భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైల్ త్వరలో పరుగులు పెట్ట నుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో నవంబరు చివరివారంలో ప్రారంభింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తు న్నది. మొదట నాగోల్ నుంచి మియాపూర్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభింప చేయడానికి పనులన్ని పూర్తయ్యాయి. ఈ మార్గంలో ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు. మన భాగ్యనగరంలో పరుగులు పెట్టనున్న మెట్రోరైల్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైవర్ రహితంగా పట్టాలపై పరుగులు పెట్టే ఈ మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకులను టికెట్లు పరిశీలించడానికి ఎలాంటి టికెట్ కలెక్టర్లు ఉండరు. టికెట్ ఉంటేనే మెట్రోరైల్ ఎక్కేందుకు వీలుకలిగేలా సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే 30 కిలోమీటర్ల పొడవైన మెట్రోమార్గాన్ని ఒకేసారి ప్రారంభించడం కూడా మరో ప్రత్యేకతగా నిలవనుంది. మెట్రో రైల్ ప్రారంభమైతే నగరవాసులకు కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు.
పది నిమిషాలకొక రైలు
నవంబరులో ప్రారంభించబోమే మెట్రోరైల్ పది నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నారు. నాగోల్ నుంచి అమీర్‌పేట మీదుగా మియాపూర్ నడిచే ఈ రైలు నేరుగా వెళ్ళే వీలు లేదు. అమీర్‌పేట దగ్గర రైలు మారాల్సి ఉంటుంది. రద్దీని బట్టి రైళ్ళ ఫ్రీక్వెన్సీని మూడు నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే వీలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం 5.30కి మొదటి రైలు ప్రారంభమైతే రాత్రి 11.30కి చివరి రైలు ఉంటుంది. రైలు మూడు కోచ్‌లతో నడుస్తుంది. ఒక్కో రైలులో 965 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు 12 కిలోమీటర్ల దూరంలో మొత్తం 10 స్టేషన్లు
ఉండగా, ఒక్కో స్టేషన్‌లో అరనిమిషం మెట్రోరైల్ ఆగుతుంది. మియాపూర్ నుంచి అమీర్‌పేట చేరుకోవడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. అలాగే అమీర్‌పేట నుంచి నాగోల్ వరకు 18 కిలోమీటర్ల దూరానికి 25 నిమిషాలు పడుతుంది. ఈ మార్గంలో 14 స్టేషన్లు ఉంటాయి.
ఏడు బస్సులు – ఒక మెట్రో
మెట్రోరైల్‌లో ఒక్కసారి ఏడు బస్సుల్లో ప్రయాణించేంత మంది ప్రయాణీకులు వెళ్లే వీలుంది. ఇలా మెట్రో రైలు పూర్తి స్థాయిలో మూడు కారిడార్లలో 57 మెట్రోరైళ్ళు నడవడం ప్రారంభమైతే గంటకు 60 వేలమంది ప్రయాణీకులు అందులో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మెట్రోరైలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే నగరంలోని ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
పనులు పూర్తి కావాల్సిన కారిడార్లు
1) మియాపూర్ నుంచి ఎల్.బి.నగర్ కారిడార్ 29 కిలో మీటర్ల దూరం, 27 స్టేషన్లు. ఇది 2018 చివరినాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
2) జూబ్లీ బస్‌స్టేషన్ సికింద్రాబాద్ నుంచి పాతబస్తీ ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం, 16 స్టేషన్లు, 2018 చివరినాటికి పూర్తి చేయాలని అంచనా వేశారు.
3) రాయదుర్గం నుంచి నాగోల్ వరకు 29 కిలోమీటర్ల దూరం, 24 స్టేషన్లు. ఇది కూడా 2018 చివరినాటికే పూర్తి చేయాలని సంకల్పించారు.