domskonda

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 96 కి.మీ. దూరంలో ఉన్న దోమకొండ ఖిల్లా నిజామాబాద్‌ జిల్లా మొత్తానికి మకుటాయమానంగా నిలుస్తుంది. దక్షిణభారతదేశంలో నిజాం రాజుల పరిపాలన వారి రాజ్య విస్తరణ ప్రభావం దక్కను ప్రాంతంలో తీవ్రంగా ఉన్న రోజుల్లో నిజాములు అనేక చిన్న చిన్న సంస్థానాలని, ప్రాంతాలని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు. మహారాష్ట్ర నుండి తమ రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతానికి విస్తరిస్తున్న క్రమంలో వారు ఈ దోమకొండ కోటను కూడా వశపరచుకోవటం జరిగింది.

అంతకుముందు కాలంలో రెడ్డిరాజులు దోమకొండ కోట నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఆ రెడ్డిరాజులు కామినేని వంశానికి చెందినవారు. తెలంగాణలో మధ్య యుగం నుండే అనేకమంది సామంతరాజులు సంస్థానాధీశులు వివిధ చక్రవర్తుల పాలనలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. కాకతీయులకాలం నుంచే వీరంతా వివిధ ప్రాంతాలకు సంస్థానాధీశులుగా సామంతరాజులుగా పాలకులుగా ఉండి ఆ ప్రాంతాన్ని పాలించేవారని చారిత్రక కథనం. వివిధ చక్రవర్తుల రాచరిక వ్యవస్థను తమ ప్రాంతాల్లో మరింత పటిష్టం చేయడానికి సంస్థానాధీశులు కూడా తమ ప్రాంతాలలో రాజులమాదిరిగానే ప్రవర్తించారు. తమ అవసరాలకోసం మూలకేంద్రాలను కూడా వారు మార్చుకునేవారు. తమ తమ సంస్థానాలలో వారు పెద్ద గడీల వంటి నిర్మాణాలను శత్రుదుర్భేద్యమైన కోట ల్లాగే నిర్మించుకునేవారు.

దోమకొండ నిజామాబాద్‌ జిల్లాలో ఒక మారుమూల గ్రామం. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దోమకొండ కోట గురించి చాలామందికి ఇప్పటికీ తెలియదు. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి పట్టణానికి 15 కి.మీ దూరంలో వున్న ఈ కోటకు ఎంతో ఘనమైన చరిత్ర వుంది. తెలంగాణ ప్రాంతంలో పెద్ద సంస్థానాలలో పేరున్న ‘దోమకొండ కోట’ పాకనాటి రెడ్డి శాఖకు చెందిన కామినేని వంశస్తులది. కామినేని వంశస్తులకు మూల పురుషుడు కామారెడ్డి. అయితే చరిత్రలో ఈ పేరు కామినేని చౌదరిగా మనకు కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో కుతుబ్‌షాహీల పాలనలో ఈ సంస్థానం బాధ్యతలను చేపట్టారు కామారెడ్డి వంశస్తులు. అప్పటినుండి నిజాముల పాలన ముగిసే వరకూ నిజాం రాజ్యంలో దోమకొండ సంస్థానంగా కొనసాగింది. నిజాం సామంతులైన కామినేని వంశస్తుల ఆధీనంలో దోమకొండ, కాసాపురం, సంగమేశ్వరం, మహమ్మదాపురం, విసన్నపల్లి, బాగోత్పల్లి, కుందారం, పాల్వంచి, దేవునిపల్లితో సహా 40 గ్రామాలుండేవి. ఈ వంశస్తులు 17వ శతాబ్ధంలో తమ సంస్థాన కేంద్రాన్ని బిక్కనవోలు నుండి కామారెడ్డిపేటకు మార్చారు. కొంత కాలానికి కామారెడ్డి నుండి దోమకొండకు మార్చారు.

దాదాపు 2 శతాబ్ధాల పాటు దోమకొండ కేంద్రంగానే వారు తమ రాచరిక పాలనను కొనసాగించారు. 18వ శతాబ్దంలో దోమకొండలో వారు కోటలాంటి పెద్ద గడిని నిర్మించుకున్నారు. ఈ గడి వారి రాజ వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది. కామినేని వంశానికి చెందిన అనేకమంది దోమకొండ సంస్థానాన్ని కేంద్రంగా చేసుకొని తమ పాలనగావించినవారే. కామినేని రాజరాజేశ్వరరావు దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ సంస్థానాన్ని పాలించారు. ఆ తరువాత ఆయన సోదరుడు రాజా రామచంద్రరావు పాలనాబాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో అధికార దాహం రాజ వంశీయుల మధ్య గొడవలు వచ్చేలా అగ్గి రాజేసింది. అది చివరకు వారు కోర్టు మెట్లు ఎక్కేవరకూ చేరింది. రాజరాజేశ్వరరావు హయాంలోనే ఈ కోటను నిర్మించారు. దోమకొండ కోట దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. తెలంగాణలో సంస్థానాధీశులు నిర్మించుకున్న అతి పెద్ద గడిలలో ఇది ఒకటి. సామంతరాజుల వైభవానికి చిహ్నంగా వున్న కోటలాంటి ఈ గడికి ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టస్థానికులు ఈ ప్రాంతాన్ని ‘దోమకొండ గడి, దోమకొండ ఖిల్లా’ ప్రాంతమని పిలుస్తారు. ‘డిఫెన్స్‌ ఆర్కిటెక్చర్‌’ అంటే శతృవుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా శత్రు దుర్భేధ్యమైన రాతి ప్రహరీగోడను నిర్మించుకోవడం ఈ ఘడి ప్రత్యేకత. 40 అడుగుల ఎత్తులో వున్న ఈ ప్రహరీగోడ దోమకొండ కోట రాజసాన్ని ఇనుమడింపజేసేలా కనబడుతుంది. కోటచుట్టూ పెద్ద నీటి కందకం వుంది. పెద్ద పెద్ద కోటల చుట్టూ ఉన్న కందకాల్లో నాటిరాజులు మొసళ్ళను ఉంచినట్టు ఇక్కడ కూడా కొన్ని మొసళ్ళను విష సర్పాలను నీటిలో వదిలేవారట. ఈ రక్షణ వలయాన్ని దాటి శత్రువు ముందుకు రావడమనేది సాహసంతో కూడుకున్న పనేకాదు, చావుతో సమానమని చెప్పవచ్చు. ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం జరుపుకున్న కోట. తెలంగాణ ప్రాంతంలో రాజులు నిర్మించుకున్న అనేక కోటలను తరువాతి కాలంలో వచ్చిన సంస్థానాధీశులు, దొరలు, ఆక్రమణ చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అలాగే కాకతీయులు నిర్మించుకున్న ఈ కోట అనంతర కాలంలో కామారెడ్డి వంశస్తులు ఆక్రమించి తమ పాలనా సౌలభ్యం కోసంగడిగా మార్చి ఇక్కడ అధికారం చెలాయిం చారని ఒక కథనం. దోమకొండ కోట చుట్టూ ఎత్తయిన ప్రహరీగోడతో పాటు ఎత్తయిన బురుజులు కనిపిస్తాయి. రాజుల కోటలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ కోటను తీర్చిదిద్దుకున్నారు ‘కామినేని వంశస్తుల’ సంస్థానాధీశులు. సాధారణంగా రాజుల కోటలకు మాత్రమే కనిపించే కట్టుదిట్టమైన భద్రత ఈ దోమకొండ కోటలోనూ మనకు కనిపిస్తుంది. ఆయా సంస్థానాలను కొన్ని వందల సంవత్సరాల పాటు పాలించడంతో సామంతులు కూడా నాటి కాలంలో అంతులేని గొప్ప ధనవంతులుగా ఎదిగారు. అందుకే అవసరానికి మించిన దర్పం కోసం, రాజసం కోసం జనం దృష్టిలో ప్రతిష్ట కోసం ఈ తరహా గడులను నిర్మించుకుంటూ వచ్చారు నాటి సంస్థానాధీశులు.

ఇక ప్రహరీ గోడ దాటి కోట లోపలివైపుకు వెళితే రెండు పెద్ద కమాన్‌లు వుంటాయి. గడి ముఖ ద్వారాలను వారు కట్టుదిట్టంగా నిర్మించారు. బలిష్ఠమైన ఈ ద్వారాలను తెరవాలంటే ఏనుగుల సహాయం కావాల్సిందే. ఇనుప శూలాలను చెక్క తలుపులకు బిగించి నిర్మించిన నిర్మాణాలు మనం ఇక్కడి దర్వా జా నిర్మాణాల్లో చూడవచ్చు. శతాబ్ధాలు గడిచినా ఈ దర్వాజాల నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ మహాద్వారమే రెండు అంతస్తుల మహల్‌లా వుంటుంది. ఈ తలుపు పై భాగంలో ఓ కిటికీ వుంది. అడుగడుగునా పటిష్టమైన రక్షణ, శత్రువుల రాకను నిరోధించే నిర్మాణాలను చేపట్టారని ఈ నిర్మాణాలనుబట్టి చూస్తే మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఈ గడిలో శిల్పుల నిర్మాణ కౌశలానికి సంబంధించి అనేక విభాగాలు కనిపిస్తాయి. వీటిలో వెంకట భవనం, అద్దాల మేడ, రాజుగారి దర్బారు, అశ్వగజశాలలు, రాతి కుడ్యాలు, బురుజులు, కందకాలు ధాన్యాగారాలు, దేవాలయాల వంటి అనేక నిర్మాణాలు మనకు కనిపిస్తాయి.

విశాలమైన ఈ కోట ప్రాంగణంలో ఎత్తయిన చెట్లు, అందమైన తోటల మధ్య రాజసం ఉట్టిపడేలా ప్రధాన రాజ భవనం కనిపిస్తుంది. ఈ భవనంలోనే సంస్థానాధీశులు ఉండే వారు. ఈ భవనం పై భాగాన వున్న శిలాఫలకం మీద గ్రానైట్‌ తో చెక్కబడ్డ ‘వెంకటభవనం’ అని తెలుగులోనూ, ఉర్దూలోనూ చెక్కబడి వుంది. ‘వెంకట భవనం’ నిజానికి రెండు అంతస్తుల మేడ. ఈ భవనంలో 30కి పైగా విశాలమైన గదులున్నాయి. ఇప్పటికీ ఈ సంస్థానాధీశుల వారసులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భవనంలోనే విడిది చేస్తారు. ఈ భవనం మొత్తం మీద కనబడే ఎన్నెన్నో అందమైన డిజైన్లు మనలను అబ్బుర పరుస్తాయి. ప్రధాన భవనం పైన నిర్మించిన పిరమిడ్‌ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. దోమకొండ సంస్థానాధీశులు రాజవైభవం ఉట్టిపడేలా వారి రాజముద్రలో సింహపు, గుర్రాల గుర్తులను చేర్చారు. ఈ గడి ప్రాంగణంలో నిర్మించిన అద్దాల మేడ నిర్మాణం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వుంటుంది. ఇందులోనే సాంస్క ృతిక కార్యక్రమాలు జరిగేవి. ఈ ప్రాంగ ణంలోనే ఫౌంటెయిన్స్‌ కూడా నిర్మించబడి వున్నాయి. మొదటి అంతస్తులో గుండ్రని స్తంభాలు, చెక్క దూలాలతో చేయబడ్డ అనేక నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. నెమలి డిజైన్లతో చేసిన కిటికీలు, ఏనుగులు, నెమలి, బొమ్మలతో తయారుచేయబడ్డ తలుపులు కళాత్మకంగా కనిపిస్తాయి. దోమకొండ గడిలో రెండు దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి. నాటి సంస్థానాధీశులు కోటలోనే తమ పూజలని కొనసాగించడానికి వీలుగా ఈ ఆలయాలు నిర్మించుకున్నారు.

కాకతీయుల కాలంలోనే నిర్మించినట్టుగా చెబుతున్న శివాలయం ఈ దేవాలయాలలో ప్రధాన ఆలయంగా నాడు రాజుల పూజలందుకొని ప్రత్యేకమైన ఆకర్షణగా నేటికీ నిలుస్తుంది. మూడు అడుగుల ఎత్తులో నిర్మించిన రాతి పునాది దేవాలయ పటిష్టతను తెలియజేస్తుంది. మందిర నిర్మాణ శైలి పరిశీలిస్తే మొత్తం కాకతీయ రాజుల నిర్మాణాల మాదిరిగానే ఈ దేవాలయాలు వున్నాయి. పైగా కాకతీయ రాజముద్రలు కూడా ఆలయంపై వుండడంతో ఇది కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన నిర్మాణంగా మనం భావించవచ్చు. బహుశా నాటి రాజులు ఈ ప్రాంతానికి విడిది చేయడానికి వచ్చినప్పుడు వారి తాత్కాలిక బసల కోసం ఈ కోటను నిర్మించి ఉండవచ్చు. కానీ అందుకు తగిన ఆధారాలు మాత్రం లేవు. ఈ గడి నిర్మాణం కోసం ప్రత్యేకంగా శిల్పకళాకారులను రాజస్థాన్‌ నుంచి పిలిపించి చేయించారని చరిత్రకారుల కథనం.

ఈ కళాదర్భార్‌లోనే నృత్య, సంగీత కార్యక్రమాలతో పాటు హరికథలు, పురాణ పఠనాలు, కవితాగానాలు, సాహితీగోష్ఠి జరిగేవని కథనం, ప్రధాన భవనం పక్కనే రాణి మహల్‌ కూడా వుండేది. ఇప్పుడు ఆ మహల్‌ ధ్వంసమయింది. తెలుగు భాషా సంస్క ృతిపై నాటి సంస్థానాధీశులకు గల ఆసక్తి ఈ గడిలో మనకు కనిపిస్తుంది. కళలను పోషించడానికి ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసినట్టు దర్భార్‌ను చూస్తే తెలుస్తుంది. స్వయంగా కవి, కళాపోషకుడైన మూడవ రాజేశ్వరరావు కాలంలోనే తెలుగు నిఘంటువులను కూడా సంకలనం చేసినట్టు చరిత్రకారుల కథనం. ఈ ఘడికి తిరుపతి వేంకటకవులు కూడా వచ్చేవారట. అనేక సంస్కృతీ సాంప్రదాయాల సమ్మేళనమే ఈ దోమకొండ కోట. హిందూ, ముస్లింల సాంప్రదాయ నిర్మాణశైలిలు రెండూకూడా ఈ కోటలో మనకు కనిపిస్తాయి.గడిల నిర్మాణంలో మొఘల్‌ ఆర్కిటెక్చర్‌ విధానాన్ని దేవాలయాల నిర్మాణంలో కాకతీయుల శైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధాన ద్వారం నిర్మాణశైలి అసఫ్‌జాహీల నిర్మాణశైలిని తెలుపుతుంది. గడిలో అక్కడక్కడా విదేశీ నిర్మాణశైలి కూడా మనకు కనిపిస్తుంది. ఇలా గడిమొత్తంలో మనకు వివిధ రకాల కళాత్మక నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. అయితే 40 గ్రామాల సామంతరాజు చక్రవర్తి స్థాయిలో ఇంత ఘనమైన గడి నిర్మాణాల్ని ఎలా చేయగలిగారు అన్న సందేహం చాలామందిలో కలుగుతుంది. దోమకొండ సంస్థానం 180 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వానికి రెండు లక్షల రూపాయలు చెల్లించి రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే మొత్తం తమ ఖజానాకు తరలించేవారు. ఆ 40 గ్రామాలపై పూర్తి ఆధిపత్యం వారికే ఉండేది.

కామినేనివారు రెడ్డి వంశస్తులు. కానీ నిజాం నుంచి ‘రావు బహదూర్‌’ బిరుదుతో సత్కరించబడటంతో వారి పేర్ల చివర ‘రావు’ వచ్చి చేరింది. దోమకొండ కోట నిర్మాణం నచ్చి నిజాం రాజు వారికి 30 ఎకరాల భూమిని హైదరాబాదులో నజరానాగా ఇచ్చారు. సంస్థానాధీశుల్లో మూడవ రాజేశ్వరరావు కుమారుడైన రాజా సోమేశ్వరరావు పాలనలో ఈ సంస్థానం రద్దయ్యింది. అప్పుడప్పుడు వారసులు సంస్థానానికి వచ్చి వెళుతుంటారు. ఆ తరువాత ఈ కుటుంబీకులు హైదరాబాదులో స్థిరపడ్డారు. దోమకొండ కోట చారిత్రక వారసత్వ సంపద అయినందువల్ల పర్యాటకులకు కొన్ని వసతులు కల్పించి ఈ కోటసందర్శన సౌకర్యం కూడా కల్పిస్తే కోట వివరాలు తెలంగాణ ప్రజలకు ఎక్కువగా తెలుస్తాయి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఆశిద్దాం.

శ్రీ నాగబాల సురేష్‌ కుమార్‌

Other Updates