khammamఖమ్మం సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గత ఏడాదిగా నిర్వహిస్తున్న పోటీపరీక్షల అధ్యయన కేంద్రం మంచి ఫలితాలను సాధిస్తూ, ఉద్యోగార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తోంది.

ఈ కేంద్రంలో పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన అభ్యర్థులలో ఆరుగురు ఇటీవల ప్రకటించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో ఉత్తీర్ణులై తమ సత్తాచాటారు. వీరు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరితోపాటు గ్రూప్‌ 2, తదితర ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా ఈ కేంద్రంలో శిక్షణ పొందారు.

ఈ కేంద్రంలో శిక్షణ పొంది పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌ డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, అంతకుపూర్వం ఖమ్మంలో పోలీస్‌ కమిషనర్‌ గా పనిచేసిన షానవాజ్‌ ఖాసిం లను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభ్యర్థులను ఆ అధికారులు ఇరువురు అభినందించారు.

2016లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీచేసిన సందర్భంగా ఈ అధ్యయన కేంద్రం రూపుదిద్దుకొంది. ఆనాడు ఖమ్మంలో సమాచార, పౌరసంబంధాల శాఖలో సహాయ సంచాలకునిగా పనిచేసిన పి. భాస్కర్‌ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు చొరవచూపారు. ఆయన చొరవకు జిల్లా కలెక్టర్‌ డి.ఎస్‌ లోకేష్‌ కుమార్‌ ఆర్థిక సహకారం, చేయూత అందించడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయం పై అంతస్తులో ఈ పోటీపరీక్షల అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ పోటీపరీక్షలకు తయారవుతున్న అభ్యర్ధుల అద్యయనానికి కావలసిన పుస్తకాలు, ఫర్నీచర్‌ను కూడా దాతల సహాయంతో సమకూర్చారు. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ కూడా ఈ కేంద్రాన్ని సందర్శించి, నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.

ఈ పోటీపరీక్షల అధ్యయన కేంద్రంలో శిక్షణ పొందటం వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరిందని కానిస్ట్టేబుల్‌ గా ఎంపికైన మరిగొండ మండలం చెరుమర్రి గ్రామానికి చెందిన గాలి రవికుమార్‌ తెలిపారు. నూతన సిలబస్‌ తో కూడిన ప్రముఖ ప్రచురణ సంస్థల పుస్తకాలు కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని తెలిపారు.ఈ కేంద్రం అందించిన సహకారంతోనే తాను, తన మిత్రులు కానిస్ట్టేబుల్‌ పోస్టుకు ఎంపిక అయ్యామని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నబీ తెలిపారు. సహాయ సంచాలకులు గా పనిచేసిన భాస్కర్‌ తమను ఎంతగానో ప్రాత్సహించి, అవసరమైన పుస్తకాలను సమకూర్చారని తెలిపాడు. ఈ కేంద్రాన్ని మరింత విస్తృతపరచాలని నబీ సూచించారు.

ఖమ్మం గ్రామీణ మండలం గురిమళ్ళ గ్రామానికి చెందిన బండ్ల నాగరాజు కూడా ఈ కేంద్రంలో శిక్షణ పొందారు. పోటీ పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావాలో, పరీక్షరాసే సమయంలో పాటించవలసిన మెళకువలు, తదితర విషయాలు ఈ అధ్యయన కేంద్రం ద్వారా తెలుసుకోగలిగామని చెప్పారు.

ఈ అధ్యయన కేంద్రంలో శిక్షణపొందిన పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం పట్ల అధ్యయన కేంద్రం ఏర్పాటుకు నాందిపలికిన పి. భాస్కర్‌ సంతోషం వ్యక్తంచేశారు. నిరుద్యోగ యువత ఈ కేంద్రాన్ని మరింతగా ఉపయోగించుకొని చక్కటి ఫలితాలను పొందగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యయక్తం చేశారు.

Other Updates