రసరమ్య మృదు కవితా సంపుటి ‘నది పలికినవాక్యం’. విలాసాగరం రవీందర్ కవితా సంపుటి. ఇందులో 111 కవితా శీర్షికల కవితలు చూడ ముచ్చటగా ఎంతో అర్థవంతంగా, మనకందించారు. ఒక చోట అంటాడు..
మౌనంగా ఉన్నానంటే
నిన్ను మరచినట్టుగాదు
నిన్ను ఎక్కువగా
గుర్తుకు చేసుకుంటున్నానని అర్థం
వచన కవిత్వంలో ఒరవడి పెట్టిన కుందుర్తి వలె ఈయన వచన కవిత్వంలో అర్థవంతమైన పదాల వరుస క్రమం కూడా ఈ కవితా సంపుటిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయులు అయినప్పటికినీ, ప్రవృత్తి సాహిత్య అధ్యయనం, అధ్యాపనం, అభిలేఖనం, అని స్పష్టంగా విన్నవించుకున్నారు. ‘అక్షరం’ శీర్షికలో అక్షరాలకూ పౌరుషముంటుంది. వాటికీ రోషమొస్తుంది. అని చక్కటి భావజాలాన్ని తన కవితా సంపుటిలో నిరూపించినారు. ఇందులో భావ కవితలు, స్ఫూర్తి గొలిపే మధుర కవితలు, నిండి ఉన్నాయి. ఇందులో కొన్ని చెప్పుకోతగ్గవి. కంటిపాప సృజన-కొత్తలోకం-అప్రమేయం-సోయి. అక్షర నక్షత్రం-నది పలికిన వాక్యం. రేపటి తెలంగాణ.
తెలంగాణ తల్లి బిడ్డల గొంతు తడిపి నీటి ధారల్ని దోసిట ఒడిసి పట్టాలె-
పత్రహరితమాలల్ని పల్లె మాత మెడలో పల్లవింపజేయాలె
నోటిమాట నొసటి చూపు ఒకటై నడవాలి
రేపటి తెలంగాణ
కృషి వీరుల ఖాందాన్ కావాలె… ఇలాంటి చక్కని కవితలను మనకందించిన రవీందర్ భావ కవియే, అందరూ చదవడానికి ఇంపుగా ఉన్న ఈ కవితా సంపుటిని ప్రతి ఒక్కరూ చదవాలని ఆశిద్దాం…
నది పలికిన వాక్యం
పేజీలు: 150
వెల: రూ. 100
రచన: రవీందర్, ప్రతులకు: బసబత్తిని రమాదేవి,
ఇం.నెం. 8-5-599/3, పోచమ్మవాడ,
కొత్తి రాంపూర్, కరీంనగర్-505001.