నిరుపయోగ వస్తువుల సేకరణకు జి.హెచ్‌.ఎం.సి ప్రారంభించిన స్పెషల్‌ డ్రైవ్‌లో వందలాది మెట్రిక్‌ టన్నుల నిరుపయోగవస్తువులను సేకరించింది. నగరంలోని పలు వార్డుల్లో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో జిహెచ్‌ఎంసి సిబ్బందికి తమ ఇంట్లో మూలకుపడ్డ వస్తువులైన ఎలక్ట్రానిక్‌, ఫర్నీచర్‌ వ్యర్థాలు, పనికిరాని పరుపులు, విరిగిన కుర్చీలు, బల్లాలు, ప్లాస్టిక్‌ వస్తువులను పెద్ద ఎత్తున అందజేశారు.

తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను ఎక్కడ వేయాలో తెలియక, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఇంటివద్ద నుండే సేకరించే ఈ కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి చేపట్టడంతో ఎన్నో ఏళ్ల నుండి తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగంగా పడిఉన్న వస్తువులను పెద్ద ఎత్తున అందజేశారు. ఈ డ్రైవ్‌లో ఇళ్లలో వృదాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను సేకరించారు.

నగరంలో ఈ పనికిరాని వస్తువులన్నింటిని రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారని, తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్‌ కావడంతో రోడ్లపై మురుగునీరు పొంగడం, నాలాల ద్వారా నీరు సక్రమంగా ప్రవహించకుండా రహదారులు జలమయం అవుతున్నాయని నగర మేయర్‌ పేర్కొన్నారు. అందువల్లనే జి.హెచ్‌.ఎం.సి ఈ నిరుపయోగవస్తువల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.

నిరుపయోగ వస్తువుగా వీణ వాయిద్యం

వేలాది మందిని తన వీణానాథంతో అలరించిన వాయిద్యం అది. వందలాది శిష్యులను సంగీత పండితులుగా రూపొందించడంలో కీలక పాత్ర వహించింది. సాక్షాత్తు సరస్వతి వాయిద్యమైన వీణ, జిహెచ్‌ఎంసి చేపట్టిన నిరుపయోగ వస్తువుల సేకరణ జాబితాలో చేరి మున్సిపల్‌ చెత్తలో భాగంగా మారింది. సరూర్‌నగర్‌ సర్కిల్‌ అధికారులు నిర్వహించిన ఈ నిరుపయోగ వ్యర్థాల సేకరణలో భాగంగా గడ్డిఅన్నారంలో నిరుపయోగ వ్యర్థాల సేకరణ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో నుండి వీణను తెచ్చి అందించారు. దీంతో సంగీత వాయిద్యమైన వీణను నిరుపయోగ వస్తువుల్లో కలిపి భారమైన హృదయంతో జిహెచ్‌ఎంసి సిబ్బంది తరలించారు.

Other Updates