-డా. భిన్నూరి మనోహరి
”శాస్త్రి నుడివితే ప్రతి మాటా శాసనమౌతుంది శాస్త్రి అడిగితే రాయైనా తన చరిత్ర చెబుతుంది”
అని భిన్నూరి నరసింహశాస్త్రి గురించి గంజి సత్యనారాయణ చెప్పిన పై వాక్యాలు శాసన చరిత్రలో వారి స్థానాన్ని శిఖరాయమానం చేశాయి.
శాసన, చరిత్ర పరిశోధకుడుగా, సృజనాత్మక రచయితగా, శాసన పరిష్కర్తగా, సర్వస్వాల నిర్మాణకర్తగా, చరిత్ర, సంస్కృత గ్రంథాల రచయితగా, పత్రికా సంపాదకునిగా, సొంత ఊరిలో హరిహర త్రిశక్తి దేవాలయ నిర్మాణ సంకల్ప కర్తగా, అందరి అవసరాలు తీర్చే మానవతావాదిగా, బహుముఖీన వ్యక్తిత్వ సంపన్నుడిగా తెలంగాణాలో నడయాడే చారిత్రక విజ్ఞాన సర్వస్వంగా బి.ఎన్.శాస్త్రి అందరికీ సుపరిచితులు.
ఉమ్మడి ఆంధ్రదేశంలో, ముఖ్యంగా తెలంగాణంలో కొన్ని వేల గ్రామాలు తిరిగి 400 శాసనాలు స్వయంగా పరిష్కరించి, ప్రచురించిన శాస్త్రి 87వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ చిన్న వ్యాసం…..
బి.ఎన్.శాస్త్రిగా ప్రసిద్ధులైన భిన్నూరి నరసింహశాస్త్రి 1932 డిసెంబర్ 10న విష్ణుకుండిన మహా సామ్రాజ్యానికి రాజధానియైన చారిత్రక నగరం ఇంద్రపాలనగరంలో జన్మించారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వీరు చిన్నతనంలో కుటుంబ పోషణలో తండ్రికి సహాయపడవలసిన ఒత్తిడి ఉన్నా చదువుకోవాలనే కోరికతో హైద్రాబాదుకు వచ్చి ట్యూషన్లు చెప్పుకొని చదువు కొనసాగించారు. 10 సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు పూర్తిచేశారు. పరిశోధన వైపు దృష్టి మళ్ళించిన సందర్భంలో తీసుకున్న అంశాన్ని గూర్చి ”సాహిత్య విద్యార్థివి శాసనాలను ఏవిధంగా పరిష్కరిస్తావన్న” విశ్వవిద్యాలయ అధ్యాపకుల మాటలను సవాలుగా స్వీకరించి చరిత్ర, శాసనాలపై ఎక్కువ కృషి చేశారు. ”శాసనాల ద్వారా తెలుగు భాషా వికాసం” అన్న అంశాన్ని పరిశోధనకు ఎంచుకొని డా. పల్లా దుర్గయ్య పర్యవేక్షణలో పూర్తిచేసి విశ్వవిద్యాలయానికి సమర్పించారు. చాల విస్తృతంగా ఉందనీ, సిద్ధాంతపరంగా కూడా కొన్ని మార్పులు చేసి తిరిగి సమర్పించమని ఆచార్యులు కోరగా శాస్త్రి అందుకు నిరాకరించారు. దీంతో వారికి తత్సంబంధమైన డాక్టరేటు పట్టా లభించలేదు.
తన పరిశోధనాకాలంలో సేకరించిన శాసనాలు, వాటిని పరిశీలించిన విధానంలో తెలుగు సాహిత్యంలో నన్నయ కంటే పూర్వమే నన్నెచోడుడు ఆదికవి అని నిర్ణయించారు. ఈ విషయమై వారు కుమార సంభవాన్ని సాహితీలోకానికి మొదట పరిచయం చేసిన మానవల్లి రామకృష్ణకవి వాదనను సమర్థిస్తూ దానికి తగిన చారిత్రాత్మకమైన శాసనాధారాలను పేర్కొన్నారు. సిద్ధాంత గ్రంథం వారు సమర్పించేనాటికే ఈ విషయమై భారతిలో ”ఆదికవి నన్నెచోడుడు” అనే వ్యాసం రాసారు. కాని నన్నెచోడుని ఆదికవిగా అంగీకరించని వారి గురించి వ్యాసం చివరలో…. ”ఇట్లు ఆంధ్రభాషలో తొలికావ్యము రచించిన ఆదికవి నన్నెచోడుడు శివకవియైనందున మరుగునపడి పదియవ శతాబ్దంలో ఆంధ్రమునందాది కావ్యము రచింప, ఇరువదియవ శతాబ్దిలో ఆ గ్రంథము వెలుగులోనిక రాగా ఆంధ్ర పండిత ప్రకాండులు, చారిత్రకులు నన్నెచోడుడు పండ్రెండవ శతాబ్దివాడుగా నిర్ణయించుట చూడగా కొన్ని కొన్ని దురభిమానములెంత శక్తివంతమైనవో ఊహింపవచ్చును” అని తన అభిప్రాయాన్ని జంకు లేకుండా స్పష్టంగా ప్రకటించారు.
సాహిత్యపరంగా శాస్త్రి చేసిన విశేషమైన కృషి ఇది. విశ్వవిద్యాలయం వారు కోరినవిధంగా సిద్ధాంత వ్యాసాన్ని తిరిగి వారు సమర్పించలేదు. తాను పరిశీలించిన శాసనాల ద్వారా కనుగొన్న అంశాన్ని కేవలం పిహెచ్.డి డిగ్రీ కోసం తప్పుగా చెప్పలేని నిజాయితీతో ‘డాక్టర్ కాని పరిశోధక శాస్త్రి’గా సాహిత్యలోకంలో మిగిలిపోయారు.
క్రమంగా వారి పరిశోధనా సరళి, రంగం మారిపోయాయి. సాహిత్యం స్థానాన్ని చరిత్ర, శాసనాలు ఆక్రమించింది. శాసనాల మీద పరిశోధనలు తీవ్రంగా చేస్తూ తన పరిశోధనా స్థాయిని పెంచుకుంటూ చరిత్ర, సంస్కృతులపై కృషి చేయడం ప్రారంభించారు. తెలంగాణ బిడ్డగా ఇక్కడి చరిత్రను సత్యవంతంగా, సమగ్రంగా నిజమైన చరిత్రను వెలుగులోకి తేవాలనే పట్టుదలతో అనేక గ్రామాలు తిరిగి చారిత్రక, శాసన సంబంధ గ్రంథాలను వెలువరించడం ప్రారంభించారు.
శాసనాలను అధ్యయనం చేస్తున్న ప్రారంభ దశలోనే అదృష్టమో, దురదృష్టమో వారికి విష్ణుకుండినులకు సంబంధించిన రెండు అద్భుతమైన తామ్ర శాసనాలు లభించాయి. ఆ శాసనాలే ఆంధ్రదేశ చరిత్రలో అజ్ఞాతంగా ఉన్న కాలానికి సంబంధించినవి. ఆ శాసనాలే శాస్త్రిని శాసన చరిత్ర పరిశోధనా రంగంలో అగ్రస్థానంలో నిలిపినాయి. ఆ శాసనాలే శాస్త్రి కొన్ని వందల శాసనాలు స్వంతంగా పరిష్కరించి, ప్రచురించడానికి ప్రేరణనిచ్చాయి. ఆ శాసనాలే విష్ణుకుండినుల మతవిధానాన్ని, సంస్కృతిని ఎరుకపరిచాయి. ఆ శాసనాలే తెలంగాణ శాసన పరిశోధకుని సత్తాను చాటినాయి. అవి 1. విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనం, 2. విష్ణుకుండిన విక్రమేంద్ర భట్టారకవర్మ ఇంద్రపాలనగర తామ్రశాసనం. ఈ రెండు శాసనాల ద్వారా పూర్వచరిత్రకారులు ఏర్పరచిన చరిత్రక్రమాన్ని సవరించి విష్ణుకుండినుల వంశ వృక్షాన్ని ఆధారభూతంగా నిర్ణయించారు. అంతేకాదు. అప్పటివరకు లభించిన శాసనాలన్నీ విష్ణుకుండినులు వైదికమత నిరతులుగా పేర్కొంటే, ఈ రెండు శాసనాలు వారు బౌద్ధమతాన్ని ఆదరించి పోషణ కల్పించిన అంశాన్ని రుజువు చేస్తున్నాయి.
ఈ అంశంలో కూడా శాస్త్రి తన పరిశోధనా పటిమను నిరూపించుకోవాల్సి వచ్చింది. తెలంగాణాలో ఇంత పెద్ద మహా సామ్రాజ్యం ఉందా? ఆ అంశాన్ని నిరూపించే శాసన పరిశోధకులు తెలంగాణాలో ఉన్నారా? అనే విమర్శలు, ప్రశ్నలు శాస్త్రి మీదకు సంధించారు. ఆ ప్రశ్నలకు, విమర్శలకు శాస్త్రి భారతి పత్రిక మాధ్యమంగా ఆధారాలతో విషయ నిరూపణ చేసారు. అయినా శాస్త్రి పరిశోధన మీద చిన్నచూపే. భారత ఆర్కియాలజీ డైరెక్టర్ డా.జి.ఎస్.ఘాయ్ వచ్చి శాస్త్రితో మాట్లాడి, వారి పరిశోధనా విధానాన్ని, తేల్చిన అంశాలను చర్చించి, వారి పరిశోధన సరియైనదే అని విశ్వసించి, జాతీయస్థాయి పత్రికల్లో వారు వ్యాసం రాసి శాస్త్రి పరిశోధనకు ఆమోదముద్ర వేసినారు. అప్పటికి కాని శాస్త్రి పరిశోధన మీద ఇక్కడి చరిత్రకారులకు, శాసన పరిశోధకులకు నమ్మకం ఏర్పడలేదు.
తెలంగాణాను కేంద్రస్థానం చేసుకొని పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి యావత్ ఆంధ్రదేశాన్ని పరిపాలించినవారు విష్ణుకుండినలు అని నిరూపించడమే కాకుండా వారి వంశ వృక్షాన్ని, కాల నిర్ణయాన్ని చేసిన శాస్త్రి శాసన పరిశోధన భావి తరాల శాసన పరిశోధకులకు మార్గదర్శనం చేసింది. నూతన దృక్కోణంలో చరిత్రను వెలికి తీయడంలో ఉత్సాహాన్ని నింపింది. విష్ణుకుండినులు అంటే నిలువెల్లా పులకించిపోయే శాస్త్రి అనేక వేదికల ద్వారా వారి కీర్తి వైభవాలను గంటల తరబడి వివరించేవారు. ఆ అభిమానంతోనే వారి మనవడికి కూడా ప్రేమతో విష్ణుకుండినశర్మ అని పేరు పెట్టుకున్నారు.
శాసన పరిశోధనే జీవిత లక్ష్యంగా ఇక్కడి ప్రాంత చరిత్రను సప్రమాణంగా వెలుగు చూపాలనే ఆకాంక్షతో అనేక చరిత్ర గ్రంథాలను రచించారు.
సురవరం వారి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు పూర్వ ఆంధ్రుల సాంఘిక చరిత్రను శాసనాల ఆధారంగా రచించి ప్రచురించారు. యావత్ ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రను పూర్వ శాతవాహనయుగం నుండి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కాలం వరకు ఉన్న ఆంధ్రదేశ చరిత్ర – సంస్కృతిని 3 భాగాల్లో రచించారు.
అదేవిధంగా భారతదేశ చరిత్రను ఉత్తరాదివారు రూపకల్పన చేసినట్లుగా దక్షిణాదివారు చేయలేదు. ఆ కారణంగా దక్షిణాది చరిత్రకు భారతదేశ చరిత్రలో స్థానం తక్కువ లభించింది. ఆ లోటును పూరించడానికి శాస్త్రి భారతదేశ చరిత్రను 30 సంపుటాలకు ప్రణాళికను సిద్ధం చేసుకొని 21 భాగాలుగా వేదయుగం నుండి ఈస్టిండియా కంపెనీవారి వరకు రచించి ప్రచురించారు. ఇంకా 9 సంపుటాలు రావలసి ఉండింది. వారి మరణంతో ఆ కార్యం అసంపూర్తిగా మిగిలింది.
శాసన సంపుటాలు 12 వెలువరించారు. అందులో త్రిపురాంతకం, ముఖలింగం, బెజవాడ వంటివి క్షేత్ర సంబంధమైన శాసన సంపుటాలు. మిగితావి రాజవంశాల వారివి. అంతే కాదు వీరు జిల్లా సర్వస్వాలు 3 వెలువరించారు. నల్లగొండ మండల సర్వస్వం, ఆదిలాబాదు జిల్లా సర్వస్వం, మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వం. ఇవే కాక రెడ్డిరాజ్య సర్వస్వం, బ్రాహ్మణరాజ్య సర్వస్వాలు రెండూ రాజ్య సర్వస్వాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇవన్నీ శాస్త్రి ఒక్కరే రాత్రింబగళ్ళు కష్టపడి నిర్వహించిన బృహత్కార్యాలుగా పేర్కొనవచ్చు.
శాసన పరిశోధనా సమయంలో కాని, జిల్లా సర్వస్వాల రచనా సమయంలో కాని వారు నిరంతరం తిరుగుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే శాసన సేకరణలో భాగంగా ఒక కారు రెండు ఇనుప బకెట్లు, కొబ్బరి చీపుర్లు, బ్రష్‌లు, తెల్లబట్టలు, చాక్‌పీస్‌లు, ఒక ఫోటోగ్రాఫర్, తదితర మంది మార్బలంతో వెళ్ళేవారు. కొన్నిసార్లు చాలా కఠినమైన ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చేది. గుట్టలు, కొండలు ఎక్కేవారు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా బెదరక కార్యసాధనకై ముందుకు సాగేవారు. ఒకటి రెండు సార్లు ప్రాణాపాయస్థితి కూడా కలిగిందని చెప్పేవారు. అయినా తన పరిశోధనలో అవన్నీ ఒక కొత్త శాసనాన్ని కనుగొనే ఆనందం ముందు తక్కువయ్యేవి.
పరిశోధనలో అటువంటి నిబద్ధత కల్గిన శాస్త్రి ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా తనకు తోచినంతలో చేసేవారు. వారి ఆరోగ్యం క్షీణించిన తరువాత కూడా తన భవిష్యత్ ప్రణాళికల గురించే ఆలోచించేవారు. అటువంటి పరిస్థితిలో కూడా కొత్త పుస్తకాలు, శాసనాల గురించి చర్చించేవారు. వారు ప్రణాళికలకు అనుగుణంగా వారి శరీరం స్పందించలేదు. ఇంకా చేయవలసిన పరిశోధన, రాయవలసిన పుస్తకాలు చాలా
ఉండగానే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. భావి తరాలవారు వారు మిగిల్చిన పరిశోధనను పూర్తి చేయవలసిన గురుతర బాధ్యత ఎంతైనా ఉంది.
సాహిత్యం, చరిత్ర, సంస్కృతి అన్న అంశాలు ప్రధానంగా కలిగి ఉండేట్టుగా శాస్త్రి 1980లో మూసీ మాస పత్రికను ప్రారంభించారు. ఆరోజుల్లో భారతి పత్రిక ఒకటే సాహిత్య పత్రికగా ఉండేది. క్రమంగా భారతి పత్రిక కనుమరుగవుతున్న కాలంలోనే మూసీ సాహిత్య పత్రికగా ప్రారంభించబడింది. తెలంగాణలో ఉన్న కవులు వారి సాహిత్య జిజ్ఞాసను ఈ పత్రిక ద్వారా తీర్చుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు పత్రిక మధ్యలో చిన్న ఒడుదుడుకులను ఎదుర్కొన్నా సాహిత్యలోకంలో ప్రత్యేక పత్రికగా స్థానాన్ని సంపాదించుకుంది. అనేక ప్రత్యేక సంచికలను వెలువరిస్తూ అందరి మన్ననలను పొందుతోంది.
శివపూజా పిపాసియైన శాస్త్రి ఆ నీలకంఠునికి దేవాలయం కట్టించాలనే తపన కలిగి తమ సొంత ఊరైన వలిగొండలో హరిహర త్రిశక్తి ఆలయాల నిర్మాణానికి సంకల్పం చేసుకున్నారు. వారు పుస్తక ప్రచురణ, తోటి రచయితలకు పుస్తకాలు ప్రింటు చేయించడంలో, పేపర్ తెప్పించడంలో ఆర్థిక, హర్దిక సహాయం చేసేవారు. అవన్నీ పోను మిగిలిన ద్రవ్యంతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. వారి పరిధిలో శక్తిమేరకు కృషి చేశారు. కాని వారు సజీవంగా ఉన్న కాలంలో ఆ ఆలయ నిర్మాణం పూర్తికాలేదు. 6,7 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం పూర్తిస్థాయిలో వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది.
శాస్త్రి 87వ జయంతి సందర్భంగా మూసీ సాహిత్యధార తెలంగాణ సాహిత్య అకాడెమీ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 10,11 తేదీలలో ”బి.ఎన్.శాస్త్రి సమగ్ర సాహిత్య సమాలోచనం” రెండురోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ రెండురోజుల సదస్సులో వారి రచనలన్నిటినీ సమీక్షిస్తూ 34 మంది పత్ర సమర్పణ చేస్తున్నారు. ఈ పత్రాలన్నీ ఒక ప్రత్యేక సంచిక ముద్రణ రూపంలో మూసీపత్రిక ఆధ్వర్యంలో వెలువడబోతోంది. ఇదే సందర్భంగా బి.ఎన్.శాస్త్రి అవార్డును ఈ సంవత్సరం మహామహోపాధ్యాయ శ్రీభాష్యం విజయసారథికి అందించడం జరుగుతుంది. సాహిత్య, శాసన, చరిత్ర పరిశోధకులు, అభిమానులు ఈ సదస్సుకు విచ్చేసి శాస్త్రి పరిశోధనా పటిమను, లక్ష్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.