తెలంగాణ భాషాదినోత్సవమయిన, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కాళోజీ 102వ జయంతి సభను సెప్టెంబర్ 9న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ పేరిట నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని నవతరం వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు అందజేశారు. తెలంగాణ ఉద్యమకాలంలో గోరటి వెంకన్న పాటలు ప్రజలను ఉత్తేజితులను చేశాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అణచివేతపై తన ధిక్కారస్వరం వినిపించిన కాళోజీ పేరు చిరస్థాయిగా మిగిలిపోయేలా, ఓ కళాక్షేత్రం నిర్మిస్తున్నాం అన్నారు. వరంగల్ నగరం నడిబొడ్డున కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ కళాక్షేత్రం కోసం 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని, ఇందులో 15 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి కడియం వివరించారు.
సభలో పాల్గొన్న శాసనసభాపతి సిరికొండ మధుసూధనాచారి మాట్లాడుతూ కాళోజీ కవితా పద్ధతులను స్మరించుకున్నారు. కాళోజీ నోబుల్ బహుమతి అందుకోదగిన విశ్వ ప్రజాకవి అని కొనియాడారు. గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం గురించి స్పందిస్తూ, ఇది ఒక ప్రజాకవి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మరో ప్రజాకవికి ఇవ్వడం జరిగిందని అభివర్ణించారు.
ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కాళోజీతో తన అనుబంధం గురించి మననం చేసుకున్నారు. ఎన్నో ఉద్యమాలలో మేమిద్దరం కలిసి పాల్గొన్నామని అన్నారు. ఆ రోజులలో మా యిద్దరిని తాతా మనవళ్ళు అని అనేవాళ్ళని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మనిషిని వస్తువుగా చేసుకొని జీవితమంతా కవిత్వం రాసిన కాళోజీ చిరస్మరణీయంగా ఉంటారని అన్నారు. ‘అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని’ పేర్కొన్న కాళోజీ తెలంగాణలోని ప్రతి గుండెలో కొలువై ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. 20వ శతాబ్దపు ప్రజాకవి పురస్కారాన్ని, 21వ శతాబ్దపు ప్రజాకవికి ఇవ్వడం గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు.
ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కన్నీటి భాష తెలిసిన కవి కాళోజీ అయితే, బైరాగి తత్వాన్ని ఆకళింపు చేసుకున్న కవి గోరటి వెంకన్న అని అన్నారు. కాళోజీ పురస్కారానికి గోరటి వెంకన్న పేరును ప్రతిపాదించగానే జ్యూరీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలియపరిచారు. ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావు మాట్లాడుతూ కాళోజీ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే కాళోజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని వెలువరిస్తామని తెలిపారు. కాళోజీ ఫౌండేషన్‌నుంచి వచ్చిన నాగిళ్ళ రామశాస్త్రి మాట్లాడుతూ.. కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్థలమిచ్చి, నిర్మాణానికి నిధులిచ్చి కాళోజీపై వున్న గౌరవాన్ని చాటి చెప్పారన్నారు. ఫౌండేషన్ తరఫున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ గోరటితో వున్న అనుబంధాన్ని, వెంకన్న సాహితీ విశేషాలను సభకు వివరించారు.
పురస్కార గ్రహీత గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనపైన వాత్సల్యం ఉన్నదని, ఆ వాత్సల్యానికి ప్రతీకనే ఈ పురస్కారం అని పేర్కొన్నారు. తనదైన శైలిలో గొంతువిప్పి ఆటపాటలతో సభను రంజింపజేశారు. ఈ సభలో శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.