sambaraluదశాబ్దానికి పైగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర తృతీయ అవతరణోత్సవాలకు రంగం సిద్ధమయింది. బంగారు తెలంగాణ బాటలో పయనిస్తున్న రాష్ట్రంలో జూన్‌ 2న అవతరణోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, తదనుగుణంగా సన్నాహాలు పూర్తిచేసింది.

హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ముందుగా నివాళులర్పించి, రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. జిల్లా కేంద్రాలలో అమరవీరుల స్థూపాలు లేనిచోట్ల తాత్కాలిక స్థూపాలు ఏర్పాటుచేసి నివాళులర్పిస్తారు. ఆ తరువాత ఆయా ప్రాంతాలలో శాశ్వతంగా ఉండేలా అమరవీరుల స్థూపాలు కూడా నిర్మిస్తారు. హైదరాబాద్‌ లోని గన్‌ పార్క్‌ వద్దగల అమరవీరుల స్థూపంవద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించి వేడుకలలో పాల్గొంటారు.

జూన్‌ 2న రాష్ట్ర అవతరణోత్సవాలు, జూన్‌ 3న కెే.సీ.ఆర్‌ కిట్స్‌ పంపిణీ, జూన్‌ 4న ఒంటరి మహిళలకు జీవన భతి పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఈ మూడు కార్యక్రమాలను మండలం యూనిట్‌గా నిర్వహించాలని, దీనికోసం ప్రతి మండలంలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

అవతరణోత్సవాలలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో మంత్రులతోపాటు ప్రభుత్వ విప్‌ లు పతాకావిష్కరణ చేస్తారు. మండలాల్లో ఎం.పిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, జెడ్‌.పి. ఛైర్మన్లు, జెడ్‌.పి.టి.సి లు, ఎం.పి.పి.లు, ముఖ్య అతిధులుగా హాజరవుతారు.

అవతరణోత్సవాల సందర్భంగా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకూ అన్నిచోట్లా ప్రత్యేక పండుగ వాతావరణం ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నగరంలోనూ, జిల్లా కేంద్రాలలోను ప్రతి ముఖ్య కూడలిలో, ప్రభుత్వ కార్యాలయాలలో విద్యుద్దీపాలతో అలంకరించి , సుందరంగా తీర్చిదిద్దారు. హోటళ్ళు , రెస్టారెంట్లలో కూడా రాష్ట్ర అవతరణ వేడుకల వాతావరణం కనిపిస్తోంది.

కళాకారులు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలతో రాష్ట్ర అవతరణోత్సవాలు ధూం..ధాం..గా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

Other Updates