హైదరబాద్‌ నగర ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు మున్సిపల్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న స్లిప్‌ రోడ్లపైన (ప్రధాన రోడ్లకు అనుసంధానించే రోడ్లు) పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఒక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ మేరకు నగరంలో అత్యధిక ట్రాఫిక్‌ జాం ఉండే ప్రాంతాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ రోడ్లను ఏర్పాటు చేసి దీర్ఘకాలంలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా జి.హెచ్‌.యం.సి, హెచ్‌ యం.డి.ఏ, హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌లు కలిసి రూపొందించిన సమగ్ర నివేదికపైన మంత్రి చర్చించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక ఉండాలన్నారు.

ప్రస్తుతం ఉన్న జనసాంద్రత, భవిష్యత్తు విస్తరణ, ట్రాఫిక్‌ అధ్యయనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. నగర రోడ్డు నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు అవసరం అయిన రైల్వే వంతెనలు (అర్వోబిలు, అర్‌ యూబీలను) గుర్తించి రైల్వే శాఖ నుంచి అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె.టి.ఆర్‌ సూచించారు. స్లిప్‌ రోడ్డులతోపాటు, మిస్సింగ్‌ లింక్‌లను కలిపే చిన్న చిన్న రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. దీంతోపాటు యస్సార్డీపి పనులకు అదనంగా అవసరం అయిన చోట్ల జంక్షన్ల అభివద్ధిపైన కూడా దష్టి సారించాలన్నారు.

ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌ లో ప్రస్తుతం ఉన్న రోడ్డు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తూ మరిన్ని స్లిప్‌ రోడ్డులను ఏర్పాటు చేయాలని జిహెచ్‌యంసిని అదేశించారు. ఇప్పటికే పలు నూతన రోడ్లను ఎప్పటికప్పుడు నిర్మిస్తున్న జి.హెచ్‌. యం.సి, ప్రస్తుతం ట్రాఫిక్‌ అధికంగా ఉండే ప్రాంతాల్లో మెయిన్‌ రోడ్లను కలుపుతూ సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్‌ రోడ్లను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. బోరబండ నుంచి మియాపూర్‌ వరకు ఉన్న మెయిన్‌ రోడ్డు నుంచి హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ దిశగా స్లిప్‌ రోడ్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. దీంతోపాటు జూబ్లీహిల్స్‌ నుంచి నాలెడ్జ్‌ సిటీ వైపు, ఒల్డ్‌ ముంబై హైవే వరకు స్లిప్‌ రోడ్లను, నూతన రోడ్లను ఏర్పాటు చేయబోతున్నది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి కోకాపేట, కొల్లూర్‌, తెల్లాపూర్‌ వరకు ఒఅర్‌ అర్‌ ను కలుపుతూ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రణాళికలో ఉన్న అర్టిలరీ రోడ్లకు అదనంగ నూతన రోడ్లను రూపకల్పన చేస్తున్నది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే మిస్సింగ్‌ రోడ్ల వివరాలు పురపాలక శాఖకు తెలపాలని పురపాలక ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ కోరారు. దీంతోపాటు స్థానిక రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని తెల్పిన అయన పురపాలక శాఖకు తెలపాలని కోరారు.

ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహాన్‌, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఛీఫ్‌ సిటి ప్లానర్లు, ఛీఫ్‌ ఇంజనీర్లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Other Updates