ఒక స్వప్నం – సాకారమయింది. ఇక కోటిఆశలతో 4 కోట్ల గొంతుకలు ‘బంగారు తెలంగాణ’ గానం చేస్తున్నాయి. ఒకటే లక్ష్యం.. ఒకటే ధ్యేయం.. ఒకటే గమ్యం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న దృశ్యం. ఆ గమ్యం చేరుకునే దిశలో ఉద్యానశాఖ దూసుకెళ్తూ, అందరికీ మార్గదర్శిగా నిలుస్తోంది. ప్రధానంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలోని 10 నర్సరీలు తెలంగాణ ముఖ చిత్రాన్ని ఉద్యానహబ్ చేస్తున్నాయి.
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడూ నర్సరీల మౌలిక సదుపాయాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేవు. 2014 జూన్‌లో ‘తెలంగాణ’ ఆవిర్భావం తరువాత నిర్ధిష్టమైన లక్ష్యాలతో ఉద్యానరంగంలో అభివృద్ధికోసం ‘ఉద్యానశాఖ’ తనదైన శైలిలో వినూత్నపంథాలో ప్రణాళిక రూపొందించుకుంది. తన లోపాలను స్పష్టంగా గుర్తించింది. ముందుగా శిథిలమైపోయిన నర్సరీలను పునరుద్ధరించాలని కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయాలను మననం చేసుకుంటూ, ‘బంగారు తెలంగాణ’ సాధనలో ఉద్యానశాఖ భాగస్వామ్యం అందుకునేలా ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా నరసింహదాస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. తన లక్ష్యాలను వివరించి, వీటి సాధనను నిత్యం పర్యవేక్షించే గురుతర బాధ్యలను సకాలంలో పనులయ్యేలా చూడాల్సిన బాధ్యతను ఆయనకు అప్పచెప్పారు. గత ఆరు మాసాల కాలంలో అద్భుత ప్రగతిని సాధించారు. ఉద్యానశాఖ నర్సరీలు కొత్తరూపు సంతరించుకున్నాయి.
తెలంగాణలోని ఏడు నర్సరీల మౌలిక వనరుల అభివృద్ధికి ఆరుకోట్ల రూపాయలు కేటాయించారు. వీటిలో నర్సరీలలో షేడ్ నెట్స్, గ్రీన్ హౌసులు, మిస్ట్‌చాంబర్లు, ట్రాక్టర్లు తదితర మౌలిక వనరులు ఏర్పాటు చేశారు. కొత్త మౌలిక వనరులు కల్పన అధికారులలో కొత్త ఉత్తేజం నింపింది. ఇక నర్సరీలలో చేపట్టాల్సిన పనుల కోసం ఉద్యాన శాఖ నిధులు కేటాయించింది. అప్పటిదాకా నిధులలేమి, పర్యవేక్షణ కొరత, దిశానిర్దేశం లేకపోవడంతో నర్సరీలు ఒక్కసారిగా చిగుర్లు వేయడం ప్రారంభించాయి.
ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని గుడిపేట, జైపూర్, కన్నల్, నిజామాబాద్ జిల్లాలోని నూల్తుమేడ, కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్, మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, అచ్యుతాపూర్, గరిమెళ్ళపాడు నర్సరీలు మౌలిక వసతుల కల్పనతో కొత్త చిగుర్లు వేస్తున్నాయి. లక్షల కొద్ది అంట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. పండ్ల మొక్కల అభివృద్ధికి తోడ్పడ్డాయి. నాణ్యతకు, విశ్వసనీయతకు గీటురాళ్ళయ్యాయి.
ప ఆదిలాబాద్ జిల్లాలోని గుడిపేట, జైపూర్ నర్సరీలలో తొలిసారిగా ఆపిల్ బేర్‌కు ‘తెలంగాణ ఆపిల్’గా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని భావిస్తూ 20 ఎకరాలలో డిసెంబర్‌లో నాటారు. వచ్చే జనవరికి రైతుల అవసరాలకు ధీటుగా మొక్కంట్లు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తారు. అదేవిధంగా మరో 5 ఎకరాలలో ఎన్‌హచ్‌ఎం-1 సీతాఫలం రకం అంట్ల ఉత్పత్తి జరుగుతుంది. ‘షోలాపూర్’ హోంలో ఈ రకం ఒక్కోటి 150 రూపాయల ధర పలకటం విశేషం. వీటితో పాటు మామిడి, జామ, దానిమ్మ మొక్కల ప్రవర్ధనం ఉంటుంది.
ప ప్రతి నర్సరీని రైతుల శిక్షణ కేంద్రంగా మలుస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకాలను సమన్వయ పరుస్తూ, మారుతున్న పరిస్థితులకు అనువుగా రైతులకు అవసరమైన కూరగాయల నారు, పండ్ల మొక్కలను పంపిణీ చేసేలా నర్సరీలను ఉత్పత్తికేంద్రాలు చేస్తున్నారు.
ప అచ్యుతాపురం, గరిమెళ్ళపాడు, అశ్వరావుపేట, వికారాబాద్, రుక్మాపూర్, గుడిపేట, జైపూర్ నర్సరీలలో ఉల్లి నారు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్కా కళ్యాణ్, అర్కాలలిత, భీమాకిరణ్ రకాల ఉల్లి ఉత్పత్తికి, భారత ఉద్యానవనరుల పరిశోధనా సంస్థ వారి సాంకేతిక పరిజ్ఞానంతో, వారి సూచనల మేరకు నారు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఆ తర్వాత రైతులకు పంపిణీ చేస్తారు. ప్రతి నర్సరీని ఒక (మోడల్) నమూనాగా పరిచయం చేస్తున్నారు. ఉద్యానవరుల సమస్యలకు పరిష్కారసూచిగా మారుస్తున్నారు. పండ్లు, పూలు, కూరగాయాల సాగులో అత్యాధునిక పరిజ్ఞానం ఆచరించటం ద్వారా వచ్చే ఫలాలను ఆచరణాత్మకంగా నర్సరీలలో చూపిస్తున్నారు. ఒకమాటలో చెప్పాలంటే ఒక్కో నర్సరీ ఉద్యాన రైతుల వికాస కేంద్రంగా అభివృద్దిచేస్తున్నారు.
ప రంగారెడ్డి జిల్లా వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా పిల్లల మర్రి నర్సరీలలో దానిమ్మ అంట్లను ఉత్పత్తి చేసి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా రైతుల అవసరాలను తీర్చాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ జిల్లాల రైతులకు కావాల్సిన కిస్నో ఆరెంజస్‌లోని బ్లడ్‌రెడ్ రకాన్ని నిజామాబాద్ జిల్లా మాల్తుమేడ నర్సరీలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క నర్సరీకి ఒక్కో ప్రత్యేక బాధ్యత పెట్టి, లక్ష్యాల దిశగా, నిరంతర పర్యవేక్షణతో సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
అటవీ శాఖతో భాగస్వామ్య ఒప్పందం
తెలంగాణ ‘హరితహారం’ కోసం కావాల్సిన పండ్లమొక్కల అంట్ల ఉత్పత్తి కోసం అటవీశాఖ, ఉద్యానశాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పండ్ల మొక్కల ఉత్పత్తికోసం అటవీశాఖ ఉద్యానశాఖకు 3 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 16 లక్షల 50 వేలు మామిడి, ఒక లక్ష జామ, లక్షా 25 వేల కొబ్బరి, 50 వేల సపోట, 25 వేలు దానిమ్మ మొక్కలు అటవీశాఖకు సరఫరా చేయాలి. ఇలా ఏ అవకాశం వచ్చినా జారవిడుచుకోకుండా, ఉద్యానశాఖ వారి నర్సరీలను స్వయం పోషకాలుగా చేస్తూ మరోవైపు ఏకో అగ్రి టూరిజం కేంద్రాలుగా రూపొందిస్తున్నారు. ఇవన్నీకూడా ఆయా నర్సరీలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, వీటితో పాటు సాదారణంగా ఉత్పత్తి చేయాల్సిన ఇతర పండ్ల మొక్కల ఉత్పత్తి నిత్యం జరుగుతుంటుంది.
పూలు, కూరగాయల నారు కూడా పెంచటం, అవసరమైన రైతులకు పంపిణీ చేయటం వీటి బాధ్యత.
ఐదురకాల కొబ్బరి మొక్కలు
శ్రీ ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో కొబ్బరి 5 రకాల మొక్కలు, మామిడి అంట్లు ఉత్పత్తి చేస్తున్నారు. గరిమెళ్ళపాడు, అచ్యుతాపురం నర్సరీలలో మామిడి, జామ, సపోట.
శ్రీ రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో మామిడి, జామ
శ్రీ మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రిలో మామిడి, జామ, పూల మొక్కలు ఉత్పత్తి
శ్రీ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో మామిడి తదితర పండ్ల మొక్కల ఉత్పత్తి ప్రారంభం కావటం విశేషం. ఆయా నర్సరీల లక్ష్యాలకు అనుగుణంగా లక్షల సంఖ్యలో వివిధ పండ్ల మొక్కల అంట్ల ఉత్పత్తి చేసి, రైతుల అవసరాలకు అనువుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ ఉద్యానశాఖ సిద్ధం చేస్తోంది.
రాబోయే 2,3 సంవత్సరాలలో భారతదేశంలో ఉద్యానరంగంలో తెలంగాణను అగ్రగామిగా చేయాలన్న సంకల్పంతో కృషి జరుగుతోంది.