magaఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి అమోదం తెల్పిన ప్రభుత్వం నిజామాబాద్‌ పట్టణానికి ఐటి పరిశ్రమను తీసుకెళ్లనున్నట్లు తెల్పింది.

త్వరలోనే నిజామాబాదులో ఐటి హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ ఐటి హబ్‌ కోసం మెదటి దశలో సుమారు 25 కోట్ల రూపాయాలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఐటి హబ్‌లో, ఇంకుబేషన్‌ సెంటర్‌ కూడా ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో ఇందుకు సంబంధించిన అన్ని మౌలిక వసతులను టియస్‌ఐఐసి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నిజామాబాద్‌ పట్టణానికి ఐటీ పరిశ్రమ అభివృద్ధి కొరకు కావల్సిన అన్ని అనుకూలతలు ఉన్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి సూమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి జాతీయ రహదారి, రైలు రవాణా సౌకర్యాలు

ఉన్నాయన్నారు. దాదాపు దశాబ్దన్నర కిందటే జిల్లాలో ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు ఉండటం, పక్కనే ఉన్న బాసర ట్రిపుల్‌ ఐటీ ద్వారా కూడా వేలాది మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం పట్టాలుపుచ్చుకుంటున్నారు.

ఇక్కడ ఉన్న విద్యా సంస్థల ద్వారా ఐటి పరిశ్రమలకు కావాల్సిన నాణ్యమైన మానవ వనరుల లభ్యత సాధ్యం అవుతుందన్నారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటి పరిశ్రమలను తరలించే క్రమంలో మొదట చిన్న స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. వందలాది మంది తెలుగు ఎన్నారైలు విదేశాల్లో అనేక ఐటి కంపెనీలు పెట్టారని, వీరీలో కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం తరపున, పాలసీ పరమైన రాయితీలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐటి హబ్‌ ఏర్పాటు కోసం స్థానిక ఏంపి, ఎమెల్యేలు గత కొంత కాలంగా ప్రణాళికబద్ధంగా ప్రయత్నం చేశారని, ఒక వైపు ప్రభుత్వం నుంచి ఐటి హబ్‌ ప్రతిపాదన అమోదానికి ప్రయత్నం చేస్తూనే, మరోవైపు స్వయంగా విదేశాల్లోని ఏన్నారైల కంపెనీలతో చర్చలు నిర్వహించారన్నారు. ఐటి హబ్‌ ఏర్పాటు కోసం వారు చూపిన చొరవ, కృషిని మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా బేగంపేట క్యాంపు కార్యాల యంలో నిజామాబాద్‌ జిల్లా ఎంపీ కవిత, నిజామా బాదు పట్టణ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తాలు అదివారం నాడు మంత్రిని కలిసారు. ఐటి హబ్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సుమారు 60కిపైగా లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ లను మంత్రికి అందజేశారు.

నిజామాబాద్‌ పట్టణ కేంద్రంలో ఐటి హబ్‌ ఏర్పాటు ద్వారా చుట్టుపక్కల జిల్లాల యువతకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు, యువకులకు ఐటీ హబ్‌ వారి భవిష్యత్తు పట్ల భరోసాను కల్పిస్తుందని ఆమె తెలిపారు.

మంత్రి కేటీ రామారావు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు అమెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీ, డల్లాస్‌, వాషింగ్టన్‌ డిసీ, చికాగో నగరాల్లో పర్యటించి ఐటి హబ్‌లో పెట్టుబడులు పెట్టాలని తెలుగు ఎన్నారైను కోరామని పట్టణ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా అన్నారు. ఎన్నారైలతో సమావేశమై వారందరికీ తెలంగాణ ఐటీ పరిశ్రమ అభివృద్ధి, పాలసీలు, రాయితీలను వివరించామని తెలిపారు. ప్రస్తుతం ఆసక్తి వ్యక్తపరిచిన 60 మంది ఎన్నారైలో తెలంగాణేతర ఎన్నారైలు

ఉన్నారని, వారంత తెలంగాణ ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి, కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఐటి హబ్‌ ఏర్పాటు దిశగా జరిగిన ప్రయత్నాల్లో నిరంతరం వెన్నంటి ఉన్న స్దానిక యంపి కల్వకుంట్ల కవిత, అన్ని విధాలా మార్గదర్శనం చేసిన మంత్రి కేటీ రామారావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికాలో ఎన్నారైలతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారిని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన మహేశ్‌ గుప్తా బిగాలను కూడా మంత్రి కెటి రామారావు అభినందించారు.

Other Updates