స్థానిక సంస్థల్లో ఉన్నంత అవినీతి మరెక్కడా లేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు అవినీతి నిలయాలుగా మారాయి. ఏ పని కావాలన్నా, డబ్బు ఇవ్వకుండా పని జరుగదు. అది పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ కావచ్చు. చనిపోయిన సర్టిఫికెట్‌ కావచ్చు. ప్రజలు వీటికి అలవాటు పడిపోయారు. ఎవరూ కూడా వీటిని వ్యతిరేకించడం లేదు.

నగరపాలక సంస్థలు అవినీతి నిలయాలే కాదు, అవి అందించే సేవల్లో కూడా సంపూర్ణత ఉండదు. ఏ రోడ్డు చూసినా అపరిశుభ్రంగా కన్పిస్తాయి. చెత్తకుండీలు కంపుకొడుతుంటాయి. మురికి కాలువల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. అన్ని రాష్ట్రాలలోనూ కనిపిస్తుంది.

ఇలాంటి నగర పాలక సంస్థలకి జాతీయ కమిషన్‌ తన తీర్పుల ద్వారా ఈ మధ్యకాలంలో వాతలు పెడుతోంది. మామూలు నగరపాలక సంస్థలు మహా నగరపాలక సంస్థలుగా మారిపోతున్నాయి. కానీ అవి అందజేసే సేవల్లో అసంపూర్ణత పెరిగిపోతూనే ఉంది. ఇలాంటి సంస్థలను చూసి జాతీయ కమిషన్‌ తీవ్రంగా మండిపడింది. నగర పాలక సంస్థలు తమ పద్ధతులను మర్చుకోవాలని, పన్నులు చెల్లిస్తున్న వినియోగదారులకి సరైన సేవలు అందించాలని, అలా అందించనప్పుడు దానికి తగిన పాఠం నేర్చుకోవలసి వుంటుందని కమిషన్‌ హెచ్చరించింది. అది ఒట్టి మందలింపే కాదు. ఇద్దరు వినియోగదారులకి 10 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కూడా కమిషన్‌ ఆదేశించింది. నగర పాలక సంస్థలు అందించే సేవల్లో లోపమే గాక వాటి ఉద్యోగులు చేసే సేవల్లో దురుద్దేశం కూడా ఉందని కమిషన్‌ తన తీర్పుల్లో ప్రకటించింది.

నైనిటాల్‌ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఇంటిలో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేయమని నగర పాలక సంస్థను కోరాడు. నగర పాలక సంస్థ ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మరో కేసులో ఓ వినియోగదారుడు తన బిల్డింగ్‌కు టాక్స్‌ అసెస్‌మెంట్‌ కాపీని ఇవ్వాలని నగర పాలక సంస్థను కోరినప్పటికీ తన అసెస్‌మెంట్‌ కాపీని ఇవ్వలేదు. విసుగెత్తిన అతను జిల్లా ఫోరంలో ఫిర్యాదును దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జిల్లా ఫోరం ఫిర్యాదుని ఆమోదించింది. నగర పాలక సంస్థకు చెందిన ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఏకపక్షంగా, దురుద్దేశ పూరితంగా వ్యవహరించిందని తన తీర్పులో పేర్కొంది. వినియోగదారునికి నష్టపరిహారం చెల్లించాలని నగర పాలక సంస్థను ఆదేశించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా నగర పాలక సంస్థ రాష్ట్ర కమిషన్‌ ముందు అప్పీల్‌ను దాఖలు చేసింది. రాష్ట్ర కమిషన్‌ జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది. వినియోగదారురాలు ఉషారాణి అగర్వాల్‌ జాతీయ కమీషన్‌ ముందు రాష్ట్ర కమిషన్‌ తీర్పుకు వ్యతిరేకంగా సమర్పించిన రివిజన్‌ని ఆమోదించింది. నగర పాలక సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని, వాళ్ళు ఏకపక్షంగా, దురుద్దేశ పూర్వకంగా వ్యవహరించారని అభిప్రాయపడింది. ఉషారాణికి 10 వేల రూపాయల నష్టపరిహారం నగర పాలక సంస్థ చెల్లించాలని జాతీయ కమిషన్‌ ఆదేశించింది. అంతేకాదు నగర పాలక సంస్థల దురుద్దేశ పూర్వక చర్యల్ని ఎవ్వరూ సహించకూడదు. ప్రజలు దానిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అవినీతి ఈ సంస్థల్లో విపరీతంగా పెరిగిపోయిందని జాతీయ కమీషన్‌ తన ఆందోళనను వ్యక్త పరిచింది. ఇలాంటి చర్యలకి గురైన వినియోగదారులు నిస్సహాయంగా ఉండకుండా వినియోగదారుల ఫోరంలకు వచ్చినందుకు కమిషన్‌ వారిని అభినందించింది.

వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం డబ్బు తీసుకొని అందించిన సేవలు మాత్రమే ఆ చట్ట పరిధిలోకి వస్తాయి. చట్టంలో ఉన్న ఈ నిర్వచనం ఆధారంగా నగర పాలక సంస్థలు వినియోగదారుల ఫోరంల పరిధిలోకి రాకుండా తప్పించు కుంటున్నాయి. తను నిర్లక్ష్యంగా సేవలు అందించినప్పటికీ కూడ వినియోగదారులు ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ లోపాన్ని పసిగట్టి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ స్థానిక సంస్థలని చట్టం పరిధిలోకి వచ్చే విధంగా చట్టంలో మార్పులు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ప్రభుత్వం మళ్లీ అలాంటి ప్రయత్నాలను చేస్తోంది.

ఈ ప్రయత్నాలు ఇలా ఉండగానే, జాతీయ కమి షన్‌ నగర పాలక సంస్థలు వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోకి వస్తాయని తన తీర్పును ప్రకటిం చింది. అంతేకాదు నష్టపరిహారం కూడా మంజూరు చేసింది. అయితే ఈ రెండు కేసుల్లో కూడా వినియో గదారులు నగరపాలక సంస్థల నుంచి వాళ్లు ఆశి స్తున్న సేవలకి గాను డబ్బు చెల్లించడం జరిగింది.

నగర పాలక సంస్థలు వినియోగదారుల చట్టం పరిధిలోకి వచ్చే విధంగా దేశవ్యాప్తంగా వినియోగ దారులు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటిదాకా తాము ఆశిస్తున్న సేవలకి అవసరమైన ఫీజును చెల్లించి రశీదులను తన దగ్గర ఉంచుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది.

Other Updates