gundappa

న పాటలతో, రచనలతో, కవితలతో, గానంతో సమాజాన్ని కదిలించి, దోపిడీని ప్రశ్నించిన కవి గూడ అంజయ్య. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, సామాన్యుల బతుకులు ఏవిధంగా దోపిడీకి గురవుతున్నాయో జీవితానుభవం ద్వారా తెలుసుకుని, ప్రజలను జాగృతం చేసే దిశగా రచనలు సాగించాడు. దొరలు, భూస్వాముల దోపిడీని ప్రశ్నిస్తూ అన్ని పనులు మనమే చేస్తే మధ్యలో దొరల పెత్తనమేందంటూ ‘దొర ఏందిరో’ అనే పాటలో గ్రామాలలో భూస్వాముల అణచివేత చర్యలను ప్రశ్నించారు. ఈ పాట సంచలనం రేపింది. 16 భాషల్లో తర్జుమా అయ్యింది. ఉపాధి వెతుక్కుంటూ గ్రామాలను విడిచి వలసలు వెళుతున్న యువకులకు వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పడాన్ని తెలియచేస్తూ ‘భద్రం కొడుకో కొడుకో కొమురన్న జర’ రాసిన పాట గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కంటతడి పెట్టించింది.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఎన్నో పాటలను గూడ అంజయ్య రచించారు. ‘ఎత్తర తెలంగాణ జెండా’, ‘అయ్యోడివా..నీవు అమ్మోడివా..’ అంటూ ఆంధ్రా దోపిడీదారులను ప్రశ్నించిన తీరు ఆయన కలానికి ఉన్న పదునును తెలియచేస్తుంది. ఇలాంటి పాటలతో ప్రేరేపితులైన ఎందరో యువకులు తెలంగాణ రాష్ట్ర పోరాటంలోకి ఉరికారు. ఇలా తన పాటలతో యువకులను ఉర్రూతలూగించి, తెలంగాణ పోరాట కదనరంగం వైపు నడిపించిన ప్రజాకవి అంజయ్య జూన్‌ 21న కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తుర్కయంజాల్‌ సినర్జీ కాలనీలోని తన నివాసంలో 62వ ఏట అసువులు బాసారు.

ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో 1955, నవంబర్‌ ఒకటిన అంజయ్య జన్మించారు. లక్సెట్టిపేటలో ఇంటర్‌ పూర్తి చేసి, హైదరాబాద్‌లో బీఫార్మసీ చదివారు. చదువు పూర్తయ్యాక ఉట్నూర్‌లో ఫార్మసిస్టుగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో కొనసాగుతూనే ఎన్నో ఉద్యమ గీతాలను రచించారు. సినిమాల్లో పాటలు రచించడం ప్రారంభించాక హైదరాబాద్‌కు మకాం మార్చారు.

అవార్డులు, సత్కారాలు

గూడ అంజయ్య రచనలకు పలు అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.

1986లో సాహిత్య రత్న బంధు అందుకున్నారు. 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుంచి అవార్డు అందుకున్నారు. 1996లో జగిత్యాలలో విశాల సాహితీ సంస్థ సన్మానం. 2000లో గండె పెండేరా బిరుదుతో సత్కారం. 2004లో నవ్య సాహిత్య పరిషత్‌ నుంచి మలయశ్రీ సాహితి అవార్డు. 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.

ముఖ్యమంత్రి సంతాపం

ప్రజాకవి గూడ అంజయ్య మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఎన్నో సామాజిక అంశాలపై కూడా అంజయ్య గేయాలు రాశాడన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అంజయ్య కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Other Updates