– శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

సూర్యాపేట జాతీయ రహదారి క్రాసింగ్‌ వద్ద పారుతున్న కాలువ

సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతాల్లో శ్రీరాంసాగర్‌ రెండో దశ కాలువల్లో గోదావరి జలాల నీటి నిర్వాహణ పనులను పర్యవేక్షించడానికి అక్టోబర్‌ 29న ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేందర్‌ రావు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ సుదీర్‌తో కల్సి వెళ్లాను. అక్కడ నీటి నిర్వాహణ సంగతులు రాసే ముందు ఉద్యమ సమయంలో ఒక ఘట్టాన్ని మననం చేసుకోవాలని అనిపించింది. 2012లో తెలంగాణా విద్యావంతుల వేదిక నల్లగొండ యూనిట్‌ వారు జల సాధన సదస్సు ఏర్పాటు చేశారు. దేవాదుల ప్రాజెక్టుకు దిగువన గోదావరిపై కాంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు నీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ సదస్సులో ఆర్‌. విద్యాసాగర్‌ రావు, శ్యాంప్రసాద్‌ రెడ్డి నేను వక్తలుగా పాల్గొని ప్రసంగించాము. ఇటువంటి సదస్సులు ఉద్యమ సమయంలో అనేకం జరిగినాయి. ఈ సదస్సు ప్రత్యేకత ఏమంటే.. సూర్యాపేట జిల్లా డి.కొత్తపల్లి గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు నీరు అందించే ఒక ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీ డిబిఎం – 71 కాలువలో టెంట్లు వేసి సదస్సును ఏర్పాటు చేశారు. కాలువ ఉన్నట్టే కాని తుమ్మలతో నిండిపోయి ఒక అడవిని తలపిస్తున్నది. సదస్సు కోసం కాలువలో కొంత మేరకు శుభ్రం చేసి టెంట్లు వేశారు. జెనరేటర్‌ ద్వారా కరెంటు సరఫరా చేసి మైకులు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో ప్రసంగించిన రైతులు అందరూ కూడా కాలువలు తవ్వి పదేండ్లు అయినా ఒక్క చుక్క ఈ కాలువల్లో ప్రవహించలేదు. ఇక శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు లోయర్‌ మానేర్‌ డ్యాం ను దాటుకొని 200 కి. మీ కాకతీయ కాలువలో ప్రవహించి మొదటి దశ ఆయకట్టు అవసరాలు తీర్చిన తర్వాత ఈ కాలువల్లోకి నీరు చేరుతుందన్న ఆశ మాకు లేదు. గోదావరి మీద కాంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి శ్రీరాంసాగర్‌ కాలువల్లో నీరు వదిలితే తప్ప మాకు నీరు రాదు. కాబట్టి కాంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

ఆనాడు శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు నీరు అందించడానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణా ఇంజనీర్లు తయారు చేసిన కాంతనపల్లి ప్రాజెక్టుని ఉమ్మడి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఆమోదం తెలిపింది. కాని ప్రాజెక్టు పనులు మొదలు కాలేదు. కాంతనపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన లక్ష్యాలు రెండు. ఒకటి దేవాదుల ప్రాజెక్టుకు గోదావరి నదిపై నీటి నిల్వను అందుబాటులోకి తేవడం, రెండోది శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు సాగునీరు అందించడం.

ఇక సీన్‌ కట్‌ చేస్తే.. ఏడేండ్ల తర్వాత మళ్ళీ డి.కొత్తపల్లి వద్ద డిబిఎమ్‌ -71 కాలువ వద్ద సదస్సు నిర్వహించిన చోట నిలబడి చూశాను. కాలువలో పూర్తి స్థాయిలో గోదావరి నీరు ప్రవహిస్తున్నది. ఎంత మార్పు! హృదయం ఉప్పొంగింది. ఒకప్పుడు ఈ కాలువల్లో గోదావరి నీటిని చూస్తామా అన్న అనుమానం వ్యక్తం చేసిన రైతులు ఇవ్వాలా ఊరూరా గోదావరి మాతకు పూలతో స్వాగతం పలుకుతున్నారు. వారి ఊరి చెరువులు గోదావరి జలాలతో నిండుతుంటే వారి సంతోషానికి అవధులు లేవు. ఇవి కాళేశ్వరం నీళ్ళా? శ్రీరాంసాగర్‌ నీళ్ళా ? అన్న మీమాంసలో వారు లేరు. అవి గోదావరి జలాలని మాత్రం వారికి తెలుసు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయినందుకే గోదావరి నీరు తమ చెంతకు చేరుతున్నదని కూడా తెలుసు.

 మత్తడి పారుతున్న అక్కల దేవి గూడ చెరువు, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా

మత్తడి పారుతున్న అక్కల దేవి గూడ చెరువు, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా

శ్రీరాంసాగర్‌ మొదటి దశ ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలు. కాకతీయ కాలువ 0 కి.మీ నుంచి 284 కి.మీ పరిధిలో ఈ ఆయకట్టు విస్తరించి ఉన్నది. లోయర్‌ మానేరు డ్యాం వరకు ఆయకట్టు 4.63 లక్షల ఎకరాలు, లోయర్‌ మానేరు డ్యాం కింద 284 కి.మీ ల వరకు 5.05 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇక రెండో దశలో కి.మీ 284 నుంచి కి.మీ 348 వరకు కాకతీయ కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 4.40 లక్షల ఎకరాలు. రెండు దశల్లో ఉన్న కాలువలకు నీరు శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచే అందాలి. అయితే శ్రీరాంసాగర్‌ డ్యాంకు మహారాష్ట్రా నుంచి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయినాయి. గత 38 సంవత్సరాల వరద చరిత్రను పరిశీలిస్తే 25 సంవత్సాలు (66 శాతం) కరువు, 13 సంవత్స రాలు(34 శాతం) మాత్రమే వరద వచ్చింది. కాబట్టి శ్రీరాంసాగర్‌ మొదటి దశ ఆయకట్టు అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి నెలకొన్నది.

ఇక రెండో దశ ఆయకట్టుకు నీరు అందని ద్రాక్ష పండే. కాలువలు కూడా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండో దశ ప్రధాన కాలువలు, కొన్ని ఉప కాలువలు తవ్వినా అనేక సమస్యల కారణంగా అవి పూర్తి కాలేని పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగు నీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపినప్పుడు శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు నీరివ్వడం ఎట్లా అన్న అంశంపై ముఖ్యమంత్రి సుదీర్గంగా, సునిశితంగా చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్‌ ఆయకట్టు రైతాంగం ఆశలు నేరవేరుతాయన్న విశ్వాసంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. పైన పేర్కొన్న కాంతనపల్లి బ్యారేజి వలన ఆదివాసీ గ్రామాలు, భూములు ముంపు బారిన పడుతుండడంతో బ్యారేజి స్థలాన్ని ఎగువన తుపాకుల గూడెంకు మార్చడం జరిగింది. శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు శ్రీరాంసాగర్‌ కు వరద రాని కాలంలో కాళేశ్వరం నీటిని లోయర్‌ మానేరు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు సాగునీరు అందించడమనే కాంతనపల్లి ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి నేరవేరినట్టయ్యింది.

రాయి చెరువు, మాచారం గ్రామం, పెన్‌ పహాడ్‌ మండలం, సూర్యాపేట జిల్లా

కాంతనపల్లి / తుపాకులగూడెం బ్యారేజి ఇప్పుడు గోదావరిపై దేవాదుల ప్రాజెక్టుకు నీటి నిల్వను సమకూరుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 18.20 లక్షల కొత్త ఆయకట్టుతో పాటూ శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు, వరద కాలువ, ఎల్లంపల్లి, చెరువుల కింద ఉన్న ఆయకట్టును కూడా స్థిరీకరించే లక్ష్యంతో ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసినారు. అందులో ప్రధానమైనవి శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవన పథకం, శ్రీరాంసాగర్‌ కాలువల ఆధునీకీకరణ, మిడ్‌ మానేరు జలాశయం. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటూ పూర్తి చేయడానికి ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనుకున్నట్టే కాళేశ్వరంతో పాటే ఈ పనులు కూడా పూర్తి అయినాయి.

టెయిల్‌ టు హెడ్‌ నీటి నిర్వహణ

ఈ రోజున శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు… అన్నీ పూర్తి స్థాయిలో నీటిని చెరువుల్లోకి తరలిస్తున్నాయి. ఇంజనీర్లు ఈ సారి ఒక కొత్త ప్రయోగానికి పూనుకున్నారు. 2018 లో శ్రీరాంసాగర్‌ మొదటి దశ ఆయకట్టులో జయప్రదంగా అమలు చేసిన టెయిల్‌ టు హెడ్‌ (Tail to Head) పద్ధతినే ఇప్పుడు రెండో దశ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులని నింపడానికి అమలుచేస్తున్నారు. ముందు రైతులకు, ప్రజా ప్రతినిధులకు ఈ అంశంపై అవగాహన కల్గించారు. పత్రికలూ ప్రచారం చేసినాయి. రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినారు. ఎక్కడా రైతుల నుంచి కాలువ కట్టలు తెగ్గొట్టే సందర్భాలు ఎదురు కాలేదని ఇంజనీర్లు చెప్పడం సంతోషం కలిగించింది. ఇంజనీర్లు స్వేచ్ఛగా, పకడ్బందిగా పగలూ రాత్రీ కాలువలపై తిరుగుతూ నీటి నిర్వాహణను పర్యవేక్షిస్తున్నారు. చెరువులను నింపే పనిలో నిమగ్నం అయినారు. లోయర్‌ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువలోకి అక్టోబర్‌ 13న నీటి విడుదల ప్రారంభం అయ్యింది. టెయిల్‌ టు హెడ్‌ (Tail to Head) పద్ధతిలో నీటిని అందించాలని ముందే నిర్ణయించారు కనుక పైన ఉన్న తూములు అన్నీ మూసి ఉంచినారు. 15 అక్టోబర్‌ నాటికి నీరు కి.మీ 284 వరకు చేరింది. అక్కడి నుంచి మొదట ప్రధాన కాలువ చివరి వరకు నీటిని తరలించారు. ఆ తర్వాత చివరి డిస్ట్రిబ్యూటరీల తూములు ఒక్కొక్కటి తెరుస్తూ పైకి రావడం జరిగింది. ఇప్పుడు డి బి ఎం 71, డి బి ఎం 69, డి బి ఎం 60 లాంటి ప్రధాన ఉపకాలువలు, వాటి మైనర్లలో నీరు పూర్తి స్థాయిలో చెరువుల్లోకి తరలిస్తున్నాయి.

సూర్యాపేట కాలువల్లో గోదావరి జలాలు ప్రవహిస్తుంటే కొందరు ఈ నీరు ఎ ప్రాజెక్టువి? ఈ కాలువలు ఎప్పుడు తవ్వారు? ఎవరు తవ్వారు? మిడ్‌ మానేరులో నీళ్ళే లేవు. ఇవి కాళేశ్వరం నీరు ఎట్లా అవుతుంది? అని ప్రజలకు పట్టని అనవసరపు చర్చ లేవదీస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతంలో తవ్విన కాలువలు శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు నీరు అందించడానికి ఉద్దేశించబడినవని పైన వివరించాను. కాలువల తవ్వకం సుమారు 15 ఏండ్ల కింద మొదలయినాయి. ప్రధాన కాలువ తవ్వకం పూర్తి అయినా చాలా ఉప కాలువల తవ్వకం, కట్టడాల (structures) నిర్మాణం తెలంగాణా ఏర్పాటు తర్వాతనే వేగవంతం అయినాయి. పూర్తి కూడా అయినాయి. డి బి ఎం -71 పై కీలకమైన GAIL, HPCL పైప్‌ లైన్ల క్రాసింగ్‌లు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయించింది. ఇప్పుడు ఆయకట్టుకు నీరు అందించడానికి కాలువలు సిద్దంగా ఉన్నాయి. సూర్యాపేట కాలువల తవ్వకం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించినా అవి పూర్తి అయి నీటిని అందించడానికి సిద్దం చేసింది తెలంగాణా ప్రభుత్వమే అన్నది గమనించాలి. అందుకు తెలంగాణా ఇంజనీర్లు అహో రాత్రులు శ్రమించి కాలువల పనులు పూర్తి చేయించినారు.

నిండుగా పారుతున్న కాలువ

ఇక నేడు ఈ కాలువల్లో ప్రవహిస్తున్న నీరు ఏ ప్రాజేక్టువి అన్న ప్రశ్న అర్థం లేనిది. ఈ సంవత్సరం వచ్చినట్టు శ్రీరాంసాగర్‌ కు వరద వస్తే అవి శ్రీరాంసాగర్‌ నీళ్ళుగా పరిగణించాలి. శ్రీరాంసాగర్‌ కు వరద రాని రోజుల్లో వచ్చే నీరు కాళేశ్వరం నీరు అవుతుంది. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంపు హౌజ్‌, గాయత్రి పంపు హౌజ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద రాక ముందే 13 టి.ఎం.సి లు ఎత్తిపోయడం జరిగింది. అందులో నుంచి 10 టి.ఎంసి లు లోయర్‌ మానేరుకు పంపడం జరిగింది. ఆ నీరే ఇప్పుడు సూర్యాపేట కాలువలకు వస్తున్నవి. శ్రీరాంసాగర్‌ కు వరద మొదలయినాక కాకతీయ కాలువ ద్వారా కూడా లోయర్‌ మానేరుకు నీరు చేరుతున్నది. లోయర్‌ మానేరు జలాల మీద ఇవి శ్రీరాంసాగర్‌ నీరు, ఇవి కాళేశ్వరం నీరు అని రాసి ఉండదు. గోదావరి బేసిన్‌ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ఒకదానితో మరొకటి అనుసంధానం జరిగి నందున అవి ఏ ప్రాజెక్టు నుంచి వచ్చినా అవి గోదావరి జలాలుగానే పరిగణించాలి.

కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూర్‌ జలాశయాలను విడివిడిగా ప్రాజెక్టులుగా కాకుండా Integrated Godavari Basin Development Planలో భాగంగా చూడాలి. శ్రీరాంసాగర్‌ కు వరద రాని కాలంలో గోదావరి నీటిని ఎత్తిపోయడానికి పునరుజ్జీవన పథకం సిద్దం అయ్యింది. ఒకటి రెండు సంవత్సరాల్లో సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంతో అనుసంధానం అవుతాయి. ఈ సంవత్సరం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద వచ్చినందుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసే అవసరం రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల ప్రక్రియ ఎట్లా ఉంటుందో తెలిస్తే ఇవి ఏ ప్రాజెక్టు నీరు అన్న ప్రశ్న అర్థం లేనిదని తెలిసిపోతుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల ప్రక్రియ

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఎట్లా ఉంటుంది? మూడు మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశాలు కాళేశ్వరం సిస్టంలో ఉన్నది. మొదటిది శ్రీరాంసాగర్‌ కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్‌ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళతాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డకు వెళతాయి. ఆ తర్వాత తుపాకుల గూడెం ద్వారా పోలవరానికి వెళతాయి. శ్రీరాంసాగర్‌ కు కనీసం మూడేండ్లకు ఒకసారి అయినా వరద వచ్చే అవకాశం ఉన్నదని గత 25 ఏండ్ల వరద చరిత్ర చూస్తే తెలుస్తున్నది. శ్రీరాంసాగర్‌ కు వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్‌ 1 పంపులు (మేడి గడ్డ నుంచి ఎల్లంపల్లికి), లింక్‌ 2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు) తిప్పే అవసరం రాదు.

ఇక రెండో స్థితి శ్రీరాంసాగర్‌ కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్‌ ఎల్లంపల్లికి మధ్యన ఉన్న పరివాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిని ఈ సంవత్సరం మనం చూసాము. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్‌ 1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్‌ 2 పంపులు తిప్పి నీటిని మిడ్‌ మానేరుకు చేరవేయడం, అక్కడి నుంచి ఎగువకు అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరుకు, అక్కడి నుండి కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది.

మూడోది పై రెండు చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్‌ 1, లింక్‌ 2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది.

ఈ సంవత్సరం జూన్‌, జూలై నెలల్లో రాష్ట్రమంతా కరువు పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. గోదావరి నది విజయవంతంగా 115 కి.మీ ఎదురెక్కి వచ్చింది. మేడిగడ్డ జలాశయం నుండి లక్ష్మి పంప్‌ హౌజ్‌ ద్వారా 12 టి.ఎం.సిలు అన్నారం జలాశయానికి, అన్నారం జలాశయం నుంచి సరస్వతి పంప్‌ హౌజ్‌ ద్వారా 5 టి.ఎం.సిలు సుందిళ్ళ జలాశయానికి, పార్వతి పంప్‌ హౌజ్‌ ద్వారా సుందిళ్ళ జలాశయం నుంచి ఎల్లంపల్లి జలాశయానికి 0.25 టి.ఎం.సి ల నీటి ఎత్తిపోయడం జరిగింది. ఈ లోపున ఎగువన కడెం, ఎల్లంపల్లి పరివాహక ప్రాంతం నుంచి వరద రావడం ప్రారంభమయ్యింది. వెంటనే ప్రభుత్వం లింక్‌ 1 పంపులను ఆపి వేసింది. ఎల్లంపల్లిలో ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ వరకు నీరు చేరగానే లింక్‌ 2 పంపుల ద్వారా మిడ్‌ మానేరుకు ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. లింక్‌ 2 పంపుల ద్వారా ఎల్లంపల్లి నుండి మిడ్‌ మానేరుకు 12 టి.ఎం.సి లు, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకంలో బిగించిన పంపుల వెట్‌ రన్‌ కోసం 2 టి.ఎం.సి లు వరద కాలువకు ఎత్తిపోయడం జరిగింది. మిడ్‌ మానేరులో 15 టి.ఎం.సి ల నీరు నిండిన తర్వాత డ్యాం క్రెస్ట్‌ గేట్లను తెరచి లోయర్‌ మానేరుకు 10 టి.ఎం.సి నీటిని తరలించడం జరిగింది. ఈ నీరంతా ఎల్లంపల్లి నుంచి తీసుకున్నప్పటికీ ఆ నీరు కాళేశ్వరం నీరే తప్ప వేరు కాదు.

ప్రాజెక్టు రూపకల్పనా సమయంలో ముఖ్యమంత్రి ఏ కలగన్నారో అది ఇవ్వాళ్ళ సాక్షాత్కారం అయ్యింది. జూలై నెలలో వానలు లేక కరువు తాండవిస్తున్నది. అయినా గోదావరి నది 150 కి.మీ పొడవున సజీవం అయ్యింది. గోదావరి నీరు దిగువన మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ళ, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు జల నీరాజనం పట్టినారు. జల భోజనాలు, జల జాతరలు నిర్వహించుకున్నారు. కరువు కాలంలో గోదావరి ఇట్లా ఎదురెక్కి రావడం వారికి ఒక కొత్త అనుభవం. ఇక గోదావరి ఎండిపోయే పరిస్థితి రాదు. అక్టోబర్‌ నుంచి వానలు కురువయి. అయితే దిగువ గోదావరిలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉంటాయి. కనుక వర్షాలు లేని కాలంలో నీటిని మేడిగడ్డ జలాశయం నుంచి ఎత్తిపోయడం తప్పదు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌ 1కి ఉన్న ప్రాధాన్యత. ఈ ప్రాధాన్యత గోదావరి ఎదురెక్కి వస్తున్న సందర్భంలోనే ప్రజలకు అర్థం అయ్యింది. ప్రాజెక్టు విమర్శకులు మాత్రం వెనుకబడిపోయారు. అది ఈనాటి విషాదం. ఇప్పుడు సూర్యాపేట కాలువల్లో పారుతున్న నీరు ఏ ప్రాజెక్టువి అన్న వృధా చర్చను ప్రభుత్వ వ్యతిరేకులు కొనసాగిస్తున్నారు. వ్యాసం మొదట్లో పేర్కొన్నట్టు ఇవి గోదావరి జలాలన్న వాస్తవం ప్రజలకు తెలుసు. అది తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందుకే సాధ్యం అయ్యిందని కూడా వారికి తెలుసు.

Other Updates