examsక్రికెట్‌ క్రీడాకారుడు బ్రియాన్‌లారా! ఓరోజు ప్రొద్దున్నే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కోసం రాకుంటే, ఆయన కోచ్‌ వాళ్ళింటికి వెళ్ళి.. బ్రియాన్‌.. ఈ రోజు తప్పక మ్యాచ్‌కి రావాలి అని అన్నాడట. అయితే లారా నిద్రలోనే.. ‘సర్‌! నిన్ననే కదా! మ్యాచ్‌లో 175 రన్స్‌ చేశాను. ఈ ఒక్కరోజు ఆడకుంటే ఏమౌతుంది సార్‌!’ అని అన్నాడట. అప్పుడు ఆ కోచే ‘అవునా! సరే! ఇప్పుడు ఆడబోయే ఆటలో 176 రన్స్‌ అని లెక్కపెట్టరు బాబు. ప్రతి ఆట 0 నుండే మొదలౌతుంది తెలుసా! అది గతం..’ అన్నాడట. బ్రియాన్‌లారా! వెంటనే లేచి గబగబా తయారయ్యి మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌లోకి వచ్చి ఆట మొదలెట్టాడు.

ఒకరోజు ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిత్‌ రవిశంకర్‌ దగ్గరికి ఓ మిత్రుడు వచ్చాడు. ఆ సమయంలో పండిత్‌జీ సితార్‌ సాధన చేస్తున్నాడు. కాసేపటి తర్వాత సాధన ఆపి, పండిత్‌ వచ్చిన మిత్రుణ్ణి కలిశాడు. అప్పుడు ఆ మిత్రుడు ‘పండిత్‌.. ఇన్నిసార్లు, రకరకాల సమయాల్లో మీ దగ్గరికి వచ్చాను. ఎప్పుడూ సాధన చేస్తూనే ఉ ంటారు. మీరు ప్రపంచంలోనే సితార్‌లో నెం. 1 కదా! ఇంకా సాధన దేనికోసం అన్నాడట. అప్పుడు పండిత్‌.. ‘మిత్రమా నేను రోజూ సాధన చెయ్యటం వలననే ఈ స్థితిలో వున్నాను. నేను వారం రోజులు సాధన చెయ్యకుంటె.. నా శిష్యులు నేను సరిగ్గా వాయించడం లేదని గుర్తిస్తారు. నెలరోజులు సాధన చేయకుంటే.. నా అభిమానులు గుర్తిస్తారు.. ఒకరోజు సాధన చేయకుంటె నా భార్య గుర్తిస్తుంది. ఒక గంట సాధన చేయకుంటె.. నేను సరిగ్గా వాయించట్లేదని నాకు తెలుస్తుంది.. కాబట్టి నా లోపాలు నాకు తెలిసిన తర్వాత నేను దానిపై శ్రద్ధ పెడతాను. అందుకే నేను ఈ సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటె నిరంతర సాధన వలననే సాధ్యమవుతుంది’ అన్నాడు.

పై సంఘటనలను పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్థం అయ్యిందేమిటంటె, ఉత్తమ స్థానాలను కైవసం చేసుకోవాలంటె, నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. అప్పుడే మనకున్న నైపుణ్యాలు శక్తివంతంగామారి మనల్ని ఉన్నత లక్ష్యాలను సాధించేటట్టు చేస్తుందని నిరూపితమయ్యింది. కాబట్టి ఇప్పటివరకు ఎన్నోరోజులనుండి గ్రూప్స్‌ లేదా ఇతర పోటీ పరీక్షలకోసం చదువుతున్న అభ్యర్థులు ఒక పరీక్ష అయిపోగానే కొంత అలసిపోయినట్టు అన్పించడం, కష్టపడ్డాం, ఆందోళన పడ్డాం.. పరీక్షలు అయి పోయాయి ఇహ అంతా విశ్రాంతి మాత్రమే మిగిలింది.. అనే భావనలోకి వస్తారు. మళ్ళీ ఇంకా ఏవైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పడితే అప్పుడు చదువు, మొదలు పెడతారు. అప్పటివరకు ఇన్ని రోజులు పోగొట్టుకున్న ‘ఎంజాయ్‌మెంట్‌’ను ఇప్పుడు ఎంజాయ్‌ చెయ్యాలి అని అనుకునే వాళ్ళే చాలామంది. అయితే ఈ పోటీ పరీక్షలకు రకరకాల స్థాయిల్లో వున్న వాళ్ళు ప్రిపేర్‌ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాబోయే పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావాలి. వ్రాసిన పరీక్ష ఫలితాన్ని ఎలా తీసుకోవాలో చర్చిద్దాం.

1. మొదటిసారి పోటీ పరీక్షలు రాసేవారు

2. పోటీ పరీక్షల కోసమే కొన్ని రోజులుగా చదివేవారు

3. ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షలు రాసేవారు

4. పెళ్ళిళ్లు, పిల్లలు, కుటుంబాన్ని చూసుకుంటూ పరీక్షలు రాసేవారు.

మొదటిసారి పోటీ పరీక్షలు రాసేవారు
చదువును పరీక్షలకోసం కొనసాగించాలి. వారం రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదటినుండి చదువును కొనసాగించాలి. విసుగు, మళ్ళీ చదవాలా! అనే భావన వస్తే మీరు పోటీ పరీక్షలకు ఇంకా సంసిద్ధంగాలేరని అర్థం. చదువుకు మోటివేషన్‌స్థాయి ఎక్కువగా వుండకపోవడం, నువ్వు నిర్ణయించుకున్న ఈ లక్ష్యం నీది కాకపోవడం కారణం కావచ్చు. లేదా! చదువుతున్న సబ్జెక్ట్స్‌పై పట్టులేకపోవడం కారణం కావచ్చు. కారణాలను విశ్లేషించుకోండి. గతంలో వ్రాసిన పరీక్షా ఫలితాలు ఎలా వున్నా, రాయబోయే పరీక్ష ఉన్నతమైన పరీక్ష కాబట్టి, ఫలితం పోటీలోవున్న వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్టు.. కానీ నిజంగానే మీరు ఉన్నతమైన ఫలితాన్ని రాబట్టుకున్నారా! మీనుండి మంచి ఫలితం రావడానికి ఇంకా ఏ అంశాలపై పట్టు సాధించాలో నిపుణులతో చర్చించి, వాటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఉన్నతమైన పరీక్షల్లో ఉత్తీర్ణతకు మార్గం సుగమం అవుతుంది.

పోటీ పరీక్షల కోసమే కొన్ని నెలలు/ సంవత్సరాలు చదువుతూ పరీక్షలు రాసేవారు:

చాలా రోజులనుండి వ్రాస్తున్నవారు, సివిల్‌ సర్వీసెస్‌/ఐఈఎస్‌ ఇలాంటి పరీక్షలు వ్రాస్తూ, మధ్యమధ్యలో స్టేట్‌ సర్వీసెస్‌ పరీక్షలు వ్రాసేవారు కూడా వారం విరామం తీసుకొని పరిస్థితిని అంచనా వేసుకోవడం మంచిది. ఇలా విరామం తీసుకోవడంవల్ల చాలా వెనుకబడిపోతామేమో! అని ఆందోళనపడే అభ్యర్థులు గమనించాల్సినదేమిటంటే – ఈ విరామం మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక మెంటార్‌ను ఆమోదించాలి. అది మీ జీవితంలో మంచి మార్పుకు సంకేతం. చదువు మొదలు పెట్టగానే అరే! ఇవి చదివాను, ..అ! ఈ చాప్టర్‌ వచ్చు.. ఈ అంశంలో పెద్దగా చదవాల్సింది ఏమీలేదు.. అనే భావనలు మిమ్మల్ని.. మీ చదువును దూరం చేయకుండా, ప్రతి దానిని కూలంషంగా చదవడం అరంభించాలి.,

గతంలో రాసిన పరీక్షా ఫలితాలు:

వీటి ఫలితాలు మిమ్మల్ని తీవ్ర నిరాశలోకి నెట్టివేస్తాయి. ప్రస్తుత చదువును కొనసాగనీయకుండా అడ్డుపడుతుం టాయి. ఎంత చదివినా ఏమి లాభం.. చివరకు అపజయం, నేను సాధించలేను అనే భావనను తరిమికొట్టండి. ప్రశ్నలను విశ్లేషించుకోండి, ఎక్కడ, ఎందుకు తప్పు చేశాను! మెమరీ సమస్యనా? చాప్టర్‌ సరిగ్గా అర్థం చేసుకోలేదా? జవాబు తెలిసినా, తప్పుగా జవాబు పెట్టానా? అనే విశ్లేషణ చేసుకొని తప్పులను సరిదిద్దుకొని, మెంటార్‌ సహాయంతో మళ్లీ పునరుత్తేజాన్ని తెచ్చుకొని చదవడం మొదలుపెట్టాలి.

ఉద్యోగం చేస్తూ పోటీపరీక్షలు వ్రాసేవారు:

గత పరీక్షలవల్ల కొంతమందికి ఉత్సాహం వస్తుంది. కొంతమందికి నిరుత్సాహం వస్తుంది. ఇప్పుడు రాబోయే పరీక్షలకోసం ముగ్గురు, నలుగురు అభ్యర్థులు గ్రూపుగా ఏర్పడి చదువును సాగించాలి. ప్రతిరోజూ కనీసం 3 గంటలపాటు చదువుపై చర్చ, ఆ తర్వాత ప్రశ్నాపత్రాలు సాధించడం చేయాలి. వీడియో పాఠాలను, ఆడియో పాఠాలుగా మార్చుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు వినడం, బస్టాప్‌లో వినడం, పుస్తకాలు ప్రయాణంలో చదవడం లేదా చర్చించుకోవడం మొదలుపెట్టాలి.

మిగతా వారంతా ఏమనుకుంటారు, బాస్‌ కోప్పడతాడేమో! అనే ఆలోచనలనుండి బయటకు వచ్చి, ఉన్న సమయాన్ని ఎలా! చదువుకోసం కేటాయిస్తున్నాననేదే ముఖ్యం. ముత్యాలరాజు ఐపీఎస్‌ ట్రైనింగ్‌ చేస్తూనే ఐఏఎస్‌ టాపర్‌ పొజిషన్‌ సాధించాడు. కాబట్టి చదవాలనుకునే వారికి అవకాశం వుంటుంది. కొత్త నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కొన్ని రోజులు శ్రద్ధ పెట్టి చదవాలి.

గత పరీక్షల ఫలితాల ప్రభావాన్ని మనం చాలా వరకు సకారాత్మకంగా మరల్చుకోవాలి. ఇన్ని అవాంతరాలున్నా ఇలా చదువుతున్నాను, ఇంకా సమయం కేటాయిస్తే తప్పకుండా సాధించగలను.. తోటిమిత్రుల సహాయం తీసుకొని ఈసారి సాధిస్తాననే సంకల్పం తీసుకోవాలి.

నిజానికి ఇలా రాసే వాళ్ళకు తీవ్ర మైన కాంక్ష వుంటుంది. ఎలాగైనా సాధించాలి అని. చాలామంది సాధిస్తారు కూడా. ఉన్న తక్కువ సమయాన్ని ఎలాగైనా ఉపయో గించుకోవాలనే ‘బర్నింగ్‌ డిజైర్‌’ (జ్వలించే తపన) వలన పూర్తిస్థాయి ఏకాగ్రతను సాధించి చదివింది, చదివినట్టుగా ఆకళింపు చేసుకుంటారు. అందరికంటే ముందే లేచి చదువుకోవడం.. ఇంట్లో వున్నవాళ్ళతో సానుకూలంగా వుండి కొంత పనిని, తోటివారికి అప్పగించి వెసులుబాటును కలిగించుకోవడం.. కొన్ని రోజులపాటు.. చదువు మాత్రమే ప్రాధాన్యతగా పెట్టుకోవడం వలన పరీక్షకు కావలసిన పూర్తి ప్రిపరేషన్‌ జరుగుతుంది.

పెళ్ళిళ్లు, కుటుంబాన్ని చూసుకుంటూ

ఎంతోమంది స్త్రీలు, పిల్లలతో, కుటుంబంతో పోటీపడి.. ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్‌లలో ఉత్తీర్ణత సాధించారు. కాబట్టి ప్రిపరేషన్‌ పూర్తిస్థాయిలో చేయడానికి రాబోయే పరీక్షలకు చదవడం ఈ రోజే శుభారంభం. ఇంకా సలహాలకోసం యాప్‌ను గూగుల్‌ప్లే స్టోర్‌నుండి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

గత పరీక్ష ఒత్తిడి:

గత పరీక్షా ఫలితాలు, ఉత్సాహాన్ని పెంపొందించే విధంగా, వాటికి అర్థం ఇవ్వండి, ఏరకమైన ఫలితాలు అయినా సరే! తక్కువ మార్కులు వస్తే.. ఇంకా నేను చదవాల్సింది మిగిలివుంది, అది పూర్తి చేస్తాను. మంచి మార్కులు వస్తే…ఇంకా ఉన్నతమైనవి సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఏకాగ్రతతో, మెంటారింగ్‌ తీసుకొని చదువుతాను. నైపుణ్యాలకోసం ‘విజయానికి దారిది’ పుస్తకం చదవండి. మీరు శాస్త్రీయ పద్ధతుల్లో చదివి ప్రక్రియలకు లాభిస్తుంది.

డాక్టర్‌ సి. వీరేందర్‌

Other Updates