంచి మరో పది కోట్లు తీసుకువద్దామని అన్నారు. అందరికీ విద్యావకాశాలు కల్పించాలని రాజా బహద్దుర్‌ వేంకటరామారెడ్డి హాస్టల్‌ను ప్రారంభించారని, ఇదే స్పూర్తితో దీనిని మంచి విద్యాసంస్థల సముదాయంగా అభివద్ధి చేయాలన్నది తన కోరికని సీఎం తెలిపారు. మహిళాహాస్టల్‌కు ఐపీఎంలో 1500 గజాల స్థలాన్ని ఇస్తామని ప్రకటించారు.

అప్పా పేరుతో ఉన్న పోలీస్‌ అకాడమీకి రాజా బహద్దుర్‌ వేంకటరామారెడ్డి పోలీస్‌ అకాడమీ అని పేరుపెట్టామ న్నారు. తెలంగాణలో ఎందరో గొప్పగొప్ప నాయకులు ఉన్నా వారిని సమైఖ్య రాష్ట్రంలో మరుగున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒకటిన్నర శతాబ్ద కాలం క్రితం వికసించిన కుసుమం.. చారిత్రాత్మక పురు షుడు మన వేంకటరామారెడ్డి. ఆయన చాలా సంపన్నులు. వనపర్తి సంస్థానం రాజారామేశ్వర్‌రావు వీరి తాతగారు. చదువుకొని కష్టపడి పైకి వచ్చారు. వారి తల్లి చిన్నతనం లోనే చనిపోయినా దీక్షతోని, పట్టుదలతోని పైకి వచ్చి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాన్ని స్వీకరించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కొత్వాల్‌ అయ్యారు. కొత్వాల్‌ అంటే నేటి డీజీపీ పోస్టుతో సమానం. ఆ పదవిలో 14 ఏండ్లు కొనసాగారు. ఆయనకు నిజాం రాజులు రాజ బహద్దుర్‌ బిరుదు ఇచ్చి సత్కరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రిటిష్‌ప్రభుత్వం ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ అనే బిరుదు ఇచ్చిం దన్నారు. వేంకటరామారెడ్డి ప్రజల కోసం, పేదవాళ్ల కోసం, అవకాశాలు లేని వాళ్ల కోసంఆలోచించారు. వీళ్లకు విద్యరావాలి, దురలవాట్లు రావద్దు, మంచి దేహదారుఢ్యం ఉండాలి, అన్ని రకాలుగా సమాజం పురోగమించాలని చెప్పి.. దృఢ సంకల్పం తీసుకున్నారు. నేను రాజుగారి దగ్గర ఉద్యోగంలో ఉన్నా.. ఏమన్న చేస్తే రాజుగారు ఏమనుకుం టారోనని బెదరలేదు. ఆ రోజు ఉర్దూ మీడియం ఉన్నప్పటికీ తెలుగు మీడియం స్కూళ్లను ఏర్పాటుచేశారు. దళితులకోసం ప్రత్యేక పాఠశాల నిర్వహించారన్నారు.

నా కోరిక మీరు తీర్చాలి..

మీరు అడిగినవన్నీ ఇచ్చిన.. నా కోరిక మీరు తీర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్వాహకులను కోరారు. ఇక్కడ 15 ఎకరాలు ఉంది. రూ.10 కోట్లు ఉన్నయి. అవసరమైతే మరో రూ.10 కోట్లు ఇస్తా. ఇంకా రూ.10 కోట్లు బయటకెళ్లి తీసుకుందాం. వేంకటరామారెడ్డిది ఎంత శిఖరాయమాన వ్యక్తిత్వమో అంతే గొప్పగా ఈ కొండ మీద.. హైదరాబాద్‌లో చిరస్థాయిగా ఆయన పేరు నిలిచేలా రాజా బహద్దుర్‌ వేంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్‌ టవర్‌ నిర్మించాలి. మంచి కోర్సులు ఉండే విద్యాసంస్థల నిర్మాణం జరుగాలి. ఇందులో ఒక్క కులానికి కాదు. అందరికీ అవకాశం కల్పిద్దామన్నారు. రాబోయే కాలంలో ఈ విద్యాసంస్థలు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మండలి ఛైైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్‌, మంత్రులు కే. తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి,టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత జితేందర్‌రెడ్డిలతో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, మైనింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ రఘునందన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి హాస్టల్‌కు 10కోట్లు మంజూరు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్‌ నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు రూ.10 కోట్లను మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేక అబివృద్ధి నిధి కింద రాజ బహద్దుర్‌ వేంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ (ఆర్‌బీవీఆర్‌ఆర్‌)కి ఈ నిధులను కేటాయించారు. హాస్టల్‌ భవన సముదాయ నిర్మాణానికి అవసరమైన అంచనాలను రూపొందించి, వివరాలను సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆదేశించారు.

రాజా బహద్దుర్‌ వేంకటరామారెడ్డి విద్యాసంస్థలు

Other Updates