రాష్ట్ర ప్రజలకు కొత్త గవర్నర్ తమిళిసై సందేశం
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో అన్నిరంగాలలో అభివృద్ధి సాధిస్తోందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసించారు. రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమిళిసై రాష్ట్ర ప్రజలనుద్దేశించి దూరదర్శన్‌లో మాట్లాడారు. ముందుగా ”తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని తెలుగులో ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు వినాయక చవితి, ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్గదర్శకంలో, సమర్ధ నాయకత్వంలో సాగుతున్న రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నందుకు తనకెంతో ఆనందంగా ఉన్నదని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం స్థిరమైన, ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించినందుకు, సమాజంలోని అన్నివర్గాల ప్రజలు ప్రగతి సాధిస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉన్నదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిమతాలకు చెందిన అన్ని పండుగలకు సమాన ప్రధాన్యమి స్తోందని, గంగా జమునా తెహజీబ్ ను పూర్తి నిబద్ధతతో పరిరక్షిస్తోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం 2018-19లో 14.84 శాతం జి.ఎస్.డి.పి సాధించిందని, 2014 లో నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర ఆదాయం ప్రస్తుతం 8.66 లక్షల కోట్లకు చేరుకున్నదని ప్రశంసించారు. పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్నిరకాల సేవలు పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. మారుమూల గ్రామాలలో, పట్టణాలలోని ప్రజలకు సయితం ఇంటిముంగిటకే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ రాష్ట్ర పరిపాలనలో నూతనాధ్యాయంగా నిలుస్తుందని ఆమె చెప్పారు.
పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ , రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి విభిన్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి ఆరోగ్య కార్యక్రమాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ ప్రశంసించారు.
వృధాగా సముద్రం పాలవుతున్న 575 టి.ఎం.సిల గోదావరి జలాలను ప్రజలకు తాగునీరుగా, సాగునీరుగా, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతమని, రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ప్రపంచ దష్టిని ఆకర్షించిందని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, కృష్ణానదీ జలాలను కూడా ఒడిసిపట్టి వినియోగించేందుకు ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం కూడా తనకు ఆనందం కల్గిస్తోందన్నారు.
పరిపాలనా రంగంలో, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనలో ఐ.టికి ప్రాధాన్యత ఇస్తూనే, సాంప్రదాయంగా వస్తున్న చేనేతవృత్తి కార్మికులు, గీత కార్మికులను విస్మరించకుండా వారి అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయడం విశేషమన్నారు. గతంలో 52 వేల కోట్లుగా ఉన్న ఐ.టి ఎగుమతులు నేడు లక్షా 10 వేల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. మెట్రో రైలు, శాంతిభద్రతల పరిరక్షణతో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ, దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిపారన్నారు.
పవిత్ర హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం అదే స్ఫూర్తితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, పునరుజ్జీవనం కోసం కృషి చేస్తోంది. బంగారు తెలంగాణకు గట్టి పునాదివేస్తూ, నేడు తెలంగాణ రాష్ట్రం సగర్వంగా, ఆదర్శ రాష్ట్రంగా దేశంముందు నిలిచిందని అంటూ, రాజకీయాలు , సామాజిక విబేధాలను పక్కనపెట్టి బలమైన దేశం, రాష్ట్రం నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు.
నూతన గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం
రాష్ట్ర నూతన గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ సెప్టెంబర్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు.
ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తమిళిసై తన తండ్రి ఆనంద్‌కు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన మండలి ఉప ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌లతోపాటు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయిన బండారు దత్తాత్రేయ, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ఆ రాష్ట్ర మంత్రులు కొందరు, గవర్నర్ కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర రాజన్ తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా నియమితు లయ్యారు. ఆమె 1961 జూన్ 2న లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో జన్మించారు. ఆమె స్వతహాగా వైద్యురాలు. మద్రాసు మెడికల్ కాలేజీలో ఎం.బి.బిఎస్ చదివారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే విద్యార్థి సంఘ నాయకురాలిగా గుర్తింపు పొందారు. మెడికల్ పిజీ అనంతరం విదేశాలకు వెళ్ళి వివిధ విభాగాలలో ప్రత్యేక శిక్షణ పొందారు. అనంతరం చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్ళపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ రోజుల్లోనే రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆమె భర్త సౌందర రాజన్ కూడా ప్రముఖ డాక్టర్ కావడం విశేషం. తమిళిసై సౌందర రాజన్ బి.జె.పి తమిళనాడు శాఖ అధ్యక్షురాలిగా పనిచేస్తుండగా మన రాష్ట్ర గవర్నర్‌గా నియమితు లయ్యారు.