magaతెలంగాణ మానవీయ కోణానికి ఇదో మచ్చు తునక. కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఇదో మెచ్చుతునక. ఎందుకంటే…నయా పైసా ఖర్చు లేకుండానే నిరుపేద కిడ్నీ బాధితులకు పూర్తి ఉచితంగా డయాలసిస్‌ చేస్తున్నారు కనుక. వైద్యం, ఆరోగ్యాన్ని కేవలం మొక్కుబడిగా కాకుండా, మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

రోజురోజుకు పెరుగుతున్న కిడ్నీ బాధితుల పట్ల సానుభూతి, సహానుభూతితో పూర్తి ఉచితంగా వారి వారి సమీప దవాఖానాల్లోనే డయాలసిస్‌ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కేవలం హైదరాబాద్‌ లోని ఆసుపత్రులకే పరిమితంగా ఉన్న డయాలసిస్‌ కేంద్రాలను విస్తరించి, విస్తృత పరుస్తున్నది. సీఎం కేసీఆర్‌ ముందుచూపు, దార్శనికత నేపథ్యంలో మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో బంగారు తెలంగాణ బాటలో, ఆరోగ్య తెలంగాణ దిశగా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో సింగిల్‌ యూజ్డ్‌ ఫిల్టర్‌ డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 40 కొత్త డయాలసిస్‌ కేంద్రాలను, అందులో 288 యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అందులో మొదటిది సిద్ధిపేటలో, రెండోది సిరిసిల్లలో ప్రారంభమయ్యాయి. మిగతా కేంద్రాలు మరికొద్ది రోజుల్లోనే నిరుపేదలకు పూర్తి ఉచితంగా వైద్యం అందించడానికి అందుబాటులోకి రానున్నాయి.

రోజురోజుకు పెరుగుతున్న జనజీవన వేగం, అనూహ్య మార్పులకు లోనవుతున్న జీవన విధానం, తాగునీరు, ఆహారపు అలవాట్లలో తేడాలు, అంతకంతకూ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ళు, కాలుష్యం, వారసత్వం వంటి అనేక కారణాల వల్ల కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. ఒకవైపు ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపొందిస్తున్నప్పటికీ, కిడ్నీ బాధితుల సంఖ్య తగ్గడం లేదు. మానవ శరీర నిర్మాణంలో ఒక కిడ్నీ చెడిపోతే మరో కిడ్నీ పని చేయడానికి ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ, ఆ కిడ్నీలు దాదాపు 90శాతం పని చేయడం మానాకే ఆ సమస్య బయటపడుతున్నది. దీంతో కిడ్నీ సమస్యలున్న చాలా మందిలో అనివార్యంగా వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్‌ అవసరమవుతున్నది. అలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో అతి తక్కువ డయాలసిస్‌ సెంటర్లు అందుబాటులో ఉండేవి. రాష్ట్రంలో 9 వేల నుంచి 10వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. అందులో 6 వేల పై చిలుకు మంది ప్రభుత్వ దవాఖానాల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. మిగతా 3వేలకు పైచిలుకు మంది ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళుతున్నారు. ఒక్కో డయాలసిస్‌ కి రూ.1500 పైగా చార్జీ వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వచ్చిపోయే చార్జీలు డయాలసిస్‌ కి మించి అవుతున్నాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ అవసరం అవుతుంది. ఇదంతా తడిసి మోపెడు అవుతున్నది. ఎందుకు బతికి ఉన్నాంరా బాబూ! అని బాధితులు, చూస్తూ మనిషిని అలా వదిలేసి చంపుకోలేకా, బతికించుకోవడమెలా అని నిరంతరం మధనపడుతున్న కుటుంబ సభ్యుల బాధలు వర్ణణాతీతం.

అందుకే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ సమస్యని పరిశీలించిన అనంతరం అదనంగా 40 డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, సిద్ధిపేట లాంటి చోట్ల కొన్ని డయాలసిస్‌ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. తాజాగా సిద్దిపేట, సిరిసిల్లల్లోనూ కొత్త డయాలసిస్‌ కేంద్రాలు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిల చేతుల మీదుగా మొదలయ్యాయి. మిగతా కేంద్రాలని ఒకటి రెండు నెలల్లోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కిడ్నీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది. అందులో జీవో నెంబర్‌ 525, తేదీ 11-08-2016 ప్రకారం మొత్తం 14 డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. కరీంనగర్‌ ఏరియా హాస్పిటల్‌, గోదావరిఖని ఏరియా హాస్పిటల్‌, జనగామ ఏరియా హాస్పిటల్‌, నర్సంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌, సత్తుపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌, హుజూర్‌నగర్‌ ఏరియా హాస్పిటల్‌, వికారాబాద్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, మహేశ్వర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, మలక్‌పేట ఏరియా హాస్పిటల్‌, జహీరాబాద్‌ ఏరియా హాస్పిటల్‌, బాన్స్‌వాడ ఏరియా హాస్పిటల్‌, బోధన్‌ ఏరియా హాస్పిటల్‌.

అంతకుముందే మరో జీవో నెంబర్‌ 803 తేదీ 18-12-2015 ప్రకారం 20 డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. తాండూరు జిల్లా హాస్పిటల్‌, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌, సంగారెడ్డి జిల్లా హాస్పిటల్‌, సిద్ధిపేట ఏరియా హాస్పిటల్‌, మెదక్‌ ఏరియా హాస్పిటల్‌, మంచిర్యాల ఏరియా హాస్పిటల్‌, నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌, రిమ్స్‌ ఆదిలాబాద్‌, ఉట్నూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, నల్గొండ జిల్లా హాస్పిటల్‌, సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌, భద్రాచలం ఏరియా హాస్పిటల్‌, ఏటూరు నాగారం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, మహబూబ్‌నగర్‌ ఏరియా హాస్పిటల్‌, కరీం నగర్‌ జిల్లా హాస్పిటల్‌, జగిత్యాల ఏరియా హాస్పిటల్‌, గద్వాల ఏరియా హాస్పిటల్‌, నాగర్‌ కర్నూలు ఏరియా హాస్పిటల్‌, వనపర్తి ఏరియా హాస్పిటల్‌, కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌. కాగా, ఇప్పటికే ఆరు కేంద్రాలు అదనంగా మంజూరై ఉన్నాయి. గతంలో నిమ్స్‌, నిజామాబాద్‌, గాంధీ, ఉస్మానియా, మహబూబ్‌నగర్‌ హాస్పిటల్స్‌లో ఐదు డయాలసిస్‌ కేంద్రాలు పని చేస్తున్నాయి.

పిపిపి విధానంలో డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు

ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యంతో మొదటి సారిగా రాష్ట్రంలో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ పద్ధతిలో ప్రభుత్వ దవాఖానాల్లో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన నీరు, విద్యుత్‌, గదులు వంటి వసతులన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. మిషనరీ మాత్రం స్థానికంగా ఆయా హాస్పిటల్స్‌ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్‌ సంస్థలు ఏర్పాటు చేస్తాయి. అందుకు అవసరమైన సాంకేతికత, ఇతర సిబ్బందిని సైతం ఆ సంస్థలే నియమించుకుంటాయి.

ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది

అయితే, ఒక్కో డయాలసిస్‌కి. రూ. 1325లను ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్‌ సంస్థకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. దాని రిపేర్లు, ఇతర అన్ని అంశాలను ఆ ప్రైవేట్‌ సంస్థలే చూసుకుంటాయి.

నిరుపేదలకు ఉచితంగా

ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న నిరుపేదలందరికీ డయాలసిస్‌ కేంద్రాలలో పూర్తి ఉచితంగా డయాలసిస్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న, బిపిఎల్‌ వర్గాల వారు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆయా సెంటర్లకు వెళితే సరిపోతుంది.

దేశంలోనే మొదటి సారిగా..

ప్రస్తుతం నెలకొల్పుతున్న డయాలసిస్‌ కేంద్రాలన్నీ సింగిల్‌ యూజ్డ్‌ ఫిల్టర్‌ పద్ధతి సెంటర్లు. సింగిల్‌ యూజ్డ్‌ అంటే, ఒక ఫిల్టర్‌ని ఒకేసారి వినియోగిస్తారు. ప్రతి కొత్త వ్యక్తికి కొత్త ఫిల్టర్‌ వేస్తారు. గతంలో ఒకే ఫిల్టర్‌ని శుభ్రం చేసి, మళ్ళీ, మళ్ళీ వాడే వారు. ఈ కారణంగా ఇన్‌ఫెక్షన్స్‌ సోకే అవకాశాలుండేవి. ప్రస్తుత సింగిల్‌ యూజ్డ్‌ ఫిల్టర్‌ పద్ధతిలో ఇన్‌ఫెక్షన్లకు ఆస్కారం ఉండదు. పైగా సురక్షితం. కాగా ఈ పద్ధతి ఇప్పటి వరకు దేశంలోని ఏ ప్రభుత్వ దవాఖానాల్లోనూ అమలులో లేదు. మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పద్ధతిని అమలులోకి తేవడం ముదావహం.

మార్గం లక్ష్మీనారాయణ

Other Updates