studentతెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఖాళీగాఉన్న లక్షకుపైగా పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, ఉద్యోగార్థుల వయో పరిమితిని ఐదేళ్లు సడలిస్తామని నవంబరు 24న శాసనసభలో ప్రకటించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులు పూర్తి కాగానే పోస్టులనుభర్తీచేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం 1.07 లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇవేకాకుండా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. విద్యుత్‌రంగంలో 10,000 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తికోసం పరిశ్రమ ప్రారంభి స్తున్నందున అందులో సుమారు 12000 వరకు ఉద్యోగాలు భర్తీ అవుతాయన్నారు. వాటర్‌ గ్రిడ్‌వంటి పథకాలవల్ల కూడా ఉద్యోగాలకల్పన జరుగుతుందన్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి దాని ద్వారా నియామకాల ప్రకటనలు జారీ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంటు చేయడానికి కూడా రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌ పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పర్మినెంట్‌ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. త్వరలో అమలయ్యే నూతన పారిశ్రామిక విధానంవల్ల ప్రైవేటురంగంలోనూ అనేక ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పోలీస్‌ శాఖలో 3 వేల డ్రైవరు పోస్టులు భర్తీ చేస్తామనీ, ఆర్టీసీ, సింగరేణి తదితర సంస్థల్లోకూడా ఖాళీల భర్తీకి కృషి చేస్తామని సీఎం చెప్పారు.
దీనితో రాష్ట్రంలోని యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కలలు సాకారమయ్యే రోజులు త్వరలోనే వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువకుల తల్లితండ్రులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

ఇంతకాలంగా ఉమ్మడి రాష్ట్రంలో మన ఉద్యోగాలను ఆంధ్ర పాలకులు తమ ప్రాంతం వారికి కట్టబెడుతున్న వైనాన్ని ఉద్యమ కాలంలో మేధావులు, ఉద్యమకారులు ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని నిరుద్యోగ యువకులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశించారు. ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఇప్పుడు యువకులకు తాము ఉద్యోగాలు సంపాదించుకోగలమనే ఆశ పెరిగింది. వారి ఆశలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. దీనిపై నిరుద్యోగ యువత ఆనందోత్సాహాలు వ్యక్తం చేసింది.
తాము సాధించుకున్న రాష్ట్రంలో తమ కాళ్ళపై తాము నిలబడి తమను కన్న తల్లిదండ్రుల కలలను నిజం చేసే సమయం ఆసన్నమైందని యువజనులు భావిస్తున్నారు.

KCRD

మన నుమాయిష్‌ ఢల్లీిలోని ప్రగతిమైదాన్‌ స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అక్కడ జరిగే ట్రేడ్‌ ఫెయిర్‌లో మన రాష్ట్రం వైపున స్టాల్‌ ఏర్పాటు చేయాలంటే బిడ్‌లో రూ. 40 లక్షలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అంతటి డిమాండ్‌ మన ఎగ్జిబిషన్‌కు కూడా రావాలన్నారు. దీనికై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. నవంబర్‌ 16న ఆయన తార్నాకలో హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సరోజనీనాయుడు వనితా మహా విద్యాలయ ఫార్మసీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ బాగయామ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌)లో చిన్న సంస్థగా మొదలైన ఎగ్జిబిషన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగిందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌, విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎం.పి. బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మహా విద్యాలయ చైర్మన్‌ హరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Other Updates