హైదరాబాదులోని ‘నగర కేంద్ర గ్రంధాలయానికి’ వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెడతామని, గ్రంథాలయ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు చెప్పారు. ఆళ్వారుస్వామి తాను సేకరించిన గ్రంథాలన్నింటినీ ఈ గ్రంథాలయానికి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఆళ్వారుస్వామి శత జయంతిని పురస్కరించుకొని నవంబర్ 1న ఆయనకు ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు.
సామాజిక ఉద్యమ కార్యకర్తగా, సాహితీవేత్తగా, రచయితగా, గ్రంథాలయ ఉద్యమ సారధిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆళ్వారుస్వామి తెలంగాణ గర్వించదగ్గ యోధుడని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆళ్వారు స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చెరువు మాదారంలో కూడా ఆయన విగ్రహం ప్రతిష్టింపజేస్తామని సి.ఎం చెప్పారు.
తెలంగాణ సమాజానికి ఆళ్వారుచేసిన సేవలు చిరస్మరణీయమైనవి. తెలంగాణ సామాజిక, సాహిత్య వికాసానికి వట్టికోట చేసిన సేవలను రేపటి తరానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, కారాగారశిక్ష అనుభవించి, ప్రజలపక్షాన నిలిచిన విలక్షణ రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి అని ముఖ్యమంత్రి కొనియాడారు.
వట్టికోట రాసిన ‘ప్రజల మనిషి’ నవల తెలంగాణ ప్రజల కష్టాలు, నాటి సామాజిక పరిస్థితులకు అద్దంపడుతుందని, ఆయన రాసిన వ్యాసాలు, రచనలు అన్నింటినీ సమగ్ర సంకలనంగా తెలుగు అకాడమీ పక్షాన ప్రచురిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు ప్రకటించారు.
పుస్తకాలను నెత్తిన పెట్టుకొని, ఊరూరా తిరుగుతూ పుస్తకాలను పరిచయం చేస్తూ, ప్రజలను చైతన్యపరిచిన సామాజిక కార్యకర్తగా ఆయన ఎల్లకాలం తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోతారని ముఖ్యమంత్రి అన్నారు.ఆళ్వారుస్వామి త్యాగనిరతి, చరిత్ర, సామాజిక చైతన్యం తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
హోం
»