హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సిల్వర్ జూబ్లీ వేడుకలు
1991లో హైదరాబాదులోని సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అధిపతులు నెలకొల్పిన హైసియా సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమ వృద్ధిలో హైసియా సంస్థ ఘణనీయమైన పాత్ర పోషించిందని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాదు నగరం బ్రాండ్ ఇమేజ్‌ను తారాస్థాయికి తీసుకువెళ్లామని, ఒక్క రాజధాని నగరంలోనే కాక రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే పని మొదలుపెట్టామని మంత్రి సభికులకు తెలిపారు.
భారత సాఫ్ట్‌వేర్ రంగానికి పితామహునిగా పరిగణించే ఎఫ్.సి. కోహ్లీని ఈ వేదికపై హైసియా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, హైసియా అధ్యక్షుడు రంగా పోతుల, సెయింట్ సంస్థ ఛైర్మన్ బి.వీ.ఆర్. మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యునైటెడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఎండ్ డిజైన్ సెంటర్ ప్రారంభం
ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ టెక్నాలజీస్ వారు హైదరాబాదులో నెలకొల్పిన రీసెర్చ్ ఎండ్ డిజైన్ సెంటర్ ను డిసెంబర్ 5 నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామా రావు, అమెరికా కాన్సుల్ జనరల్ కాథరీన్ హడ్డా లాంఛనంగా ప్రారంభించారు.
ప్రాట్ ఎండ్ విట్నీ (వైమానిక రంగం), కారియర్ (ఎయిర్ కండీషనింగ్), ఓటిస్ (లిఫ్టులు) వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్ ఎన్నిటికో యునైటెడ్ టెక్నాలజీస్ మాతృసంస్థ. తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగి, దాదాపు 56 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఉద్యోగస్తులను కలిగిన యునైటెడ్ టెక్నాలజీస్ సంస్థ తమ రీసెర్చ్ ఎండ్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ రాజధాని హైదరాబాదును ఎంచుకో వడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రా మికవేత్తలకు అనువైన విధానాలను తెలంగాణ రూపకల్పన చేసిందని, ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకునే సంస్థలకోసం సరళీకృత అనుమతుల ప్రక్రియను ప్రవేశపెట్టామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
తెలంగాణలో స్థాపితమవుతున్న నూతన కంపెనీలకు అవసరమైన మానవవనరులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఎండ్ నాలెడ్జ్ (టాస్క్) నెలకొల్పడం జరిగిందని మంత్రి తెలిపారు. టాస్క్ సంస్థ ద్వారా కొత్తగా వచ్చే సంస్థలకు నేరుగా శిక్షణ పొందిన యువతీయువకులు లభిస్తారని, అట్లాగే స్థానిక తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి అన్నారు.
అత్యాధునిక ఫీచర్లతో త్వరలో టీ-వ్యాలెట్
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా నగదురహిత లావాదేవీలను ప్రోత్సాహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర?యం తీసున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు టీ-వ్యాలెట్ పేరుతో ఒక మొబైల్ యాప్ ను త్వరలో ప్రవేశపెట్టనున్నది.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ఐటీ శాఖ ఈ టీ-వ్యాలెట్‌ను అభివృద్ధి చేస్తున్నది. నగదురహిత చెల్లింపులపై రాష్ట్ర కేబినెట్ ఉపసంఘం 12 డిసెంబర్ నాడు సచివాలయంలో సమావేశమయ్యింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, బ్యాంకర్లు, వివిధ శాఖాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ టీ-వ్యాలెట్‌పై ప్రాథమిక సమాచారం వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు పై స్పష్టమైన సంపూర్ణమైన వైఖరి తీసుకున్నది మొత్తం భారతదేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడకుండా పలుచర్యలు తీసుకుంటూ, అదే సమయంలో మన సమాజాన్ని ఇతర డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ ఇప్పటికే మండల, జిల్లా కేంద్రాల్లో నగదురహిత చెల్లింపు విధానాలపై అటు వ్యాపార సంస్థలకు, ఇటు పౌరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టిందని తెలిపిన మంత్రి, ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేని వారి కొరకు కూడా ఆధార్ కార్డు, వేలిముద్ర సాయంతో చెల్లింపులు జరిపే పద్ధతిని తీసుకురానున్నామని తెలిపారు.
డిజిటల్ చెల్లింపుల వల్ల ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు. ఈ నూతన చెల్లింపుల విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ టీ-వ్యాలెట్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టి-వ్యాలెట్ లో అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నామని, దీనిలో వినియోగదారుడి సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు జయేశ్ రంజన్ తెలిపారు. త్వరలోనే అవసరమైన అన్ని అనుమతులు పొంది టీ-వ్యాలెట్ ను ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు
ఐటీ పరిశ్రమను తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగు పడింది. కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఐటీ పరిశ్రమలు పెట్టాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ ఇంక్యుబేషన్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ టీ.ఎస్.ఐ.ఐ.సికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్లకు అవసరమైన స్థలం సూచించాల్సిందిగా లేఖ రాశారు. దాదాపు 25 కోట్ల వ్యయంతో ఈ రెండు ఇంక్యుబేషన్ సెంటర్లను నిర్మించనున్నారు.
కొణతం దిలీప్