హైదరాబాద్ మహానగరంలో ఇక ముందు ముందు రోడ్ల పై పోలీసులు కనిపించక పోవచ్చు. కానీ, నగరంలో ఏమూలన చీమ చిటుక్కుమన్నా వారి నిఘానేత్రాల నుంచి మాత్రం తప్పించుకో జాలరు. ఏదైనా సంఘటన జరిగితే, మరో నిముషంలోనే అక్కడ వారు ప్రత్యక్ష మవుతారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం ‘ పోలీస్ ట్విన్ టవర్స్ ‘ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నవంబరు 22న శంకుస్థాపన చేశారు. 24 అంతస్తుల తో నిర్మించే ఈ ఆకాశహర్మ్యం నిర్మాణాలు పూర్తయ్యాక నగర పోలీసు వ్యవస్థ మొత్తం ఒకేచోట, ఈ భవనంలోనే కేంద్రీక తమై వుంటుంది.
ఏ ప్రాంతమైనా అభివ ద్ధి చెందాలంటే అక్కడ శాంతి భద్రతలు ముఖ్యం. శాంతి భద్రతలు సజావుగా వుంటేనే పెట్టుబడి దారులు ముందుకు వస్తారు. ఆ దిశగా ఆలోచించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మదిలో మెదలిన ఆలోచనల ప్రతి రూపమే ఈ ‘ పోలీస్ ట్విన్ టవర్స్’.
వంద మంది పోలీసులు చేసేపనిని ఒక్క సిసి కెమెరా చేస్తుంది. నగర వ్యాప్తంగా గల సిసి కెమెరాలను ఈ భవనంతో అనుసంధానం చేస్తారు. కేవలం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంగానే కాకుండా ఏదైనా విపత్తులు, విపత్కర పరిస్థితులు సంభవించిన సమయంలో కీలక శాఖల ఉన్నతాధికారులంతా ఒకేచోట ఉండి పరిస్థితిని సమీక్షించే అవకాశం కూడా ఉంటుంది.
నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, నిఘా వంటి పోలీసుల విధులతోపాటు, నగరంలో పారిశుధ్య పరిస్థితుల పర్యవేక్షణ వంటి బహుళ ప్రయోజనకారిగా నిలిచే ఈ కేంద్రం సేవలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మన దేశంలో ఇంతపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ మరెక్కడా లేదు. ఇంతటి స్థాయిలో, బహుళ ప్రయోజనకారి కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా చూసినా ఇప్పటి వరకూ న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ లలో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన మన హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ నిలవనుంది.