Untitled-21హైదరాబాద్‌ నగరంలో ‘మహా ప్రస్థానం’ పేరిట ఆధునీకీకరించిన శ్మశాన వాటికను, మోండా మార్కెట్‌ను ఏప్రిల్‌ 18న కలెక్టర్ల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సూచన మేరకు కలెక్టర్ల బృందం ఈ రెండు ప్రదేశాలను సందర్శించి అక్కడి సౌకర్యాలను అధికారులనుంచి తెలుసుకున్నారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45 నుంచి పాత ముంబయ్‌ జాతీయ రహదారికి వెళ్ళే మార్గంలో జి.హెచ్‌.ఎం.సి., ఫినిక్స్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహా ప్రస్థానం’ శ్మశాన వాటికను నిర్మించారు. ఈ ఆధునిక శ్మశాన వాటికలోగల సదుపాయాలు, విశిష్టతలను జి.హెచ్‌.ఎం.సి. ప్రత్యేక అధికారి కమీషనర్‌ సోమేష్‌కుమార్‌ కలెక్టర్ల బృందానికి వివరించారు. ఇక్కడ దివ్యస్థల్‌, మోక్షస్థల్‌, ముక్తిస్థల్‌, అంతిమస్థల్‌ పేరిట నాలుగు దహన వాటికలు ఉన్నాయి. ఇందులో మొదటిది ‘దివ్యస్థల్‌’ విద్యుత్‌ దహన వాటిక కాగా, మిగిలినవన్నీ కట్టెలతో దహనం చేసేవి.
మూడెకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ శ్మశాన వాటికను నిర్మించినట్టు కమీషనర్‌ తెలిపారు. అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేశారు. వైఫై సౌకర్యం కూడా కల్పించడంవల్ల అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన ఆప్తులు లైవ్‌లో చూసే అవకాశం కల్పించినట్టు తెలిపారు.

కలెక్టర్ల బృందం ‘మహా ప్రస్థానం’లో గంటకుపైగా కలియతిరిగి, అక్కడి వసతులపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందంలో కలెక్టర్లతోపాటు మేయర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు కూడా ఉన్నారు. తమతమ నగరాలు, పట్టణాలలో ఇలాంటి సదుపాయాలు కల్పించాలన్న సంకల్పాన్ని వీరు వ్యక్తం చేశారు. అలాగే మోండా మార్కెట్‌ నిర్మించి ఇప్పటికి 143 ఏండ్లు దాటింది. ఈ మార్కెట్‌ను అత్యంత శాస్త్రీయంగా నిర్మించారని, ఇప్పటికీ గొప్పగా నిర్వహి స్తున్నారని, ఈ మార్కెట్‌ 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లు కలెక్టర్ల బృందానికి జి.హెచ్‌.ఎం.సి. కమిషనర్‌ వివరించారు.

త్వరలో ఈ మార్కెట్‌ ఆధునీకీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ రెండు ప్రాంతాల సందర్శన గొప్ప అనుభూతిని కలిగించిందని, ముఖ్యమంత్రికి కలెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.

Other Updates