సూరజ్‌ వి. భరద్వాజ్‌
tsmagazine
వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు నడివీధి అంగడిలో రాసులుగా పోసి అమ్మిన, నాటి గుప్తులకాలం దేశానికి స్వర్ణయుగమైతే, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో తెలంగాణాలో సమాంతరంగా అమలు చేస్తోన్న కేసీఆర్‌ పాలన కూడా ముమ్మాటికీ స్వర్ణయుగమే. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణాలో ఓ నవయుగం ప్రారంభమైంది. దార్శనికనేత కేసీఆర్‌ తన పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. రాష్ట్రంలో రైతుశకం ప్రారంభమైంది. అటు దేశంలో ఏ పార్టీ, మరే నాయకుడు గాని, ఇటు సమైక్య పాలనలో ఇంకే స్థానిక పార్టీ, ప్రాంతీయ నేతగాని, కనీసం ఊహించని ఒక విప్లవాత్మక పంథాను వ్యవసాయరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్నారు. రైతుబంధు మొదలు రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో కేసీఆర్‌ తీసుకున్న చర్యల తరవాత, ఆత్మహత్యలు ఇకపై ఓ చరిత్ర మాత్రమే అని రూఢీ చేశాయి. కేసీఆర్‌ కలల రాజ్యంలో ఇప్పుడు రైతేరాజు. ఒకప్పుడు దండగ అనుకున్న వ్యవసాయం రైతుబంధు పథకం మొదలైన తరవాత ఓ పండగలా సాగుతుందనేది అక్షరసత్యం.

తొలకరి పలకరించగానే రైతులు బేలగా వడ్డీ వ్యాపారి వైపు చూడటం, అడిగినంత మిత్తికి ఒప్పుకుని అప్పు చేయడం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు రైతుకు బంధువుగా నేనున్నాను అంటున్నారు, వ్యవసాయానికి అండగా ముందుంటానంటున్నాడు, రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించి చేయూతనిస్తున్నాడు సీఎం కేసీఆర్‌.

దుక్కి దున్నగానే విత్తనాలు, ఎరువుల కోసం రైతులు అగచాట్లు పడే ఆరోజులు మన రాష్ట్రంలో మాయమైపోయాయి. నాణ్యతలేని, నకిలీ విత్తనాల ఉత్పత్తులకు కళ్లెం వేయడమే కాదు, అలాంటి కంపెనీలు, వాటిని అమ్మే వ్యాపారుల భరతం పట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, సంబంధిత చట్టాలను మరింత పదునెక్కించారు. కఠినశిక్షల అమలుకు నడుంకట్టారు. ఇక ఎరువులు, పురుగు మందుల కోసం దుకాణాల ముందు రైతులు బారులు తీరడం, రోజులకొద్దీ పడిగాపులుకాయడం, వాటి కోసం ధర్నాలు, రాస్తా రోకోలు, ఇతర ఆందోళనలు, వాటిని నిలువరించడానికి పోలీసుల పహారా, అల్లర్ల నియంత్రణకు లాఠీచార్జీ చేయడం, ఇలా ఒకప్పటి ఉద్రిక్త పరిస్థితులన్నీ ఇవాళ తెలంగాణలో కనుమరుగైపోయాయి.

దుక్కిదున్ని, విత్తువిత్తగానే నీళ్ళో రామచంద్రా అంటూ రైతులు పడే బాధలు అంతాఇంతా కాదు. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, సాగునీటి ప్రాజెక్టులు లేక, కాలువల్లోకి నీళ్లు రాక ఆయకట్లు ఎండిపోయి మరోవైపు, సరైన సమయానికి పంటలకు నీళ్ళందక రైతులు నానా అవస్థలు పడేవాళ్ళు. ఇక ఇక్కడ సగానికి పైగా వ్యవసాయం, బోరు బావులపైన ఆధారపడి జరిగేదే అనే విషయం జగమెరిగిన సత్యం. బావులు ఎండిపోయి, బీళ్లు నీళ్లకోసం నోళ్లు చాచిన రోజులను ఇక్కడి రైతాంగం చాలానే చూశారు. ఇప్పుడవన్నీ ఒకప్పటి రోజులు. రాష్ట్రం ఏర్పడీ ఏర్పడగానే మిషన్‌ కాకతీయ పేరిట కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులన్నిటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునర్జీవం పోశారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలయజ్ఞం పేరిట జరిగిన ధనయజ్ఞానికి ఆయన చరమగీతం పాడారు. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌ ద్వారా ప్రతియేడు వృధాగా సముద్రం పాలవుతున్న 1300 టీఎంసీల గోదావరి, కష్ణా జలాలను ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం లాంటి ఓ మహత్తరమైన భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కల్వకుర్తి, బీమా, కోయల్‌ సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కోటి ఎకరాల మాగాణాన్ని సస్యశ్యామలం చేసే దిశలో వడివడిగా అడుగులేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తెలంగాణకు వరప్రదాయినిగా మారే కాళేశ్వర గంగ నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి, ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడమే కాదు, తద్వారా తెలంగాణ రాష్ట్రం త్వరలో దేశానికే ఆదర్శంగా నిలవబోతోంది. వర్షాభావ పరిస్థితులు, బోర్లు ఎండిపోవడం లాంటి వైపరీత్యాలకు ఇకపై తెలంగాణా రైతన్నలు ఏమాత్రం జంకే పరిస్థితులు లేవు. వాటి ప్రభావం రాష్ట్రంలో ఇకపై నామమాత్రమే. రైతులు తెలంగాణలో ఏటా మూడు పంటలను దిగ్విజయంగా పండించి సిరులు కురిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు అప్పట్లో కేవలం రాజకీయ హామీగానే ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హామీమేరకు పూర్తి నిడివిలో నాణ్యమైన కరెంటు రాకపోవడం, పంటలకు సరిగా నీళ్ళందకపోవడం, ఆటోమాటిక్‌ స్టార్టర్లు, ఆపై లోవోల్టేజీ, విద్యుత్‌ మోటార్లు కాలిపోవడం, రిపేర్లు, వాటి పేరిట వేలాది రూపాయల ఖర్చు, అబ్బో వ్యవసాయం అంటేనే ఓ తంటాలా తయారైన గడ్డుకాలం. ఇలా నీళ్ల కటకటకు కరెంటు కష్టాలు తోడైన ఒకప్పటి పరిస్థితులు తెలంగాణలో పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి. తన పాలన మొదలుకాగానే, కేసీఆర్‌ ముందుగా రాష్ట్రంలో అంధకారాన్ని ఆమడదూరం తరిమేశారు. సమైక్య రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలు పడ్డ కరెంటు కష్టాలను చిటికెలో కడతేర్చారు. కోతలులేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయానికి ఈ ఏడాది జనవరి నుంచి 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నారు. ఏటా 5 వేల కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమయ్యే విద్యుత్‌ ఉత్పత్తి కోసం ముందస్తు ప్రణాళికలను రచిస్తున్నారు. ఆ దిశలో స్వయం సమద్ధి సాధించేందుకు ఏటా 24 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పవర్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. వ్యవసాయరంగ ఆధునీకరణకు అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని, అధునాతన ఫార్మింగ్‌ పద్దతులను కూడా కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. పొలం దున్నడానికి సబ్సిడీపై ట్రాక్టర్లు అందిస్తున్నారు. వాటిపై పన్ను మినహాయింపులు, జీఎస్టీ రాయితీలు కల్పిస్తున్నారు. పాలీహౌజ్‌లను ప్రోత్సహిస్తున్నారు. పంటచేలలో డ్రిప్‌ ఇరిగేషన్ల ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తున్నారు. పంటకోతలకు హార్వెస్టర్ల వాడటం, ఫామ్‌ మెకనైజేషన్‌ లాంటి నవీన పద్ధతులను అనుసరించేలా రైతులకు అవగాహన కల్పించడం తదితర చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దష్టిసారిస్తున్నారు.

ఇక చేతికందిన పంటను రైతులు మార్కెట్లకు తరలిం చడం మొదలు, లాభసాటి ధర వచ్చేంత వరకు ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పించడం వరకు కావలసిన అన్ని ఏర్పాట్లపై కూడా కేసీఆర్‌ తనదైన శైలిలో దష్టి సారించారు. 4 లక్షల మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లకు అదనంగా మరో 18 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్లను నిర్మించారు. అటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే విషయమై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేసి వ్యవసాయ కూలీలకు ఏటా కనీస పనిదినాలు కల్పిస్తే కేసీఆర్‌ తలపెట్టిన రైతు సంక్షేమ యజ్ఞం సంపూర్ణమవుతుంది.
tsmagazine
వ్యవసాయం లాభసాటిగా మారడానికి దోహద పడే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నియోజక వర్గానికి ఒకటి చొప్పున నిర్మించేందుకు ఓ విధానాన్ని రూపొం దించారు. ఇలా రైతు వికాసానికి తనదైన శైలిలో కషి చేస్తోన్న కేసీఆర్‌ ఓ నయా హరిత విప్లవానికి తెర లేపారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

80 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న భారతదేశం ఆ రంగానికి సరైన ఆదరణ లేక ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. జై జవాన్‌ – జై కిసాన్‌ అంటూ ఒకప్పుడు నినదించారే కాని, వాళ్ళ కష్టాలు కడతేర్చే దిశలో కషి జరపడంలో మాత్రం ప్రభుత్వాలు ఎప్పుడూ విఫలమయ్యాయి. దేశంలో వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చడానికి స్వామినాథన్‌ కమిషన్ను వేశారు, కాని హరితవిప్లవం సాధించడానికి ఆ కమిషన్‌ చేసిన సిఫారసులను మాత్రం విజయవంతంగా ఆటకెక్కించారు. రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న చరణ్‌ సింగ్‌ దేశ ప్రధానిగా ఉన్న కాలంలో కొంత మేరకు భూసంస్కరణలపై దష్టి సారించినా, రైతుల్లో భరోసా నింపే కార్యక్రమాల అమలు జరగలేదు. ఇక ప్రధానిగా దేవెగౌడ, ఉప ప్రధానిగా దేవీలాల్‌ లాంటి రైతు నాయకులు ఒకప్పుడు కేంద్రంలో ఉన్నా, ప్రాథమిక రంగం బలోపేతానికి వాళ్ళు సైతం ఒక్కటంటే ఒక్క విన్నూత్న విధానాన్ని ప్రవేశపెట్టలేక పోయారు. అయ్యో నేను ప్రధానిగా ఉన్నప్పుడు రైతుబంధు లాంటి పథకం నా ఆలోచనలకు తట్టలేదే అని దేవెగౌడ ఈ మధ్య వ్యాఖ్యానించడమే అందుకు తార్కాణం.

ఒక్కసారి గతాన్ని నెమరువేసుకుంటే, ప్రభుత్వాలపై ప్రజలకు విసుగెత్తిననాడు పాలకులు మారారు, కానీ, ప్రజల తలరాతలు మాత్రం మారలేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయి, రైతులు నైరాశ్యంలో కూరుకుపోయారు. గత్యంతరం లేక, బతుకు బండీ లాగలేక, పెట్టుబడి లేక, అప్పోసోప్పో చేసి సాగు చేసినా దిగుబడి రాక, వచ్చిన దిగుబడికి కనీస మద్దతు ధరలేక, రాబడి రాక, చివరకు సగటు రైతుకు ఆత్మహత్యే శరణ్యమయ్యేది. ప్రభుత్వంలో ఉన్న పార్టీలు పదో పరకో ప్రకటించి తమ ఉదాత్తతను ప్రకటిస్తే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పాలకులపై దుమ్మెత్తిపోసి, పూర్తి రాజకీయ విమర్శలతో మొసలి కన్నీళ్లు కార్చి చేతులుదులుపుకునేవి. కనీసం ఒక్కళ్లంటే, ఒక్కళ్ళు రైతుల కష్టాలు ఇవీ అని గుర్తించిన దాఖలాలు లేవు. ఆ కష్టాలను కడతేర్చడానికి ఇదిగో ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ఫలానా పథకం అమలు చేస్తే వాళ్లలో ఆత్మస్థైర్యం పెరిగి ఆత్మహత్యలు ఆగుతాయి అని మానవతా కోణంలో ఒక్కనేతా ఆలోచించిన పాపానపోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం గత పాలకులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏ కారణం చేతైనా రైతు మరణిస్తే, అతని కుటుంబానికి 5 లక్షల పరిహారం అందే విధంగా రాష్ట్రంలో రైతుబీమాను ప్రవేశ పెడుతున్నారు. ఆ బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించే విధంగా ఓ విధానాన్ని రూపొందిస్తున్నారు.

ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కినప్పుడు ప్రభుత్వం కలగజేసుకుని అటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడాల్సి ఉంటుంది. వివిధ రంగాలను బలోపేతం చేయడానికి ఊతమిచ్చేలా వ్యవస్థ తన ఆర్థిక విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కష్టాల, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆయా రంగాలకు ప్రభుత్వమే ఆర్థిక పరిపుష్టి కల్పించాలనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కినీషియన్‌ ఎకనమిక్‌ థియరీ సారాంశం. వ్యవసాయరంగ పురోభివృద్ధికి కేసీఆర్‌ అనుసరిస్తోన్న విధానాలు ఆ సిద్ధాంతంలో ఇమిడిపోయేవే. ఆయన ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కూడా ఆ కోవలోనిదే. మాంద్యంలోకి కూరుకుపోతున్న వ్యవసాయరంగానికి బాసటగా నిలిచి జీవంపోయడం సరిగ్గా అలాంటి ప్రక్రియే. నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి ఏటా ఎకరానికి రూ. 8 వేల పంటసాయం నేరుగా అందించటం నిజంగా ఓ అద్భుత చర్య. మద్దతుధర కల్పించడం కంటే, పంటసాయం అందించడమే రైతులకు ప్రభుత్వాలు అందించే నిజమైన చేయూత. అసలు నూటికి 80 శాతం మంది రైతులు తాము పండించిన పంటను, తమ గహావసరాలకు మాత్రమే వినియోగించుకుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌ వ్యవహారాలు, మద్దతుధరలు, రైతులకు ఎలా లబ్ధి చేకూరుస్తాయనేది ప్రశ్న. అందుకే పంటకోసం పెట్టుబడి అందించే రైతుబంధు పథకం పూర్తి సమర్థనీయం.

అటు కొన్ని రాష్ట్రాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో నగదు బదిలీ పథకం ప్రస్తావన చేశాయి. కానీ వాటిని అమలు చేయటంలో మాత్రం పూర్తిగా విఫల మయ్యాయి. ప్రభుత్వం ప్రజల కోసం ఓ పథకం ద్వారా వెయ్యి రూపాయలు అందించాలనుకుంటే, అనేక దశలు దాటిన తరవాత దాంట్లో కనీసం రూ. 20 కూడా వాళ్ళ చేతికి అందడం లేదని ఒకప్పుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలకు నేరుగా లబ్దిని చేకూర్చే నగదు బదిలీ పథకాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. అలాంటిదే కేసీఆర్‌ మానస పుత్రిక రైతుబంధు. ఈ పథకం ద్వారా చెక్కుల రూపంలో నగదు నేరుగా రైతుల చేతికి నూటికి నూరు శాతం బదిలీ అవుతున్నది. చేతికందిన చెక్కును బ్యాంకులకు వెళ్లి క్యాష్‌ చేసుకున్నప్పుడు రైతుల ముఖాల్లో తాండవిస్తోన్న ఆనందమే ఇందుకు మంచి ఉదాహరణ. నగదు చేతికందిన తరవాత వాళ్ళ ముఖాలు వెయ్యి వోల్టుల్లో వెలిగిపోతుండటం ఆ స్కీం విజయవంతమైంది అనడానికి సంకేతం. అందుకే రైతుబంధు అసలు సిసలైన నగదు బదిలీ పథకం అనడంలో కూడా అతిశయోక్తి లేదు. వ్యవసాయరంగ పునరుజ్జీవనానికి జరుగుతున్న విశేష కషితో తెలంగాణలో నవయుగం – రైతుశకం ప్రారంభ మయ్యాయి.

Other Updates