”నా జీవితంలో చేసిన అతిగొప్ప పని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే రైతులకు జీవితబీమా సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.హైదరాబాద్ లోని హెచ్.ఐ.సి.సి లో జరిగిన రైతుబంధు జీవితబీమా పథకం అవగాహనా సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగానే ఎల్.ఐ.సి ఛైర్మన్ వి.కె. శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి రైతుబంధు జీవితబీమా పథకానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై సంతకాలుచేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ, రైతులకు సంబంధించి ఎంతో విలువైన పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోందని, రైతులను ఆదుకోవడానికే రైతుబంధు జీవితబీమా పథకాన్ని రూపొందించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 57 లక్షల మంది రైతులకు 18 నుంచి 59 సంవత్సరాల వారికి ఈ బీమా వర్తిస్తుందని, ఏ కారణంచేతనైనా రైతు మరణిస్తే, రూ. 5 లక్షల బీమామొత్తం రైతుకుటుంబానికి అందుతుందని చెప్పారు. రైతు మరణ దృవీకరణ పత్రాన్ని గ్రామపంచాయితీలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు సి.ఎం చెప్పారు. ఈ బీమా క్లయిములను 10 రోజుల్లోనే అందజేస్తామని ప్రకటించిన ఎల్.ఐ.సి సంస్థకు రాష్ట్ర రైతులందరి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
రైతుబంధు సాగుకు పెట్టుబడి పథకం ద్వారా 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని ప్రముఖ దినపత్రికలు పేర్కొన్న విషయాన్ని సి.ఎం గుర్తుచేశారు. దేశం అంతా మనవైపు చూస్తోందన్నారు. రైతుబంధు పెట్టుబడి సహకారాన్ని తాను తీసుకోలేదని, కానీ, జీవితబీమాను మాత్రం తీసుకుంటానని కె.సి.ఆర్ అన్నారు. రాష్ట్రంలో ఒకటి, రెండు ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపు 32 లక్షలమంది వరకూ ఉన్నారని, వారందరికీ జీవితబీమా ధైర్యాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
సాగుకు పెట్టుబడి, రైతుకు బీమా, సాగుకు నీళ్లు, నిరంతర విద్యుత్ అందించడమే సంకల్పంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇక రైతులు కష్టాలనుంచి బయటపడతారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.రైతు క్షేమంతోనే మనందరి క్షేమం ముడిపడివున్నదని అన్నారు.
రైతు బీమాపత్రాలు నింపేపని వ్యవసాయ విస్తరణాధికారులు చేపట్టాలని, రైతు పూర్తిపేరు, రైతు తండ్రి, లేదా భర్త పేరు, నామినీ పేరు, మొబైల్ నంబరు ఖచ్చితంగా రికార్డుచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఈ బీమా పథకం అమలులోకి రావాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ వాతావరణ పరిస్థితుల ఆధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటకాలనీలు ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సి.ఎం చెప్పారు.మన అవసరాలకు తోడు దేశంలో వున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పంటలు పండించాలని అన్నారు.రైతుల అభిప్రాయాలు పరస్పరం పంచుకోవడానికి వీలుగా రైతువేదికల నిర్మాణాలను వీలైనంత త్వరలో ఏర్పాటుచేయాలన్నారు.రాష్ట్రంలోని 2,500 వ్యవసాయ క్లస్టర్లలోని వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా యంత్రపరికరాల అవసరాలను, స్థితిగతులను వెంటనే తెలియజేయాలన్నారు. ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకుండా తగిన ప్రణాళికను, మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టాలని సూచించారు.రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులతో రైతులు మొగులు చూడనవసరం లేని వ్యవసాయం వైపు రాష్ట్రం పురోగమిస్తోందని అన్నారు.
కె.సి.ఆర్ నిజంగానే ‘రైతుబంధు’
జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి) ఛైర్మన్ వి.కె. శర్మ మాట్లాడుతూ, రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రూపొందించిన రైతుబంధు జీవితబీమా పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రైతులకోసం ఎంతో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిజంగానే రైతుబంధు అని ఆయన ప్రశంసించారు.తాను కూడా స్వయంగా ఒక రైతునని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని శర్మ చెప్పారు. భారత జీవితబీమా సంస్థ కేవలం మన దేశంలోనేగాక, ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద బీమా సంస్థ అనీ, మన దేశంలో 29 కోట్లమందికి పైగా బీమాసేవలను అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
”దేశంలో అనేక రాష్ట్రాలలో నేను పనిచేశాను.కానీ, మరే రాష్ట్రంలోనూ రైతుల మేలుకోరుతూ చేపట్టిన ఇటువంటి బీమాపథకాన్ని నేను చూడలేదు”. అని శర్మ చెప్పారు.35 సంవత్సరాలలోపు యువ వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల సేవలో ఉండటం ముదావహమన్నారు. రైతుబంధు జీవితబీమా క్లయిములను 10 రోజుల్లోనే చెల్లించి తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు.వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ డా.ఎం.జగన్ మోహన్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.