డాక్టర్ లక్ష్మణచక్రవర్తి
నల్లంతిఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనరసింహాచార్యుల వారి పేరులో మొదటి రెండు ఇంటి పేర్లు, మూడవది బిరుదనామం ఇదే తర్వాత కాలంలో ప్రధాన గహ నామమైంది. 1884 వరంగల్లులో నైష్ఠిక వైష్ణవ కుటుంబంలో జన్మించిన వీరు 1959 లో పరమపదాన్ని పొందారు. సుమారు 40 కి పైగా రచనలు చేశారు.అందులో కొన్ని మాత్రమే ముద్రితం.
నిర్వచనశుభాంగీకళ్యాణం, ప్రచండపరశురామం, యోగభూషణోపాఖ్యానం ప్రక్రియాపరంగా మూడూ ప్రబంధాలే. ప్రబంధానికుండవలసిన అన్ని లక్షణాలను, మర్యాదలను ఈ రచనల్లో ఠంయాలవారు అనుసరించారు. శృంగార ప్రబంధం నిర్వచన శుభాంగీ కళ్యాణం. అవతార మాహాత్మ్య ప్రబంధం ప్రచండ పరశురామం. ఒక భాగవతోత్తముని చరిత్రను కారణంగా చేసుకొని విశిష్టాద్వైత సిద్ధాంత అన్వయ ప్రబంధంగా యోగభూషణోపాఖ్యానాన్ని రచించారు. చూడడానికి విషయత్రిపుటిగా వీరి రచనలు కనిపిస్తాయి. ఇందులో చివరి రెండింటి అంతస్సూత్రం విశిష్టాద్వైత తత్త్వ అవగాహనను కలిగించడం. ప్రక్రియాపరంగా అంతస్సూత్ర పరంగా ఒకటిగా కనిపించినా ఏ రచనకు ఆ రచనగా చూసుకోవడం మంచిది.
తొమ్మిదివందల మూడు పద్యాలతో కూడిన ఐదాశ్వాసాల ప్రబంధం నిర్వచన శుభాంగీ కళ్యాణం వేల్పుగొండ లక్ష్మీనృసింహునికి అంకితం. రుక్మిణీదేవి అన్న రుక్మి. ఆయన కూతురు శుభాంగి. ఈమెను రుక్మిణి కొడుకయిన ప్రద్యుమ్నుడికిచ్చి వివాహం చేయడం ఈ ప్రబంధ కథావస్తువు. కోవెల సంపత్కుమార చెప్పినట్లు ప్రాచీన ప్రబంధాల ఒరవడిలో సుకుమారంగా రచించిన ప్రబంధం. నిర్వచన నియమంతో కూడిన రచన క్రీ.శ. 1907 నాటిది (శాలివాహనశకం 1829).
అవతారిక విశేషాలు : ఇష్టదేవతా స్తుతి, శంఖచక్రాది ఆయుధ వర్ణన, నిత్యసూరుల ఆచార్యుల స్తుతితో ప్రారంభమై పూర్వకవి స్తుతి కావ్యరచన ఉద్దేశంతో ముగిసింది. ఇష్టదేవతా స్తుతిలో వర్ణితమైన అంశాలను గమనించినపుడు పూర్వకవుల సంప్రదాయాన్ని అనుసరిస్తూనే విశిష్టాద్వైత ప్రాధాన్యాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది. కావ్యరచనకు ఎన్నుకున్న వస్తువు శృంగార ప్రధానమైనదైనా వ్యూహదేవతలలో ఒకడైన ప్రద్యుమ్న ప్రాభవాన్ని చెబుతుంది. ప్రపన్నజనసంఘం కోరికమేరకు కావ్యాన్ని రచించానని కవి చెప్పుకున్నారు. అదీగాక వ్యూహదేవతలలో ప్రద్యుమ్నుడు షట్ గుణాలలో ఐశ్వర్యవీర్య సమన్వితుడు, సృష్టికర్త, ధర్మపాలనలో ఆసక్తి కలవాడు. ఇది ఈ కావ్యరచనకు ఒక కారణం కావచ్చును.
”నిర్వచనముగా గలదిగ సర్వాలంకార రుచిర సంపదలెల్లన్
బర్విన కావ్యం బనగా నుర్విని రచియించు మనఘ యుత్తమ ఫణితిన్.”
అంకిత పద్యాలన్నీ గర్భ కవిత్వంలో చెప్పారు.
కథాసంగ్రహం : పోతన భాగవతంలో పది పద్యాలలోవున్న రచన వీరి కలంలో ప్రబంధంగా మారింది. రుక్మి కూతురు శుభాంగి, రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు. వీరిద్దరి మధ్య ఎరుకతె రాయబారం నడుపుతుంది. వారిద్దరిలో ప్రేమను వికసింపజేస్తుంది. జానపదుల కోరికమేరకు అడవికి వచ్చిన ప్రద్యుమ్నుడికి శుభాంగి కనిపిస్తుంది. దృక్సంగమం జరుగుతుంది. రుక్మి శుభాంగి స్వయంవరానికి ఏర్పాట్లు చేస్తాడు. అక్కడికి ప్రద్యుమ్నుడు వచ్చి రాజకుమారులను జయించి ఆమెను వరిస్తాడు. ద్వారకనుండి కృష్ణుడు, రుక్మిణి, సత్యభామాదులందరూ విదర్భకు వచ్చి శుభాంగీ ప్రద్యుమ్నుల వివాహం జరిపిస్తారు. కామకేళీ వర్ణనతో కావ్యం పూర్తవుతుంది.
కావ్యవిశేషాలు : ప్రక్రియాపరంగా ప్రబంధం, శృంగారరస ప్రబంధం. ప్రకృష్టమైన పదాల కూర్పు కలిగినది ప్రబంధం అని పెద్దల ఉవాచ. పరమపురుషుని పొగిడిన పదముల సమూహం కలది ప్రబంధంఅని మరో నిర్వచనం. ఈ రెండు నిర్వచనాలననుసరించి ఇది సుకుమార గుణం కలిగిన ప్రబంధం. ప్రబంధాలలో సాధారణంగా కనిపించే నగర, రాజ, నాయికా, నాయక, క్రీడా, వేట, సూర్యోదయ, చంద్రోదయ, యుద్ధాది వర్ణనలున్నాయి. కవికి ప్రాచీన సాహిత్యంపై గల అభినివేశం ఈ కావ్యంలో కనిపిస్తుంది.
దేశీయతా స్ఫూర్తి : నన్నయ కాలంనుంచీ కవిత్వం మార్గ, దేశీ సంప్రదాయాలలో నడుస్తుంది. చాలావరకు రచనలు మార్గపద్ధతిలో నడిచాయి. శివకవులు, తాళ్ళపాక కవులు, దక్షిణాంధ్ర యుగంలోని కవులు కొందరు దేశీ సంప్రదాయాన్ని అనుసరించారు. మార్గ పద్ధతి రచనలో దేశీయతను ప్రదర్శించే సందర్భాలు చాలా తక్కువ. ఠంయాలవారి ఈ రచనలో దేశీయతా స్ఫూర్తి కనిపిస్తుంది. నిజానికిది మార్గసంప్రదాయాన్ని అనుసరించిన రచన.
పింగళిసూరన రచించిన ప్రభావతీ ప్రద్యుమ్నం, పోతన రుక్మిణీ కళ్యాణం పోలికలు ఈ రచనలో ఉన్నాయి. ప్రభావతికి ప్రద్యుమ్నుడికి మధ్య ఒక పక్షి రాయబారాన్ని నెరపుతుంది. పక్షులు రాయబారాన్ని నెరపడం ప్రాచీన కావ్య వాఙ్మయంలో విస్తృతంగానే ఉంది. ఈ కావ్యంలో పక్షిని కాకుండా ఒక ‘ఎరుకతె’ను ఎన్నుకోవడంలో దేశీయ సంప్రదాయం కనిపిస్తుంది. నిత్యజన వ్యవహారంలో కనిపించే వ్యక్తులను ఎన్నుకోవడంలో ఈ స్ఫూర్తి కనిపిస్తుంది. నిజానికి కథ పౌరాణికమైనదే అయినా, తెలుగునేలకు మాత్రమే ప్రత్యేకమైన బావ-మరదళ్ళ వివాహాన్ని కథగా ఎన్నుకోవడంలో కూడా దేశీయస్ఫూర్తి ఉంది.ఎరుకతె శుభాంగి దగ్గరికి వచ్చిన తరువాత ఆమె తిరిగిన ప్రాంతాలు, క్షేత్రాలు తనకు తెలిసిన విద్యలు చెప్పడంలో కూడా ఠంయాలవారు దేశీయతను పాటించారు.
చం. ”స్ఫురదరుణాంశు లౌజడలు బొమ్మల సందునకాలి బొట్టు మ
మ్మరు జపమాల యున్మరుగు మందుల సంచియు సింగినాదము
న్గరమున నాగ బెత్తమును కాంతిల భూతి మెయిన్ధరించి యా
సరసిజనేత్ర చక్కటికి సయ్యన జోగి వెలంది వచ్చినన్|| (2-22)
అన్న పద్యం ఎరుకతె స్వరూపాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణిస్తుంది. ఎరుకతె తనకు వచ్చునని చెప్పిన విద్యల్లో చాలావరకు ఠంయాలవారికి పరిచయమున్నవే.
శుభాంగీ ప్రద్యుమ్నుల పెళ్ళి వర్ణన తెలుగింటి వైష్ణవ కుటుంబాలలో సర్వ సాధారణంగా కనిపించే పద్ధతిలో నడిచింది. పంచమాశ్వాసంలో 175-191 వరకున్న పద్యాలు పెండ్లిని వర్ణించేవి. జీలకర్రబెల్లం నెత్తిపై పెట్టడం, మంగళాష్టకాలు చదవడం, ఈ పెండ్లిలో చేసిన పిండివంటలు అన్నీ తెలుగునేలలో కనిపించేవే. మణుగులు, అఱిశెలు, గారెలు, బూరెలు, లడ్డులు, అప్పడాలు, పూర్ణాలు, కర్జలు మొదలైనవి ఈ పిండివంటల్లో ఉన్నాయి.
మార్గకావ్యాల్లో రగడల వంటి దేశీయ ప్రక్రియలు కనిపించడం చాలా అరుదు. ఈ కావ్యంలో ఠంయాలవారు రగడలు రచించారు. మూడవ ఆశ్వాసంలో సందర్భానుగుణంగా ద్విరదగతిరగడ, మధురగతిరగడలు రచించారు. మధురగతి రగడలో ఓమనగుంటలు, దాగులు మూతలు మొదలైన ఆటల వర్ణన చేశారు.
మొత్తంమీద ఈ కావ్యాన్ని గమనించిప్పుడు స్థూల దృష్టికి సాధారణ శృంగార ప్రబంధంగా కనిపించినా కవి సుకుమార పద్యరచనా విధానం, శైలీ మాధుర్యం, దేశీయతా స్ఫూర్తి కావ్యాన్ని సుకుమార ప్రబంధంగా తీర్చిదిద్దాయి. కథ, కథలో ఉన్న పాత్రలు, వర్ణనలు, రగడల రచన మార్గపద్ధతిలో సాగే రచనలకు భిన్నంగా దేశీయ స్ఫూర్తిని కలిగిస్తుంది. సంయోగ శృంగార వర్ణనలు చేసే సందర్భంలో అమలినతను పాటించడం సమకాలీన సాహిత్యస్థితిని ప్రతిబింబిస్తుంది.
బంధకవిత్వ ప్రాధాన్యం : ఆశ్వాసాంత గద్యలో ఠంయాలవారు ”చతుర్విధ కవితా ప్రబంధ నిర్మాణ చాతుర్య ఆంధ్రభాషా ప్రవీణ” అని చెప్పుకున్నారు. నిర్వచన శుభాంగీ కళ్యాణ ప్రబంధ పంచమాశ్వాసంలో 119 నుండి 164 వరకు గర్భ, చిత్ర, బంధ కవిత్వాలను రచించారు. ఈ తరహా కవిత్వం చెప్పడం ఒక పద్యవిద్యా సంప్రదాయం. కవికున్న బుద్ధికుశలత, పద్యంపై, భాషపై ఉన్న పట్టు తెలుస్తుంది. చక్ర, సర్ప, మత్స్య, కూర్మ, గోమూత్రికా, తరళహార, పుష్పగుచ్ఛ, పుష్పమాలికా బంధాలను రచించారు. రసభావ బంధుర ప్రధాన రచనలలో చిత్రకవిత్వం వ్రాయడానికి ఒక కారణాన్ని సంపత్కుమారగారు ఊహించారు.
”రస భావాది ప్రాధాన్యం గల కావ్యరచనల ఒత్తిడిలో మధ్యమధ్య విశ్రాంతి ప్రాయంగా సాగే చిత్రరచన వినోదరచన ఇది. పూర్వ సంస్కృతాంధ్ర కావ్య ప్రబంధాల్లో అక్కడక్కడి చిత్రకవితా రీతులను ఆయా కవులు ఉపయోగించారంటే అందుకు కారణం ఈ విశ్రాంతి జనకతా లక్షణమేననవలసి ఉంటుంది” అన్న కోవెల సంపత్కుమార మాటలు బంధ చిత్ర కవిత్వాలు కావ్యం మధ్యలో రావడానికి గల కారణాన్ని చెబుతున్నాయి. పాదగోపనం, నామగోపనం, నిరోష్ఠ్యం, ఒకే హల్లుతో పద్యం చెప్పడం, ఏక, ద్వి, త్రి వర్ణాలతో పద్యం చెప్పడం, అనులోమ విలోమ రచన గుణితం వంటివి ఒక వర్గం. ఒక పద్యంలో మరో పద్యాన్ని ఇమిడ్చి చెప్పడం ఇంకొక వర్గం. చక్ర, ఖడ్గాది చిత్రాలలో ఇమిడేట్లుగా పద్యం చెప్పడం మరొక వర్గం. ఈ మూడు పద్ధతులలోనూ నిర్వచన శుభాంగీ కళ్యాణంలోని పద్యాలు కనిపిస్తాయి.
ఈ బంధకవిత్వ రచన ద్వారా ఠంయాలవారి భాషా, ఛందస్సు, నిఘంటు పాండిత్యం, రచనాశక్తి, అభ్యాసగాఢత, విస్తృతి బోధపడతాయి. ఆశ్వాసాంత పద్యం వలన శ్రీకృష్ణ జన్మాష్టమికి కావ్యం ముగించాలన్న దీక్షతో కావ్యం రచించినట్లు తెలుస్తుంది.