సినిమాలు
– మామిడి హరికృష్ణ
సినిమా పుట్టింది అమెరికాలోనే అయినా, సినిమా టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ మాత్రం మొదట్నించీ జర్మనీయే! కెమెరాలు, ప్రొజెక్టర్స్, రీల్స్ వంటి సినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత అధునాతన స్థాయిలో ఉత్పత్తి చేసిన జాతీయులు-జర్మన్‌లు! ఎందుకంటే, సినిమా అనే ఓ మహోన్నత కళారూపం ఎంత ఉన్నతంగా ఉండాలో అలా ఉన్నతంగా ఉండాలంటే కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉండాలో వారికి బాగా తెలుసు! అందుకే ప్రపంచ ఫిల్మ్ మేకర్స్ అందరికీ జర్మనీలో జరిగే ”మ్యూనిచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”లో తమ సినిమాలు అవార్డులు సాధించక పోయినా ఫర్లేదు కనీసం ప్రదర్శనకు నోచుకోవాలని కలలు కంటారు. అంతటి ప్రతిష్ఠాత్మ కమైన ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైన ఐదో రోజుకో, ఆరో రోజుకో ఓ భారతీయ సినిమాని ప్రదర్శించే ఛాన్స్ వచ్చింది.
ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న ప్యాలెస్ లాంటి భవనంలోని ఓ సినిమా హాల్‌లో సినిమా ప్రారంభం అయ్యింది. సినిమా ఆర్ట్స్‌ని విపరీతంగా ఆరాధించి నిజాయితీగా తనదైన మార్గంలో సినిమాలు తీస్తూ ఉన్న ఓ యువదర్శకుడి సినిమా అది! ఎవరి సహాయము. ఏ ప్రోత్సాహమూ లేకుండా ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకోర్చి కేవలం తను సృష్టించిన కళారూపాన్ని ప్రపంచస్థాయి ప్రేక్షకులకు చూపాలని ఎంతో ఆశగా వచ్చాడ తను. ప్రదర్శనకు ముందు వరకు ఎంతో టెన్షన్… ప్రదర్శన మొదలయి టైటిల్స్ పడుతున్నప్పుడు ఆయనలో టెన్షనే… తన సినిమా అంటే తనకు ప్రేమే! కానీ జర్మన్ ప్రేక్షకులు, ఇతర దేశ ప్రతినిధులు తన సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం! అంతేగాక ఆ సినిమా ఇంగ్లీష్‌లో తీసింది కాదు. అక్కడికొచ్చిన విదేశీ ప్రతినిధులకు అసలు ప్రపంచంలో తమ భాష ఒకటంటూ ఉందనే విషయం కూడా తెలీదు…! మెదడును తొలిచేస్తున్న ఇన్ని సందేహాల మధ్య ఆ దర్శకుడు స్ట్రెస్‌ని తట్టుకోలేక, సినిమా హాల్‌లోంచి బైటికి వచ్చాడు.
దేశాలు, సముద్రాలు, ఖండాలు దాటి ఇండియా నుంచి జర్మనీకైతే వచ్చాడు కానీ, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాల్సి వస్తుందో అని మధనపడుతూ థియేటర్ బయట విశాలంగా ఉన్న మెట్ల మీద కూర్చున్నాడు. మెట్ల మీద నుంచి ప్యాలెస్ లాంటి భవనం వైపు, ఆ భవనానికి అందాన్ని తెస్తున్న భారీ పొడవాటి స్థంబాలవైపు యూరోపియన్ ఆర్కిటెక్చర్‌ని అడుగడుగునా ప్రతిబింబిస్తున్న గోడల వైపు చూస్తున్నాడు. పైకి గంభీరంగా ఉన్నాడు. కానీ ఆయనలో అలజడి… ఉత్కంఠ మాత్రం కళ్ళద్దాల వెనుక ఉన్న కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సినిమా అయిపోయినట్లుంది…
ఒక్కొక్కరే బైటికి వస్తున్నారు…
బైటికి వస్తున్న వారందరూ ఏ సందడీ లేకుండా నిశ్శబ్దంగా వస్తున్నారు. వారిలో జర్మన్ మహిళల సమూహం కూడా ఉంది.
ఆ మహిళల్లో కొందరు గేట్ బయట ఉన్న ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకున్ని ఏదో అడుగుతున్నారు. అతడు కూడా ఏదో మాట్లాడి, ఆ తర్వాత అటూ ఇటూ చూసి… అల్లంత దూరాన మెట్ల మీద ఉన్న దర్శకుడి వైపు చేయిని చూపించాడు. అనాలోచితంగా అటువైపు చూసిన దర్శకుడిలో అప్పటికే ఉన్న అలజడి మరింత పెరిగింది.
ఉన్నట్టుండి ఆ మహిళల సమూహం అంతా నెమ్మదిగా దర్శకుడి దగ్గరికి వచ్చారు… అందరూ మెట్ల మీదే అతని చుట్టై కూచున్నారు… ఇంత మంది మహిళలు తననేమైనా ఆటపట్టించడానికి వచ్చారేమో అని అనుకున్నాడాయన… కానీ వాళ్ళందరి కళ్ళల్లో ఆ ఛాయలు లేవు… పైగా ఏదో తెలియని ఆత్మీయత… తమవాడే అనే దగ్గరితనం.
అందులోంచి ఓ మహిళ నెమ్మదిగా జర్మన్ భాషలో అడిగింది. ఈ సినిమా తీసింది నువ్వే కదా,,, నేనొక్కసారి నీ చేతులను స్పర్శించవచ్చా?” అని అడిగింది. సున్నితంగా ఆ దర్శకుడి చేతిని కొనవ్రేళ్ళతో స్పర్శించి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆ దర్శకుడు – బి. నరసింగరావు ! ఆ సినిమా – ‘దాసి’ !
తెలంగాణా సినిమాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టిన దృశ్య స్వాప్నికుడు – నరసింగ రావు! అందుకే ఆయన ‘రంగుల కల’ కు ‘మా భూమి’ పులకరించింది. ఆయన చలన చిత్ర ‘ఆకృతి’ కి ‘మట్టి మనుషులు’, ‘దాసి’ వంటి సామాన్యులే కథానాయ కులయ్యారు! ఆయన సృజించిన ‘హరివిల్లు’ని చూసి, ‘మా ఊరు’, ‘ది సిటీ’ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలూ సలామ్ చేస్తాయి…
వాస్తవిక చిత్రాల దర్శకుడి దృశ్య ప్రపంచంలోకి ఒక విహాంగవీక్షణం చేసి వద్దాం…
తెలంగాణా చరిత్రకు విజువల్ డాక్యుమెంట్-మా భూమి
”కళ” కళ కోసమా, ప్రజల కోసమా? అనేది నిత్య మీమాంస. దీన్లో ప్రజలకోసమే కళ… ప్రజా చైతన్యం కోసం, ప్రజా జీవన చిత్రణ కోసమే సినిమా కళ! అనే అంశాన్ని నిర్థారించిన వాస్తవిక సినిమా-‘ మాభూమి’!
ప్రపంచవ్యాప్తంగా అన్ని కాలాలలోనూ సామాన్యుల చరిత్ర అంతా పోరాటాల చరిత్రే! సామాన్యులలోకెల్లా అతి సామాన్యులైన రైతుల చరిత్రలోనే మహోన్నత సమర అధ్యాయంగా లిఖించదగ్గ పోరాటం – తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం! ”భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం” జరిగిన ఈ పోరాటాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన హిస్టారికల్ పీరియడ్ ఫిల్మ్ ”మా భూమి!”
తెలంగాణ మట్టి చరిత్రలో, నైజాంల నుండి భారత ప్రభుత్వానికి అధికార బదిలీ జరిగిన ఘట్టానికి సంబంధించిన హననంలో ఎన్నో ప్రాణాలు బలయ్యాయి. మరెన్నో త్యాగాలు అమరమైనాయి. అన్నింటినీ మించి రైతులందరూ కన్న ఓ సామూహిక శ్రామిక స్వర్గ స్వప్నం భగ్నమయింది. ఈ ఛిద్రమైన శకలాలకు భగ్నమైన స్వప్నాలకు హ్యుమన్ డాక్యుమెంట్‌గా నిలిచిన సినిమానే – ‘మా భూమి’.
జన్మతః పుట్టింది భూస్వాముల ఇంట్లోనే అయినా, పెంపకం వల్లనూ, సంస్కారం వల్లనూ బి. నరసింగరావులో పుట్టిన శ్రామిక వర్గ పక్షపాత వైఖరి, వామపక్ష ఉద్యమ ప్రభావం, ప్రజా కళల ప్రదర్శనలో కీలక భాగస్వామ్యం వంటి కారణాలు. ఆయనను సినీ నిర్మాణానికి ప్రేరేపిం చాయి. స్వతహాగా పెయింటింగ్, ఫోటోగ్రఫీ, నటన, సంగీతం, సాహితీ సృజన వంటి విభిన్న కళారూపాలతో ఆయనకున్న మమకారం, అధికారం ఆయనను సమస్త కళల సమగ్ర కళారూపమైన సినిమా సృష్టివైపు నడిపించాయి. తత్ఫలితంగా ఆయన సహనిర్మాణం (సారధి స్టూడియో రవీంద్రనాథ్‌తో కలిసి)లో, ఆయన సహరచనలో (ప్రాణ్ రావు, గౌతమ్‌ఘోష్, పార్థుతో కలిసి) నియోరియలిస్టిక్ జీవన చిత్రంగా ‘మాభూమి’ సినిమా తెరకెక్కింది.
ప్రఖ్యాత ఉర్దూ సాహితీవేత్త కిషన్ చందర్ రాసిన ”జబ్ ఖేత్ జాగే” కథ ఆధారంగా, బెంగాలీ దర్శకుడు గౌతమ్ ఘోష్ తొలి చిత్రంగా వచ్చిన ఈ సినిమా, సాహితీ రూపాన్ని సినీరూపంగా మార్చిన సినిమాలలో రిఫరెన్స్ స్థాయిని సాధించింది. భారతీయ సినీరంగానికి గౌతమ్ ఘోష్ వంటి నవ్య చిత్రాల దర్శకుడ్ని పరిచయం చేసింది. కథాకాలం పరంగా 1946-1951 మధ్య తెలంగాణా ప్రాంత చరిత్రను ఆవిష్కరించిన విధానంలో జర్మన్ తరహా ఫిలిం మేకింగ్ స్టైల్‌ని భారతీయ సినిమాకు పరిచయం చేసింది.
నైజాం కాలం నాటి నల్గొండ జిల్లాలోని ఓ గ్రామం – సిరిపురం. పేదరికం, బాంచరికం, భూస్వాముల అధికారం నెలవైన గ్రామం. ఆ గ్రామంలో వీరయ్య అనే రైతు కూలీ కొడుకు రామయ్య. తలవంచి పని చేసుకోవడం తప్ప ప్రశ్నించడం తెలీని యువకుడు. ఊళ్ళో పని కరువై, దిక్కుతోచని పరిస్థితులలో పట్నం బాట పడతాడు. రెక్కల కష్టం తప్ప మరేమీ తెలినీ రామయ్య రిక్షా లాగుతూ బ్రతుకుతుంటాడు. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల జైలు పాలై, అక్కడ తన గ్రామం వాళ్లని కలుస్తాడు. ఊరి నుంచి తెగతెంపులు చేసుకుని బతుకు వెళ్ళదీస్తున్న రామయ్యకు ఊళ్ళో జరుగుతున్న పరిణామాలు వారి ద్వారా తెలుస్తాయి. భూస్వాములు, రజాకార్ల దాష్టీకాలు, వాటికి ప్రతిగా ‘సంగపోళ్ళ పోరాటాలు తెలుస్తాయి. జైలు నుండి విడుదలయ్యాక రామయ్య తిరిగి తన ఊరికి వెళ్ళి అక్కడి ప్రజలని చైతన్యపరిచి, సంఘటితం చేసి దొరలను, రజాకార్లను ఊరి నుండి, తరిమేసి, ‘దున్నేవాడిదే భూమి” సిద్ధాంతంతో భూములను రైతులకు పంచుతాడు. అయితే నైజాం పై భారత ప్రభుత్వ పోలీసుచర్య తర్వాత జరిగిన అధికార బదిలీ, ఆ తదనంతరం సిరిపురం గ్రామంపై ఎలాంటి ఫలితాన్ని చూపించిందనేదే ‘మా భూమి’ సినిమా.
తెలంగాణ భాషలో వచ్చిన తొలి పూర్తిస్థాయి సినిమాగాను, ప్రజా సాహిత్యానికి, ప్రజా సంగీతానికి పట్టం కట్టిన నవ్యవాస్తవిక చిత్రంగాను ‘మాభూమి’ సంచలన విజయాన్ని సాధించింది.
కళల గవాక్షంలోంచి మానవుని
అంతరంగ అన్వేషణ -రంగుల కల
”వాట్ ఈజ్ గ్రేటర్ ద్యాన్ ది సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్” అని గెస్టాల్టిక్ వాదం చెపుతుంది. మనో విజ్ఞాన శాస్త్రంలో జర్మన్ వాదంగా ప్రసిద్ధి చెందిన ఈ వాదం ప్రకారం విడివిడిగా ఉండే భాగాల కన్న సంపూర్ణ…. గొప్పది అని. ఈ సూత్రం సినిమా కళకు తగినట్లుగా అనిపిస్తుంది. సినిమాలో ఎన్నెన్నో కళల కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే ఆ కళలన్నీ కలిసి ఏకమొత్తంగా రూపొందిన సినిమా, విడి విడి కళలకన్నా భిన్నమైన రూపంలో ప్రేక్షకులకు ఆలోచనా నందానుభూతులను కలిగిస్తుంది. ఇదే గెస్టాల్టిక్ సూత్రాన్ని బి. నర్సింగరావుకి కూడా వర్తింప చేసినపుడు మనకు తెరపై ప్రత్యక్షమయ్యే కళారూపమే – ‘రంగుల కల’ సినిమా! బి. నర్సింగరావులో వేర్వేరు పార్శ్వాలుగా ఉన్న కళలన్నింటికీ తోడు, నటన, కళ కూడా కలిసి ఆయనలో ఆవిష్కరించిన విభిన్న రూపమే ఈ ‘రంగుల కల’! ఈ సినిమా ఆయన సంపూర్ణ మూర్తిమత్వదర్శనం. ఎందుకంటే, స్క్రిప్టు రచన, సహ సంగీత దర్శకత్వం, నిర్మాణం, దర్శకత్వం,నటన అనే పంచ రంగులను శ్రద్ధగా అద్ది, ప్రేక్షకుల గుండెతెరలపై ‘రంగుల కల’ని సృష్టించింది. ఆయనే!
జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రపంచ సినిమాతో ప్రముఖ నవ్య చిత్రాల దర్శకులతో జరిగిన పరిచయం బి. నర్సింగ్‌రావు ఇచ్చిన స్ఫూర్తి నుండి ఈ ‘రంగుల కల’ జాలువారింది. స్వతహాగా ఆయన ఫైన్ ఆర్ట్స్‌లో ఆరేళ్ళ డిప్లొమా కోర్సు చేయడం ఈ సినిమాలోని కథానాయకుడి పాత్ర పోషణలో ఆయనకు సపోర్ట్ చేసింది.
సినిమా విషయానికొస్తే కళకి సౌందర్యాత్మక ప్రయోజనమే (ఈస్తటిక్ యుటిలిటి) తప్ప సామాజిక ప్రయోజనమేదీ ఉండదని నమ్మే యువ పెయింటర్ కవి. అందుకే, బ్రాక్లాస్ సోషలైట్ సర్కిల్స్‌లో ప్రదర్శించడానికే ఎక్కువ ఇష్టపడ్డాడు. ఆ క్రమంలో ఆయనకు జరిగిన కొన్ని ఎదురుదెబ్బల తర్వాత తన ఫోకస్ మార్చుకోవాలని భావిస్తాడు. దాన్లో – భాగంగా తన నివాసాన్ని ఓ మురికివాడలోకి మార్చేస్తాడు అక్కడి సామాన్య జనాల బతుకు పోరాటాన్ని నిత్యం ప్రత్యక్షంగా గమనిస్తుంటాడు. క్రమక్రమంగా ఆ మురికివాడల్లో ‘విజిటర్’ స్థాయి నుండి అందులో ఒకడిగా మారతాడు. తన చేతుల్లో ఉన్న కళని, అట్టడుగున ఉన్న ప్రజల వికాసం కోసం చేతల్లో చూపించాలని నిర్ణయించుకుంటాడు.
‘ప్రతీ సృజనకారుడూ ఎంతో కొంత తన సృష్టిలో ఉంటాడు” అనేది పెద్దల మాట. ‘రంగుల కల’ కూడా. బి. నర్సింగ్‌రావు సెమీ-బయోగ్రఫీ.. గానే కాక, ఆయనలోకి ఆయన చేసిన ‘జర్నీ వితిన్’కి తెర రూపం అని చెప్పాలి. కళ యొక్క అంతిమ లక్ష్యం సామాజిక ప్రయోజనమే అనే సత్యాన్ని అత్యంత సహ జంగా, వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన ఈ సినిమా 1984లో బొంబాయిలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ‘ఇండియన్ పనోరమ’ లో ప్రదర్శించబడటమే కాక, జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా సైతం అవార్డును గెలుచుకుంది. (సశేషం)