మంచి పుస్తకం కోసం ఎదురుచూసే పాఠకలోకానికి వేద పబ్లికేషన్స్ ద్వారా మల్లాది రామలక్ష్మి ‘దైవనిధి’ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. సృష్టి, భారతీయ వేద సంస్కృతి, ఉపనిషత్తుల గురించే గాకుండా భగవదవతారాలు, మన మహర్షులు, క్రియాయోగాలు, పుణ్య క్షేత్రాలు, పండుగలు, అష్టాదశ పురాణాలతో పాటు నాయనార్లు, అళ్వారులు, ఆండాళ, పుష్కరాలు, కుంభమేళా లాంటి ఎన్నో విషయాల గురించి సూక్ష్మంలో మోక్షంలా చిన్నగా వివరించినా వున్నదంతా చెప్పింది రచయిత్రి. ఆధ్యాత్మిక విషయాలన్నీ ఊహించిరాసేవి కావనీ, మూల గ్రంథాల నుండి జాగ్రత్తగా సేకరించాలనే సంగతి అందరికి తెలిసిందే అయినా ఆ పని అనుకున్నంత సులభం కాదనేది నగ్న సత్యం.
దాదాపుగా నూట యిరవైకి పైగా అంశాలను సేకరించి, ఆలోచించి అందించిన ఈ ఉత్తమ గ్రంథóంలోని విషయాలన్నీ మనకు తెలిసినట్టే అన్పించినా చాలా విషయాలు తెలియనివే తెలియజేయబడ్డాయి. నలభైకి మించి పుణ్యక్షేత్రాల గురించి చదువుతున్నప్పుడు దృశ్యకావ్యంలా అనిపించి ఆయా స్థలాల్లో మనమున్నట్టు అనుభూతి పొందడం, రచయిత్రి రామలక్ష్మి రచనా పటిమకు నిదర్శనంగా చెప్పవచ్చు. పురాణాల గురించి చక్కటి వివరణ, పండుగల ప్రాశస్త్యం, దివ్యపురుషుల భవ్య చరితలన్నీ ఈ పుస్తకంలో పొందుపరచడం వల్ల ఒక్క చోటనే అన్ని విషయాలు తెలుస్తున్నాయన్న తృప్తి, ఆనందం కలుగుతుంది. ప్రతి విషయానికి చక్కటి ఫోటోను మనకు అందించడం వల్ల కూడా మన ఆధ్యాత్మికచింతన మరింత పెరుగుతుందనడంలో అతిశయోక్తేమీ లేదు. మనలోని భగవద్భక్తి ఇంకొంచెం పెరగడానికీ ‘దైవనిధి’ మనకెంతో ఉపకరిస్తుంది. అయితే, ఫోటోల సైజ్ కొంచెం తగ్గిస్తే విషయసేకరణ మరింత జరిగేదేేమోననే భావన మాత్రం కలుగుతుంది. ఏదేమైనా ప్రతివారికీ మిక్కిలి ఉపయోగకరమైన ఈ పుస్తకం అందరిండ్లల్లో వుండదగినది.
పుస్తకం : దైవనిధి, రచన : మల్లాది రామలక్ష్మి
పేజీలు, 320, వెల : 300/-
ప్రతులకు: వేద పబ్లికేషన్స్, 10-2-10,
మాటూరు అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్ నం. 306, ఏ.సి.గార్డ్స్, హైదరాబాద్ – 5000 004
– కన్నోజు లక్ష్మీకాంతం.