jobనిరుద్యోగులు ఇకపై ధైర్యంగా, విశ్వాసంతో ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నూతన శకం ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిరుద్యోగుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. రాష్ట్ర విభజన జరిగినా, ఇంకా ఉద్యోగుల పంపిణీ జరుగకపోవడంతో, ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తేలడం లేదు. ఒకసారి ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీల భర్తీ, నియామకాలు ప్రారంభమవుతాయి.

నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల ప్రచారానికి లోనుకాకుండా, వాస్తవాలు తెలుసుకుంటూ వుండాలి. ఉద్యోగార్థులకు ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ సౌకర్యంతో పాటు, వివిధ అంశాలపై కొత్తగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ‘తెలంగాణ మాస పత్రిక’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ..

ప్ర॥ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?

తెలంగాణ ఉద్యమం మూడు ప్రధాన అంశాలపై జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే కీలక అంశాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి. మన పాలనలో మనకు అవకాశాలు దొరుకుతాయనే తెలంగాణ ఉద్యమంలో యువత క్రియాశీలకంగా పాల్గొన్నారు. వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సిఎం రెండునెలల్లో టిఎస్‌పిఎస్‌సిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖలల్లో ఎన్ని ఖాళీలున్నాయో సేకరిస్తున్నాం. ఉద్యోగ నియామకాలకు కొన్ని ప్రతి బంధకాలున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన జరగలేదు. ఇప్పుడు ఉద్యోగులందరూ ఆర్డర్‌ టు సర్వ్‌ కింద పనిచేసున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియపై కమలనాధన్‌ కమిటీ ఎలాంటి రిపోర్ట్‌ ఇవ్వలేదు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కమలనాథన్‌ మార్గదర్శకాల ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణి జరుగుతుంది. ఈ జాప్యంలోని అంశం 76 ఆర్గనైజేషన్స్‌ 10 షెడ్యూల్లో ఉన్నాయి. 9వ షెడ్యూల్‌లో, స్టేట్‌ గవర్నరమెంట్‌ బాడీలు, పబ్లిక్‌ సెక్టార్‌కు సంబంధించినది. ఇవే కాకుండా ఇంకా 106 పబ్లిక్‌సెక్టార్ల విభజన జరుగలేదు. వీటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై నిర్ణయం, విభజన జరుగకపోవడంతో ఉమ్మడిగా పని చేస్తున్నారు. వీరి విభజన జరిగితే ఖాళీలు తేలుతాయి. ఆతర్వాత నియామకాలు చేపడతాం.

ప్ర॥ కమలనాథన్‌ కమిటి కొందరికే కదా? మిగతా ఉద్యోగాలకు ఏం సంబంధం?

జ॥ కమలనాథన్‌ కమిటి కేవలం 80వేల మంది ఉద్యోగులకు సంబంధించినదే అయినా ఈ మార్గదర్శకాల ప్రకారమే మిగతావి పనిచేస్తాయి. ఉద్యోగులకు ఏవిధంగా ఆప్షన్‌ ఇస్తుంది, లోకల్‌, నాన్‌ లోకల్‌ ఏవిధంగా విభజిస్తుంది, ఎలాంటి ఆప్షన్స్‌ ఇస్తుంది లాంటి విషయాలు తేలాల్సి ఉంది. ఆ తర్వాతే ఖాళీలు తెలుస్తాయి. ఇప్పటికిప్పుడే, ఉద్యోగాల నియామకాలు జరపాలనే డిమాండ్‌ సరైంది కాదు. ప్రభుత్వం కమలనాథన్‌తో సంబంధంలేని ఉద్యోగాలను అంచనా వేస్తోంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌, గ్రామీణ నీటి సరఫరా, వాటర్‌ గ్రిడ్‌, ఆర్‌ అండ్‌ బి లో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.

ప్ర॥ ఉద్యోగ ప్రకటనలు రావడం లేదని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి?

జ॥ రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాలే రాలేదనడం అబద్ధం. ఎన్నడూ లేనివిధంగా సింగరేణి కాలరీస్‌లో 5వేల ఉద్యోగాలు, ఎలక్ట్రిసిటీలో 5వేల ఉద్యోగాలకు, దాదాపు 10వేల ఉద్యోగాలు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీచేసింది. వీటితో పాటు వాటర్‌ గ్రిడ్‌లో రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇప్పటికే వేశాం. ఉద్యోగాలు రాలేదని విమర్శించడం తప్పు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా రాకపోవచ్చు కాని, ప్రభుత్వం భర్తీ చేస్తానన్న లక్ష ఉద్యోగాల్లో ఇప్పటికే పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్ర॥ డిఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు వేస్తారు? చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు?

జ॥ మునుపున్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రాతిపదికన నియామకాలు జరుగుతాయి. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి పోతోంది. కాని ఉపాధ్యాయులు అలాగే ఉన్నారు. ఐదుగురు టీచర్లున్న చోట ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని సర్వశిక్షా అభియాన్‌ చేసిన సర్వేలో తేల్చారు. టీచర్లు, విద్యార్థుల సమ పంపిణీ ఉండే విధంగా, మొత్తంగా రేషనలైజేషన్‌ చేయాలని జీవో విడుదల చేసింది ప్రభుత్వం. అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను ఎక్కడి వారిని అక్కడే ఉంచి కొత్త వారిని నియమించాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఉపాధ్యాయులు వారి బదిలీలు, కేటాయింపులు జరిగిన తర్వాత ఎంతమంది టీచర్లు అవరసమవుతారో ఖాళీలను, అవసరాన్ని, డిమాండ్‌ను బట్టి అంత మందిని తీసుకుంటాం. డిఎస్సీ జిల్లాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, దానికి పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌కు ఎలాంటి సంబంధం లేదు.

ప్ర॥ సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి?

జ॥ ఏ రాష్ట్ర ప్రభుత్వ అవసరానికైతే పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఉద్యోగులను అందిస్తుందో ఆ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, పరిధి, పరిజ్ఞానం తెలియాలి. సిలబస్‌లోనే ఆ రాష్ట్రానికి సంబంధిచిన భౌగోళిక, వారసత్వ, సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక, ప్రజలకి సంబంధించిన పరిజ్ఞానం మొదలైన అంశాలను పరీక్షించడం జరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన పరిజ్ఞానం పరీక్షల స్కీంలోనే అభ్యర్థికి ఏమాత్రం పరిజ్ఞానం ఉందో పరీక్షిస్తాము. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది, కొత్త అవసరాలున్నాయి. తెలంగాణలోకి తీసుకునే ఉద్యోగులకు రాష్ట్రానికి సంబంధించిన మౌలిక పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశంతో సిలబస్‌లో తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్చుతున్నాం. తెలంగాణ చరిత్ర, ఆర్థిక అంశాలు, తెలంగాణ ఉద్యమం లాంటి వివిధ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని ఆలోచన చేశాం. సిలబస్‌ తయారు చేయడానికి సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వారు, నాయకత్వం వహించిన, పాల్గొన్న ఉద్యోగులు, మేధావులు అందరినీ కలిపి సిలబస్‌ తయారు చేసే బాధ్యతను అప్పగించాం. దీనిలో కొదండరాం, చుక్కా రామయ్య, హరగోపాల్‌, కె. నాగేశ్వర్‌ లాంటి మేధావులు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వారు, గత 60 ఏళ్లుగా తెలంగాణ పరిణామాలను పరిశీలన చేసిన వీరందరితో కమిటీ వేశాం. దాదాపు 30 మంది మేధావులను, నిపుణులను భాగస్వాములను చేశాం. వారు అనేక మంది అభిప్రాయాలు తీసుకుని, తెలంగాణ భవిష్యత్‌ అవసరాలకు ఏది అవసరమో దానిని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం సిలబస్‌ తయారు చేశారు. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం దాన్ని ఆమోదించి జీవో ఇస్తే దానిని మేము అధికారికంగా అమలు చేస్తాం. సిలబస్‌ను ముందుగానే మా వెబ్‌సైట్‌ http://www.tspsc.gov.in/లో ప్రకటిస్తాం.

ప్ర॥ నిరుద్యోగులకు దగ్గర కావడానికి, ఉద్యోగ నోటిఫికేషన్‌లు తెలపడానికి ఏవిధంగా ప్రయత్నిస్తున్నారు?

జ॥ టిఎస్‌పిఎస్‌సి అనేది కొత్తగా ఏర్పడిన కమీషన్‌. కాబట్టి ప్రజల అవసరాలు, అకాంక్షలు భిన్నంగా ఉన్నాయి. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు, పారదర్శకంగా, ప్రతి నిరుద్యోగికి అందుబాటులో ఉండే విధంగా http://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను రూపొందించాం. అభ్యర్థికి ఉండే అన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం.

ఇందులో వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాము, ఇది దేశంలోనే మొదటిసారి. ఉద్యోగార్థులకు సంబంధించిన వివరాలను, బయోడేటాను, ఆధార్‌ నంబర్‌, విద్యార్హతలు, ఫోటోలు, ఈ మెయిల్‌ అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌ను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న ప్రతి అభ్యర్థికి 10 అంకెలతో ఉన్న రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ఇస్తాం. ఇది కేవలం సౌకర్యం మాత్రమే, ఇక్కడ నమోదు చేసుకుంటే ఉద్యోగం వస్తుందని హామీ ఇవ్వడం లేదు. ఎటువంటీ ఫీజు ఉండదు. ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు అర్హులైన వారందరికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా అలర్ట్‌ పంపిస్తాం. లింక్‌ను క్లిక్‌ చేసుకుని నేరుగా టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో వారికిచ్చిన 10 డిజిట్‌నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఆటోమేటిక్‌గా అప్లికేషన్‌ డాటా అప్‌డేట్‌ అవుతుంది. ప్రతీ సారి అప్లికేషన్‌ నింపాల్సిన పనిలేకుండా అటోమేటిక్‌ ఆన్‌లైన్‌ సిస్టంను ప్రవేశ పెట్టాం. ఒకే సారి అభ్యర్థులు పంపిన దాన్ని మేం స్టోర్‌ చేసి పెట్టుకుంటాం. ప్రతి నోటిఫికేషన్‌కు 10 డిజిట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్ర॥ తెలంగాణలో ఎటువంటి ఉద్యోగావకాశాలుంటాయి?

జ॥ కొత్త ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణం ఎజెండాగా, బంగారు తెలంగాణాగా మార్చాలనుకుంటోంది కాబట్టి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందించింది ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రతిపాదించింది. విద్యుత్‌ కేంద్రాలు, వ్యవసాయ రంగంపై దృష్టి సారించింది. రానున్న రోజుల్లో విద్యుత్‌, ఇరిగేషన్‌, వ్యవసాయ, ఇండస్ట్రియల్‌, సాంకేతిక, పరిపాలన రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే లక్ష ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషనే నియామకాలు చేపట్టదు. తమ పరిధిలో ఉన్న ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌లు వేస్తాం. మిగతా ఉద్యోగాలను రకరకాల పద్దతుల్లో ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పటికే దాదాపు పదివేల ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం చేపట్టింది.

ప్ర॥ ఉద్యోగుల విభజన ఇప్పటి వరకు జరగలేదు. ఎప్పటిలోగా ఉద్యోగుల పంపిణీ పూర్తవుతుంది?

జ॥ కమలనాథన్‌ కమిటీయే ఎప్పటిలోగా ఉద్యోగుల పంపిణీ పూర్తిచేస్తామో చెప్పలేకపోతోంది. జూన్‌ వరకు చివరి గడువు ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఐఎఎస్‌ల విభజనే కొన్ని కారణాలతో వాయిదా పడుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగుల విభజనకూ సమయం పడుతుంది. ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత ఆప్షన్లు ఇవ్వడం, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉద్యోగుల విభజన జరుగుతుంది, ఆతర్వాతే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుతుంది, ఆతర్వాతే ఉద్యోగ ప్రకటనలను విడుదల చేస్తాం.

ప్ర॥ భవిష్యత్తులో టిఎస్‌పిఎస్‌సి ఏం చేయబోతోంది?

జ॥ కొత్తగా ఏర్పడిన సర్వీస్‌ కమీషన్‌ కాబట్టి తమ భవనంలో సైతం సరైన స్థలం లేదు, ఉద్యోగుల కొరత ఉంది. ఎపిపిఎస్సీలో 500 మంది పనిచేస్తుంటే 120 మంది మాత్రమే తెలంగాణ వారు ఉన్నారు. ఉద్యోగుల కొరతను ఎదుర్కో వడానికి ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పూర్తిస్థాయిలో ఆధునిక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాము. వన్‌టైం రిజిస్ట్రేషన్‌తో పాటు ఆన్‌లైన్‌ అప్లికేషన్ల విధానం, వెబ్‌సైట్‌ను వాడుకుంటూ నిరుద్యోగులకు అత్యుత్తమ సేవలందించడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు ఉద్యోగుల నియామకం చేయడానికి సర్వసన్నద్దంగా ఉన్నాం.

ప్ర॥ ఉద్యోగాలు వస్తున్నాయని కొన్ని ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లు కోచింగ్‌ ఇస్తున్నాయి. ఇప్పట్లో ఉద్యోగ నోటిఫికేషన్‌లు వస్తాయా?

జ॥ గత ఏడాది కాలంగా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లు ఓ ప్రోగ్రాం పెట్టాయి. వారి అవసరాల కోసం వారే గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, ఇతర ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంలో వాస్తవం లేదు. కేవలం కోచింగ్‌ సెంటర్ల ప్రచారం వల్ల ఉద్యోగ కోచింగ్‌ నిరంతర ప్రక్రియగా మారింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆత్రుత, నిరుద్యోగ సమస్య, అవసరాలరీత్యా, నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల బాటపడుతున్నారు. ఏ ఉద్యోగం వస్తుందో, సిలబస్‌, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలున్నాయో తెలియకుండా కోచింగ్‌లకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కొత్త సిలబసే ప్రకటించలేదు, అలాగే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వలేదు. కేవలం వారి వ్యాపారాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలకోసమే ప్రిపేర్‌ అయితే కష్టం. ప్రిపేర్‌ అవడం, అవుతున్నామని అందుకే ఉద్యోగాలు వేయాలని ఆందోళన చేయడం అర్దరహితం.

ప్ర॥ మీరు తీసుకునే కఠిన నిర్ణయాలు ఏమిటి?

జ॥ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ అంటే పైరవీకారుల అడ్డా అని, అక్రమాలు, అవినీతి జరుగుతాయని అపోహ ఉంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎవ్వరి ఒత్తిడికి తలొగ్గకుండా పూర్తి పారదర్శకంగా పనిచేయండని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిక్కచ్చిగా, కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత తమమీద
ఉంది. తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ మీద చాలా ఆశలు పెట్టుకున్నారని, గతంలో జరిగిన అవకతవకలకు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. టైం షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి, ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించే ఆస్కారం ఉంది. పరీక్షలు, ఇంటర్య్వూలు పారదర్శకంగా జరిగినపుడే టిఎస్‌పిఎస్‌సి పైన విశ్వసనీయత పెరుగుతుంది.

ప్ర॥ ప్రశ్నా పత్రాల్లో పొరపాట్లు, తప్పులు జరుగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జ॥ గత ఎపిపిఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో, అకడమిక్‌ వ్యవహారాల్లో పొరపాట్లు జరిగాయి. అలా జరుగకుండా మా రెగ్యులేషన్‌లో ఇద్దరు ఎక్స్‌పర్ట్స్‌ కమిటీని కూడా నియమించుకునే అవకాశం ఉంది, దీనిని ఏర్పాటు చేస్తున్నాము. దీని వల్ల పరీక్షల నిర్వహణ పటిష్టంగా జరగడమే కాకుండా, పరీక్షా పత్రాలు రూపొందించడంలో కూడా ఎలాంటి తప్పులు జరుగకుండా అకడమిక్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నాము, ప్రశ్నపత్రాల్లో తప్పుడు ప్రశ్నలు రావడం, తర్వాత మార్కులు కలపడం లాంటివి జరుగకుండా ఈ సెల్‌ పనిచేస్తుంది.

Other Updates