ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా పేరొందిన మన దేశంలో మరోసారి దేశ విధానకర్తలను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. పదిహేడో లోక్‌ సభకు ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోడా ఈ ఎన్నికల ప్రక్రియ తేదీలను ప్రకటించారు.దేశంలోని 543 లోక్‌ సభాస్థానాలకు ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకూ ఏడుదశల్లో పోలింగ్‌ జరగనుంది, తొలిదశ పోలింగ్‌ ముగిసిన 42 రోజుల తరువాత దేశవ్యాప్తంగా మే 23న ఒకేసారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్‌ సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటుగా, దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 39 అసెంబ్లీ స్థానాల భర్తీకి కూడా

ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.

మన తెలంగాణ రాష్ట్రంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా తొలిదశలోనే ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరుగనుంది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌ లోని 25 పార్లమెంటు స్థానాలతోపాటు, ఆ రాష్ట్ర అసెంబ్లీకి 175 స్థానాలలో ఓకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి.వీటికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి, ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

ప్రజాస్వామిక దేశంలో ఓటు వెలకట్టలేనిది. సామాన్యుడి చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం ఇది. ఏప్రిల్‌ 11న జడరుగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం, రాష్ట్రంలో మొత్త ఓటర్ల సంఖ్య 2,96,97,279గా ఉంది. ఇందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు ఉన్నారు. ముఖ్యంగా 18-19 ఏళ్ళ వయసున్న 6,52,744 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటుహక్కు పొందారు. వీరిలో 3,65,548 మంది పురుషులు, 2,87,103 మంది మహిళలు, 93 మంది ఇతరులు ఉన్నారు. రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన ఈ హక్కుతో మన ప్రభుత్వాలను మనమే ఎన్నుకుంటాం. ఒక్కోసారి ఒక్క ఓటుతోనే ఫలితాలు తారుమారైన సందర్భాలూ ఉంటాయి. అందుకే ఓటు హక్కుగలిగిన ప్రతి పౌరుడూ ఓటువిలువ తెలుసుకొని, దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఓటు మన హక్కేకాదు, ఓటు వేయడంకూడా మన బాధ్యతగా భావించాలి. ఎన్నికల సంఘం కూడా పోలింగ్‌ శాతం పెంచేందుకు, ఓటర్లలో అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందుకే, నిజాయితీగా ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం.

Other Updates