గటిక విజయ్‌కుమార్
జనవరి 1 నుంచి రైతులకు
24 గంటల ఉచిత విద్యుత్
దేశంలో మరే రాష్ట్రం సాధించని ఘనత
11వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్
రూ.12 వేల కోట్లతో పంపిణీ,
సరఫరా వ్యవస్థలు సిద్ధం
ఆటో స్టార్టర్ల తొలగింపుకోసం
అవగాహన కార్యక్రమాలు
‘తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య విద్యుత్ సంక్షోభం’ రాష్ట్ర విభజన సందర్భంగా సర్వత్రా వినిపించిన మాట ఇది. చాలినంత కరెంటు సరఫరా లేక తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్లలో మగ్గుతుందనే భయాందోళనలు కూడా వ్యక్తమ య్యాయి. కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దార్శనికత వల్ల, విద్యుత్ సంస్థల చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాల వల్ల కేవలం మూడున్నరేళ్లలోనే అద్భుతం జరిగింది. వ్యవసాయ, పారిశ్రామిక, గహ, వాణిజ్య కేటగిరీల వినియోగదారులందరికీ 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రంగం సిద్ధమయింది. నూతన సంవత్సర కానుకగా 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ నిరంతరాయ విద్యుత్ అందబోతున్నది. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తూ, ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నది.
కరెంటు కష్టాల నుంచి రైతులకు శాశ్వత విముక్తి
సమైక్య రాష్ట్రంలో రైతులు కరెంటు లేక పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రాజెక్టులు లేకపోవడం వల్ల, చెరువులు శిథిలం కావడం వల్ల తెలంగాణలో రైతులు బోర్లమీద ఆధారపడాల్సి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. అయితే భూగర్భంలో జలాలున్నా, కరెంటు లేక పోవడం వల్ల బోర్లు పనిచేయకపోయేవి. చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని రైతాంగం ఎదుర్కొన్నది. సమైక్య రాష్ట్రంలో రోజుకు రెండు మూడు గంటల పాటు కరెంటు కూడా రైతులకు అందేది కాదు. కరెంటు కోసం రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ప్రభుత్వం కరెటు సరఫరాను మెరుగుపరిచే విషయంపై దష్టి పెట్టింది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం పంపుసెట్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నా రు కాబట్టి, వారికి ఖచ్చితంగా నాణ్యమైన కరెంటు అవసరమున్నంత మేరకు అందిం చాలని నిర్ణయం తీసుకున్నది. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి అందేలోపు ఎక్కడ దొరికితే అక్కడ విద్యుత్ సమకూర్చు కుని రైతులకు అందించాలని విద్యుత్ సంస్థలను ఆదేశించింది. దానికి అనుగుణంగానే విద్యుత్ సంస్థలు పని చేసి, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే రైతులకు రోజుకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తు న్నారు. రైతులు కొంత కుదురుకున్న తర్వాత, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి కాస్త మెరుగైన తర్వాత మరో మెట్టు ఎక్కాలని సిఎం భావించారు.
రైతులకు విడతల వారీగా కాకుండా 24 గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నించారు. అందుకనుగుణంగానే విద్యుత్ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. 2016 జూలై నుంచి పాత మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అందించారు. ఆ తర్వాత 2016 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 23 లక్షల పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించిన రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ ఘనత సాధించబోతున్నది. 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పంపుసెట్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా అందించిన తర్వాత విద్యుత్ సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. ఒకానొక దశలో రోజుకు 9,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయంతో పాటు ఇతర వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి విద్యుత్ డిమాండ్ అంచనాలు రూపొందించాయి. 11వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అంచనావేసి అందుకు తగ్గట్లు సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
సబ్ స్టేషన్లు :
తెలంగాణ వచ్చే నాటికి : 2,397
కొత్త సబ్ స్టేషన్లు : 514
మొత్తం సబ్ స్టేషన్లు : 2,942
పవర్ ట్రాన్స్ ఫార్మర్లు
తెలంగాణ వచ్చే నాటికి: 3,748
కొత్త పవర్ ట్రాన్స్ ఫార్మర్లు: 1,724
మొత్తం పవర్ ట్రాన్స్ ఫార్మర్లు: 5,472
విద్యుత్ లైన్లు :
తెలంగాణ వచ్చే నాటికి: 1,56,807 కి.మీ.
కొత్తగా వేసినవి: 19,154 కి.మీ.
మొత్తం లైన్లు: 1,75,961 కి.మీ
రూ.12 వేల కోట్లతో నిరంతరరాయ
విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు
రూ.12,610 కోట్ల వ్యయంతో 24 గంటల నిరంతరాయ విద్యుత్ అందించేందుకు జెన్ కో సిఎండి ప్రభాకర్‌రావు నేతత్వంలో జెన్ కో, ట్రాన్స్ కో, ఎన్.పి.డి.సి.ఎల్., ఎస్.పి.డి.సి.ఎల్. సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. అటు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు, అదే సందర్భంలో గహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం కూడ 24 గంటల నాణ్యమైన కరెంటు అందివ్వడానికి ఉన్న సాంకేతిక అవకాశాలను, ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రిడ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ అదనపు ఏర్పాట్లు చేశారు.
2014 జూన్ 2కు ముందు రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇప్పటికే సూర్యాపేట, నర్సాపూర్, అసుపాక, డిండి, మహేశ్వరంలో 3,980 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసింది. జూలూరుపాడు, నిర్మల్, కేతిరెడ్డిపల్లి, జనగామల్లో 3705 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతున్నది.
సూర్యాపేటలో నిర్మించిన సబ్‌స్టేషన్‌కు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. మొత్తం పదిహేను 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం ద్వారా తెలంగాణలో భవిష్యత్ అవసరాలను కూడ దష్టిలో పెట్టుకుని పంపిణీ వ్యవస్థను విద్యుత్ సంస్థలు సిద్దం చేశాయి. 400 కెవి సబ్ స్టేషన్లతో పాటు 19 కొత్త 220 కెవి సబ్ స్టేషన్లు నిర్మించింది. 35 కొత్త 132 కెవి సబ్ స్టేషన్లు కూడా నిర్మించింది. దీంతో తెలంగాణ రాకముందు 233 ఇ.హెచ్.టి. లైన్ల సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్లు తెలంగాణలో ఉంటే, ఇప్పుడు 292 సబ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 33/11 కెవి సబ్ స్టేషన్లు కూడా వందల సంఖ్యలో నిర్మించారు. సబ్ స్టేషన్లతో పాటు 2695.25 కిలోమీటర్ల మేర 400 కెవి లైన్లు, 6,900 కిలోమీటర్ల 220 కెవి లైన్లు, 10,321 కిలోమీటర్ల మేర 132 కెవి లైన్లు కొత్తగా వేశారు. తెలంగాణ రాకముందు 16,379 కిలోమీటర్ల లైను ఉంటే, ఇప్పుడు 19,916 కిలోమీటర్ల లైన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా 33/11 కెవి లైన్లు కూడా దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా కొత్తగా వేశారు. తెలంగాణ వచ్చే నాటికి 3,748 పవర్ ట్రాన్స్ ఫార్మర్లుంటే, కొత్తగా 1,724 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి, వాటి సంఖ్యను 5,472కు పెంచారు. లో ఓల్టేజి సమస్యను అధిగమించడానికి వేల సంఖ్యలో కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
28వేల మెగావాట్ల కోసం ప్రణాళిక
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 6,574 మెగావాట్లు. చాలినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ప్రకటించారు. గ్రామాల్లో 6 నుంచి 8 గంటలు, పట్టణాల్లో 4 నుంచి 6గంటలు, హైద రాబాద్ నగరంలో 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. తెలంగాణలో కరెంటు కోతలు ఉండవద్దని నిర్ణయించిన ప్రభుత్వం అందుక తగ్గ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఐదు నెలలకే 2014 నవంబర్ 20వ తేదీ నుంచి పరిశ్రమలకు, గహాలకు, వాణిజ్య సంస్థలకు 24 గంటల విద్యుత్ అందుతున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు, మిషన్ భగీరథకు, కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన కరెంటు సరఫరా ఇవ్వడం కోసం పక్కా ప్రణాళికతో విద్యుత్ సంస్థలు ముందుకుపోతున్నాయి.
గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు చేసిన ఏర్పాట్ల ఫలితంగా అదనంగా 8,271 మెగావాట్లు విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం సమకూర్చుకున్నది. దీంతో ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందు బాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13 వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. దీంతో 2022 నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కార్యాచరణ అమలవుతున్నది.
ఆటో స్టార్టర్లు తొలగిస్తేనే ఫలితాలు
రైతులకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసిన ఫలితం పూర్తిగా దక్కాలంటే ఆటో స్టార్టర్లు వందకు వందశాతం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతులంతా ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారు. ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు అవి ఆటోమెటిక్ గా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 24 గంటల సరఫరా ఇవ్వడం వల్ల ఆటోస్టార్టర్ల వల్ల 24 గంటల పాటు బోర్లు పోస్తాయి. మొదట్లో పుష్కలంగా నీళ్లు పోసే బోర్లు పంట పొట్టకొచ్చే నాటికి భూగర్భజలాలు అడుగంటి పోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి వస్తుంది. కరెంటు అందుబాటులో ఉన్నా, భూగర్భంలో నీరు లేక రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగించుకోకపోతే, చివరికి 24 గంటల కరెంటు సరఫరా ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆటో స్టార్టర్లను తొలగించడానికి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. సిద్ధిపేట జిల్లాలో ప్రారంభమయిన అవగాహన కార్యక్రమాల్లో నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు జెన్ కో-ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
ఆటోస్టార్టర్లను తొలగించుకోవడంతో పాటు అవసరం మేరకు మోటార్లతో నీరు తోడుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ”చెరువులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుని వ్యవసాయం చేసుకునే అలవాటు, పద్ధతి మన రైతులకుంది. ఇప్పుడు భూగర్భ జలాలను కూడా అవసరం ఉన్న మేరకే పొదుపుగా వాడుకుంటారనే నమ్మకం నాకుంది. రైతులు ఎప్పుడూ తమను తాము నష్టపరుచుకోరు. గతంలో కరెంటుపై నమ్మకం లేక ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆటోస్టార్టర్ల అవసరం లేదు. పైగా పంటలకు అవసరానికి మించి నీరు పెడితే నష్టమే జరుగుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన ఉంది. ఆటో స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుకుపోయి, చివరి దశలో తమకే నష్టం కలుగుతుందనే వాస్తవం అర్థమైతే రైతులు తప్పకుండా సహకరిస్తారు. విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు మండలస్థాయి అధికార యంత్రాంగం సహకారంతో ఆటో స్టార్టర్ల తొలగింపుకు రైతుల్లో అవగాహన తీసుకురావాలి. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో పర్యటించి, రైతులతో సమావేశం జరిపి వారికి వాస్తవ పరిస్థితులు వివరించాలి. కరెంటు ఉన్నా నీరు లేకుంటే వ్యవసాయం సాగదనే విషయం రైతులకు అర్థమయితే స్వచ్చందంగా సహకరిస్తారు. రైతులను ఒప్పించి, మెప్పించి ఆటోస్టార్టర్లు వందకు వందశాతం తొలగించాలి. వ్యవసాయానికి 24 గంటల సరఫరా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడా నికి సమష్టిగా పాటుపడాలి” అని సిఎం ఉద్భోదించారు.
నిరంతరాయ విద్యుత్‌తో ప్రభుత్వ
ప్రతిష్ట పెరిగింది: సిఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగిందన్నారు.
- ”దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడ ఈ కష్టాలు కొనసాగడం అర్థరహితమని భావించాం. అందుకే విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడాన్ని గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. రైతులకు మేలు చేయడం కన్నా మించిన సంతప్తి మరొకటి ఉండదు. రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పనిచేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు మనం అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించు కుంటున్నాం. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు తరలివస్తాయి. పారిశ్రామికాభివద్ధి జరుగు తుంది. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. విద్యుత్‌తోనే అభివద్ధి, మెరుగైన జీవితం ఆధారపడి ఉంది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరెంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది” అని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణలో విద్యుత్ సరఫరా మైలురాళ్లు - 2014 నవంబర్ 20 నుంచి కరెంటు కోతల ఎత్తివేత. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా. పరిశ్రమలు,
గృహాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా - 2017 జూలై నుంచి పాత మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా
- 2017 నవంబర్ 6నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా
- 2018 జవవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా
- 2018 జవవరి 1 నుంచి అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం
ఉత్పత్తి, సరఫరాకు అనుగుణంగా
పంపిణీ వ్యవస్థ: ప్రభాకర్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు వేశామని, దానికి అనుగుణంగా సరఫరా చేయనున్నామని సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయాలంటే పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని భావించి కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లు వేసినట్లు వివరించారు. ఇప్పుడు దాదాపు 9,500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడుతున్నదని, రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందివ్వడంతో పాటు, ఎత్తిపోతల పథకానికి, మిషన్ భగీరథకు, పెరిగే పరిశ్రమలకు కరెంటు సరఫరా చేస్తే మరో 50 శాతం అదనంగా విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుందని అంచనా వేసినట్లు వివరించారు.
ఉత్పత్తి కూడ గణనీయంగా పెరుగుతున్నందున పంపిణీ వ్యవస్థను విస్తరించినట్లు వెల్లడించారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నట్లు వివరించారు. రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేయడం గర్వకారణంగా భావిస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరగాలని, విద్యుత్ సంస్థల నిర్వహణ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే జరగాలని ముఖ్యమంత్రి మొదటి నుంచీ గట్టిగా భావించారు. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు వస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. విద్యుత్ శాఖ పనితీరు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచడానికి ఉపయోగపడుతున్నందుకు మా సంస్థ ఉద్యోగులంతా ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు.