నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నదని పురపాలక, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 2017-18 వార్షిక నివేదిక,2018-19 కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు.
వచ్చే మూడేళ్ళలో 55వేల కోట్ల రూపాయల వ్యయంతో నగరాలు, పట్టణాలలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. ఆర్థిక వికాసం, ఉపాధికల్పన, నాణ్యమైన జీవన ప్రమాణాల పెంపు తదితర విషయాలలో ఏం చేస్తే బాగుంటుందో అలాంటి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని చెప్పారు. 2023 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 50శాతానికి మించుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా వసతులు కల్పించాల్సిన అవసరం
ఉందన్నారు. అందుకోసం కాకతీయ, శాతవాహన, కులీకుతుబ్‌షా, నిజామాబాద్, స్థంభాద్రి (ఖమ్మం), సిద్ధిపేట, యాదాద్రి, వేములవాడలకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను నియమించినట్లు తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికిల్ కింద హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్; మానేరు రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ తదితర మహానగరాభివృద్ధి సంస్థలు ఉన్నాయన్నారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 40 నుంచి 50శాతం వాటా హైదరాబాద్ నగరానిదే ఉంటుందన్నారు. నగరాన్ని కాపాడుకుంటేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు. అందుకే హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ దిశగానే ప్రత్యేక కార్యాచరణ అమలు జరుగుతుందన్నారు. విశ్వనగరాన్ని రాత్రికి రాత్రే తయారుచేయలేమని, దశలవారీగా అభివృద్ధి, ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయన్నారు. ప్రభుత్వం త్వరలోనే టౌన్‌షిప్ విధానాన్ని తీసుకువస్తుందన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం సమగ్ర పట్టణాభివృద్ధి ప్రణాళిక తయారుచేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు 2019 మే నాటికి తయారవుతుందన్నారు.
హైదరాబాద్ నగరాభివృద్ధి
హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని, ముందు, ముందు తీసుకోబోయే కార్యాచరణ ప్రణాళికను మంత్రి కేటీఆర్ వివరించారు. నగరంలో రహదారులను బాగుచేయడానికి, అభివృద్ధిపరచడానికి రూ. 2716 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులను అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. రాబోయే 30 సంవత్సరాల నగర అవసరాలకు సరిపడేలా 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అవుటర్ రింగ్‌రోడ్ వెంబడి 13 శాటిలైట్
టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మురుగునీటి విషయానికి వస్తే ప్రస్తుతం 750 ఎంఎల్‌డీ మురుగునీటిని శుద్దిచేసే వసతులు ఉండగా, మరో వెయ్యి ఎంఎల్‌డీల మురుగు నీటిని శుద్ది చేసే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. 2019 ఏప్రిల్ నాటికి నగరంలోని 109 చోట్ల రెండు లక్షల రెండు పడకగదుల ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. నాలాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించడానికి జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆగస్టులో ఎల్.బి.నగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రోరైలును ప్రారంభిస్తామని, అక్టోబర్‌లో అమీర్‌పేట-హైటెక్‌సిటీ రూట్లో ప్రారంభి స్తామని పేర్కొన్నారు. రెండోదశ మెట్రోరైలు నిర్మాణానికి గాను ఏడాదిలోగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్‌కే వన్నె తెస్తుందన్నారు. ఇవే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇప్పుడున్న 17 బస్తీ దవాఖానాలకు తోడు వచ్చే ఎండాకాలం వరకు 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకుంద న్నారు. రూ. 747 కోట్ల నుంచి రూ. 1,450 కోట్ల ఆదాయానికి చేరుకుందన్నారు. బాండ్లు జారీచేసి రూ. 200 కోట్లు సమీకరించుకుని దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. నగర రహదారుల అభివృద్ధికి మరో రూ. 1000 కోట్ల బాండ్లను సమీకరించుకోనుందని తెలిపారు. వడ్డీ రాయితీకి ప్రోత్సాహకంగా కేంద్రం నుంచి రూ. 26 కోట్లను అందుకుం టోందని తెలిపారు. ఇలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని కొనసాగిస్తు నగరాలు, పట్టణాలకు కొత్త రూపును ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తున్నదని కేటీఆర్ వివరించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నగరవాసులకు పౌరసేవలను సత్వరం అందించడానికి, సమస్యలను పరిష్కరించడానికి మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యుత్ ఆదాకు నాలుగులక్షల ఎల్.ఇ.డి. లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఎల్.ఇ.డి. ప్రాజెక్టుగా కమిషనర్ పేర్కొన్నారు. భవన నిర్మాణ అనుమతుల్లో ప్రవేశపెట్టిన డి.పి.ఎం.ఎస్ విధానం మున్సిపల్ రంగంలో విప్లవాత్మకమైనదని పేర్కొన్నారు. గతంలో భవన నిర్మాణ అనుమతులకు 40 రోజులపైగా పట్టేదని, ఇప్పుడు 21 రోజుల్లోనే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. లూ-కేఫేలు, ఆధునిక బస్‌షెల్టర్ల నిర్మాణం, జవహర్ డంప్‌యార్డు క్యాపింగ్, ఆక్రమణల తొలగింపు, హరితహారం తదితర ఎన్నొ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డీ. దాన కిశోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర పట్టణాల మేయర్లు, కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.