‘‘ఇప్పటివరకూ జరిగిందంతా పీడకలగా మర్చిపో. జీవితంలో కష్టాలువస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి. నిలదొక్కుకోవాలి. ఎప్పుడూ చిరునవ్వుతో జీవించాలి. నీ జీవితం ఇంకా చాలా ఉంది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. భవిష్యత్తులో ఎవరికైనా నీలాంటి ఆపదవస్తే ఆదుకునే పరిస్థితుల్లో నువ్వుండాలి. నీకు అండగా నేనుంటా’’
కన్నతండ్రి, సవతి తల్లి చెరనుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను ఓదారుస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పిన మాటలివి.
ప్రత్యూష కష్టాలను గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆమె చికిత్స పొందుతున్న అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత కూడా ఉన్నారు. వీరంతా ప్రత్యూషతో మాట్లాడి, ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘‘ నిన్ను ఎంతవరకైనా చదివిస్తాను. నీ ఆరోగ్యం బాగుపడేంత వరకూ వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి చేస్తా. ఇల్లు కట్టించి ఇస్తా. నీకెవరూ లేరని భయం వద్దు. నీకు నయమయ్యాక మా ఇంటికి రా. మా అమ్మాయి కవిత నీకు తోడుంటది. ’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆమెకు ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు కవితను చూపిస్తూ, ఆమెలాగే నిన్నుకూడా కుమార్తెలా చూసుకుంటానని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆమెకు అభయమిచ్చారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శకు ప్రత్యూష చలించిపోయింది. సి.ఎం. హామీ, ఇలా పరామర్శించడం, ఆయన చెప్పిన మాటలు ఆమెలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయి.
ముఖ్యమంత్రి పరామర్శ చాలా ఏళ్ళ తరువాత ప్రత్యూష మోములో ఆనందాన్ని నింపింది. ఆమె మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.