nagaraదు రకాల మాస్టర్‌ ప్లాన్లు ఉన్న మహానగరానికి ఒకే ఒక మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి, ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఏప్రిల్‌ 7న జరిగిన హెచ్‌ఎండీఏ 6వ బోర్డు సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. ఆయన ఆలోచనలకనుగుణంగా నగర భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించాల్సిన బాధ్యత హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలపై భాద్యత ఉందన్నారు.

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని, అలాంటి నగరంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కీలకమైనవి. విస్తీర్ణపరంగా హెచ్‌ఎండీఏదే సింహభాగం. పెరుగుతున్న పట్టణీకరణకనుగుణంగా ప్రజలకు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడం కల్పించాల్సిన భాద్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రణాలికాబద్ధంగా పురోగతి సాధించాలని, అందుకు చాలా రకాల మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ చెప్పారు. ముఖ్యంగా ఇప్పటికే 5 రకాల మాస్టర్‌ ప్లాన్‌లు ఉన్నా అందులో కంటోన్మెంట్‌ బోర్డు పరిధి మాత్రం లేదు. నగరం మధ్యలో ఉన్న కంటోన్మెంట్‌ను లెక్కలోకి తీసుకోకుండా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తే భవిష్యత్తులో మళ్లీ సమస్యలే. అలా కాకుండా కొత్తగా రూపొదించే మాస్టర్‌ ప్లాన్‌ కోసం కంటోన్మెంట్‌ బోర్డు సహకారం తీసుకొని, ఇప్పటికే ఉన్న 5 మాస్టర్‌ ప్లాన్లను సమ్మిళితం చేసి సమగ్రమైన మాస్టర్‌ ప్లాన్‌ను మూడు నెలల్లోనే తీసుకురావాలని నిర్ణయించామని, ఈ మాస్టర్‌ ప్లాన్‌ను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 2016-17 సంవత్సరానికి గాను హెచ్‌ఎండీఏ బడ్జెట్‌ను 2008 కోట్లుగా అమోదించామని తెలిపారు. అదేవిధంగా హెచ్‌ఎండీఏ పరిధిలో రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణం ప్రతిపాదనకు బోర్డు అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు.

గ్రామ పంచాయతీ లేఅవుట్లకు ఫుల్‌స్టాప్‌ 
హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. ఉదాహరణకు నిజాంపేట, మణకొండ, పుప్పాల్‌ గూడ వంటి ప్రాంతాలు తీసుకుంటే అక్కడ భారీ ఎత్తైన నిర్మాణాలున్నా అందుకనుగుణంగా మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మునుముందు రాకుండా ఉండాలంటే హెచ్‌ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చే అధికారాన్ని రద్దు చేస్తామని, ప్రస్తుతం పంచాయతీ రాజ్‌ శాఖ తన వద్దే ఉన్నందున ఈవిషయాన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. పద్దతి, ప్రణాళిక లేకుండా అనుమతులిచ్చే విధానాన్ని పూర్తిగా తొలగించి ఆన్‌లైన్‌ ద్వారానే లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులిస్తామని అనుమతుల ద్వారా వచ్చే రెవెన్యూను ఆయా గ్రామ పంచాయతీలకు బదలాయిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

13 గ్రోత్‌ కారిడార్ల ఏర్పాటు… 
మహానగరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రధాన ఆకర్షణ. దాని చుట్టే భవిష్యత్తులో పెట్టుబడులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ చుట్టూ 13 చోట్ల గ్రోత్‌ కారిడార్లను గుర్తించి అవసరమైన పనులు చేపడుతోంది. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయా ప్రాంతాలను పెరుగుతున్న పట్టణీకరణను దష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాలని సూచనలు చేశాం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో మరో మూడు నెలల్లో జరిగే బోర్డు మీటింగ్‌కు రావాలని చెప్పామన్నారు. చివరి దశలో ఉన్న ఓఆర్‌ఆర్‌ మాదిరిగానే హెచ్‌ఎండీఏ పరిధిలోనే మరో రీజినల్‌ రింగు రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదనకు బోర్డు అంగీకారం తెలిపిందని మంత్రి చెప్పారు. హెచ్‌ఎండీఏలో ఇటీవల జరిగిన అవినీతిని సంస్థే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. సంస్థలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఎం.జీ.గోపాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు పాల్గొన్నారు.

Other Updates