11 లక్షల రైతులమంది నుండి 53.66 మె.ట.సేకరణ
ఆన్‌లైన్ ద్వారా రైతులకు రూ. 8 వేల కోట్ల చెల్లింపులు
2014-15లో రూ. 3390.50 కోట్లు వెచ్చించి 3329 కేంద్రాల ద్వారా
24.28 లక్షల మెట్రిక్ టన్నులు
2015-16లో రూ. 3396.50 కోట్లు వెచ్చించి 3007 కేంద్రాల ద్వారా
23.56 లక్షల మెట్రిక్ టన్నులు
ఈ ఏడాది 2016-17లో 5231 కేంద్రాల ద్వారా రూ.8105.34 కోట్లు వెచ్చించి 53.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
గత ఏడాది 2015-16 యాసంగి సీజన్‌లో ఇదే సమయానికి 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,75,713 మంది రైతుల నుండి 8.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో 2178 కొనుగోలు కేంద్రాల ద్వారా 4,00,176 మంది రైతుల నుండి 16.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకుగాను రూ. 2478.57 కోట్లు ఆన్‌లైన్ ద్వారా రైతు ఖాతాలోకి జమచేయడం జరిగింది.
తెలంగాణ చరిత్రలో ఈ ఏడాది 2016-17లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి చరిత్ర సృష్టించింది. ఖరీఫ్, యాసంగిలో 5231 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో కనీస మద్దతు ధర (గ్రేడ్-ఎ క్వింటాల్‌కు రూ. 1510, సాధారణ రకం – క్వింటాల్‌కు రూ.1470)కు 10,93,192 మంది రైతుల నుండి 53.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
యాసంగిలో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేయగా, పౌరసరఫరాల సంస్థ 37.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ. 5626.77 కోట్లు వెచ్చించి 6,93,020 మంది రైతుల నుంచి సేకరించిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. ఇందుకోసం 9.25 కోట్ల గోనె సంచులను సమకూర్చడం జరిగిందన్నారు.
దేశంలోనే నాల్గవ స్థానం
”ఈ ఏడాది ధాన్య సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాల్గవ స్థానంలో నిలించింది. వరుసగా పంజాబ్, ఛత్తీస్‌ఘర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధీటుగా తెలంగాణలో ఈ ఏడాది ధాన్యం సేకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ 55.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఇంచుమించుగా అదే స్థాయిలో 53.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ 4.53 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడు 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాయి.
‘తెలంగాణ చరిత్రలో ఈ ఏడాదే అత్యధికం, ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు 2013-14లో 3285 కొనుగోలు కేంద్రాల ద్వారా 24.82 లక్షల మెట్రిక్ టన్నులే అత్యధికం. ఇప్పుడు దీనికి రెండు రెట్లకుపైగా (222%) అధికంగా కొనుగోలు చేయడం జరిగింది.
2010-11లో 1383 కేంద్రాల ద్వారా రూ.1936 కోట్లు వెచ్చించి 18.82 లక్షల మెట్రిక్ టన్నులు
2011-12లో 2019 కేంద్రాల ద్వారా రూ.1982 కోట్లు వెచ్చించి 17.91 లక్షల మెట్రిక్ టన్నులు
2012-13లో 2638 కేంద్రాల ద్వారా రూ 1773 కోట్లు వెచ్చించి 13.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది.”
ఆన్‌లైన్ ద్వారా రైతు ఖతాలో రూ.8105 కోట్లు జమ :
దళారుల ప్రమేయం ఉండకూడదన్న ప్రధాన ఉద్ధేశంతో ఆన్‌లైన్ చెల్లింపులకు పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో కనీస మద్దతుధరకు సంబంధించిన చెల్లిం పులను ఈ ఏడాది రూ.8105.34 కోట్లను తొలిసారి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఒపిఎంఎస్) సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలించింది.
ముందస్తు కార్యాచరణ
ఈ ఏడాది అత్యధిక దిగుబడులు వస్తాయనే అంచనాతో పౌరసరఫరాలశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ముఖ్యంగా యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణపై ఆ శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ధాన్య సేకరణకు సంబంధించిన విభాగాలతో రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, అదే విధంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు…క్షేత్రస్థాయి వరకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అందరితో సమన్వయం చేసుకున్నారు. కమిషనర్ స్వయంగా 10 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, రవాణా వంటి అంశాలను పరిశీలించారు.
లక్ష్యాన్ని చేరుకున్నాం: ఆనంద్
”తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ జరిపాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. యాసంగిలో 37 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా 37.14 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కావల్సిన నిధులను సమకూర్చడం వల్ల ఎలాంటి జ్యాపం లేకుండా రైతులకు చెల్లింపులు చేయడం జరిగింది. దేశంలో తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా రూ. 8105.34 కోట్లు చెల్లించి తెలంగాణ పౌరసరఫరాల సంస్థ రికార్డు సృష్టించింది. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తిచేయగలిగాం. ఇందుకు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు…” అని కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. ఈ ఏడాది ముఖ్యంగా యాసంగిలో ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేయడంలో సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్, మార్కెటింగ్ శాఖమంత్రి టి. హరిశ్‌రావు సహకారం, తోడ్పాటు ఎంతో ఉంది. వారికి పౌరసరఫరాల శాఖ తరఫున కృతజ్ఞతలు అని ఆనంద్ చెప్పారు.