డా|| కంకట రాజారామ్
ఒక జాతి ప్రగతి ఆదేశ విద్యా అభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన తర్వాత మన రాష్ట్ర అభివృద్ధికి నాణ్యమైన విద్య చక్కని సాధనం అని ప్రభుత్వం గుర్తించింది. విద్యను ప్రాథమిక స్థాయి నుండి అత్యున్నత విశ్వవిద్యాలయ స్థాయి వరకు బలోపేతం చేయాలనిసంకల్పించి సమగ్ర చర్యలు చేపట్టింది. విశ్వవిద్యాలయాలు ఉద్యోగార్థులను తయారు చేసే కేంద్రాలుగానే మిగలకుండా ఉద్యోగాలను, సంపదను సృష్టించే ఔత్సాహికులుగా తయారు చేసే సృజనాత్మక కేంద్రాలుగా ఎదగాలని ఖచ్చితమైన ప్రయత్నాలు మొదలైనాయి.
పెరిగిన అభివృద్ధి గ్రాంట్లు
విశ్వవిద్యాలయాలు అరకొర నిధులతో కొట్టుమిట్టాడిన సమైక్య పాలన నుండి, ఆర్థిక పరిపుష్ఠితో ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటికి డెవలప్‌మెంట్ గ్రాంట్‌లు పెంచింది. గత బడ్జెట్‌లో దాదాపు 421 కోట్ల రూపాయల అభివృద్ధి గ్రాంట్ కేటాయించింది. సెంటినరి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీకి రెండు వందల కోట్ల ప్రత్యేక గ్రాంట్ కేటాయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాల ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించింది. సాలరీ గ్రాంట్ కాకుండా ప్రత్యేక అభివృద్ధి గ్రాంట్‌తో యూనివర్సిటీల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, పరిశోధనాశాలల ఏర్పాటు, కళాశాలల నిర్మాణం కోసం కృషి చేసింది.
వి.సి.ల నియామకం
ఎంతో కాలంగా వైస్ ఛాన్సలర్‌లు లేకుండా యూనివర్సిటీలలో పాలన గాడి తప్పుతున్న తరుణంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్‌ఛాన్సలర్‌లను నియమించింది. ఎలాంటి ఒత్తిళ్లకు, పైరవీలకు తావులేకుండా సమర్ధులైన వారిని వి.సి.లుగా నియమించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆచార్య పసుల సాంబయ్య, ఆచార్య సీతారామారావు, ఆచార్య రామచంద్రం వంటి వారిని వి.సి.లుగా నియమించి ఉన్నత విద్యలో తెలంగాణ ఆత్మ ఆవిష్కారానికి కృషి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ఆచార్య తుమ్మల పాపిరెడ్డిని, వైస్ ఛైర్మన్లుగా ఆచార్య రిక్క లింబాద్రి, ఆచార్య వెంకటరమణలను నియమించి ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉన్నత విద్యా మండలి వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ ఫలితాలను తక్కువ కాలంలో వెల్లడించడంలో సఫలీకృతమైంది.పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదా యాలు, పండుగలు, అవసరాలు, అవకాశాలు ప్రతిబింభిం చేలా సిలబస్ రూపకల్పన జరిగింది. విషయనిపుణులచే కొత్త తెలంగాణలో సరికొత్త పాఠ్యపుస్తకాల రూపకల్పన జరిగింది. దీనికనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలలో తెలంగాణ చరిత్ర, జాగ్రఫి, సామాజిక – ఆర్థిక, రాజకీయ అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది.
విశ్వవిద్యాలయాల పేర్లలో తెలంగాణ ముద్ర
తెలంగాణ స్వరాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ సార్ పేరును, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రజాకవి కాళోజి నారాయణరావు పేరును, వెటర్నరి యూనివర్సిటీకి తెలంగాణ ముద్దు బిడ్డ పి.వి.నరసింహారావు పేరును అలాగే ఉద్యాన వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టుకోగలిగాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సిద్దిపేటలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడమైంది. హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యా లయంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు మొదలైనాయి. బిబినగర్‌లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ కృషితో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
విదేశీ విద్యానిధి పథకం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య చదువుకోవడానికి ఓవర్సీస్ విద్యానిధి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ పథకం కింద 20లక్షల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి సంవత్సరం 1500 పైగా విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత సంవత్సరం దాదాపు 294 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల నాణ్యమైన ఉన్నత చదువు కోసం గురుకుల డిగ్రీ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 298 ఉన్న జనరల్ రెసిడెన్షియల్ పాఠశాలలను వచ్చే మూడేళ్లలో 1200కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మన గురుకుల విద్యా విధానం కేజీ టూ పీజీ ప్రణాళికలు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉన్న సంగతి తెలిసిందే.
దోస్త్ ప్రయోగం
ఉన్నత విద్యలో కీలకమైన డిగ్రీ ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను సులభతరం చేసింది. విద్యార్థులకు ఒక్క అప్లికేషన్‌తో రాష్ట్రంలోని ఏ కాలేజీలోనైనా సీటుకు దరఖాస్తు చేసుకునే విప్లవాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పారదర్శకత, సులభతరం, అక్రమాలకు అడ్డుకట్టలా దోస్త్ విజయవంతమై ఏటా కనీసం 2లక్షల డిగ్రీ అడ్మిషన్లు సక్రమంగా జరుగు తున్నాయి. ప్రైవేటు దోపిడికి అడ్డుకట్ట పడింది. ఉన్నత విద్య చదివే వారి స్కాలర్‌షిప్‌లను కూడా పెంచింది.
యూనివర్సిటీలను నేషనల్ అసిస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ (నాక్) గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహిం చడంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు నాక్ గుర్తింపును తెచ్చు కున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రత్యేక తనిఖీ బృందాలతో కఠినమైన తనిఖీలు చేయడంతో నిబంధనల అమలుకు, ప్రమాణాల పెంపుకు అవకాశం ఏర్పడింది.
అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా
దేశంలో మొత్తం 22 రాష్ట్రాలలో ప్రైవేటు యూని వర్సిటీలు ఉండటం, మన రాష్ట్ర విద్యార్థులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవడం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచస్థాయిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావాలని సంకల్పించి ప్రైవేటు విశ్వ విద్యాలయాల బిల్లుకు అనుమతిచ్చింది. పోటీతత్వం పెర గడం, అవకాశాలు అన్నలక్ష్యంతో ఉన్నత విద్యను అభివృద్ధి చేయడం తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కృషి సల్పుతున్నది. పారిశ్రామిక అవసరాలకు, ఉద్యోగాల కల్ప నకు అనువైన విద్య, అంతర్జాతీయస్థాయి వసతులు, ప్రమాణాలు ఉండాలన్నదే లక్ష్యం.