– మామిడాల రాము
ఓ వైపు సిద్ధిపేట నియోజకవర్గం పరిధి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అంతగిరి రిజర్వాయరులో ముంపునకు గురయ్యే కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు సకల వసతులతో 250 గజాల స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మరో వైపు గజ్వేల్ నియోజకవర్గం పరిధి కొండపోచమ్మ రిజర్వాయరులో ముంపునకు గురయ్యే తానేదార్ పల్లి తండా వాసులకు అన్ని వసతులతో 250 గజాల స్థలంలో నిర్మించిన ఇళ్లు. రెండింటి గృహ ప్రవేశాలు సిద్ధిపేట జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగాయి.
చిన్నకోడూర్ మండలం కొచ్చగుట్టపల్లి గ్రామ భూ నిర్వాసితులకు తెలంగాణ సర్కారు సిద్ధిపేట మున్సిపాలిటీలోని లింగారెడ్డిపల్లిలో సకల వసతులతో పునరావాసం కల్పించి 130 ఇళ్లల్లో లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం మంత్రి హరీష్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డిలు సహపంక్తి భోజనాలు చేయడంతో నిర్వాసిత కుటుంబాలు సంబరపడ్డారు.
మరో వైపు ములుగు మండలం తునికి-బొల్లారంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డిలు కలిసి గృహ ప్రవేశాలు ప్రారంభించి 180 ఎకరాల్లో 600 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా తొలి విడత 84 ఇళ్లను తానేదార్‌పల్లి తండావాసులకు అప్పగించారు.
రిజర్వాయర్ల కింద తమ భూములను కోల్పోవడం బాధగా ఉన్నా మారుమూల గ్రామంలో ఉన్న తమకు సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో పునరావాసపురం నిర్మించి ఇవ్వడం పట్ల లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమైంది. ఊరుకు బదులుగా ఊరు ఇస్తదని భావించిన తమకు తమ కలలో కూడా ఊహించని రీతిలో ఇచ్చిన మాట ప్రకారం, తమకు దేవుడిలా అభయమిచ్చిన విధంగానే ముఖ్యమంత్రి ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 250 గజాల స్థలం కేటాయించి సకల వసతులతో తమ కోసం కొత్త ఊరు, కాలనీ కట్టి పక్కా ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మొన్నటి దాక జలాశయంలో మా ఊరు మునిగిపోతదనే భయంతో బతికాం. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన మాట, హామీ ప్రకారం అనుకున్న స్థాయిలో పరిహారం ప్యాకేజీ ఇచ్చిన దాఖలాలు లేవని మాలో ఒక అపనమ్మకంతో బతికాం. కానీ అంతగిరి రిజర్వాయరులో తమ గ్రామం ముంపునకు గురవుతున్నదని ఆందోళన చెందిన దశ దిశ లేని తమ జీవితాలకు.. మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. ఇవాళ ఎక్కడో పల్లె పక్కనే ఆర్ అండ్ ఆర్ కాలనీ ఉంటుందని భావించిన మాకు సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో మా కలల కూడ ఊహించని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించారు. దేశంలోనే ఏ సర్కారోళ్లు చేయని విధంగా మాలాంటి వాళ్ల కోసం తెలంగాణ సర్కారు దేవుడి రూపంలో వచ్చింది. పెంకుటిళ్లు, గుడిసె బదులు గూడునిచ్చిందని కొచ్చగుట్టపల్లి వాసుల నుంచి సంబరం వ్యక్తమైంది. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సార్లు సల్లంగా ఉండాలని నిర్వాసిత కుటుంబాలు దీవెనలిచ్చిండ్రు.
ఆత్మ గౌరవం పొందేలా సంప్రదాయంగా ప్రతి ఇంటా జరిగిన గృహ ప్రవేశాల్లో భాగంగా తమ కొత్త ఇంట గృహ ప్రవేశం చేసిన మంత్రి హరీష్ రావుకు ప్రతి ఇంటా ఆడపడుచులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ.. కుంకుమ తిలకం దిద్దుతూ.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా నిర్వాసిత కుటుంబ వాసులంతా ఆహ్వానించిన ఆ సన్నివేశం సంబరంగా జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటల నుంచి అరగంట వరకూ ప్రతి ఇంటికీ కొత్త ఇంట్లోని నిర్వాసిత కుటుంబ సభ్యులతో మమేకమై మాట్లాడుతూ.. ఎట్లా ఉంది కొత్త ఇళ్లు అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా మంత్రే నిర్వాసిత కుటుంబాలకు మిఠాయిలు తినిపించారు.
ప్రతి ఇంటా మామిడి తోరణాలు, బంతిపూలతో గృహలను అలకరించారు. లబ్ధిదారులతో ఆత్మీయంగా మంత్రి ముచ్చటించారు. లింగారెడ్డిపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నిర్మించిన 130 గృహాల్లోని లబ్ధిదారులు కుటుంబ సమేతంగా మంత్రి పర్యటనలో ఆద్యంతం ఉత్సాహంగా, అట్టహాసంగా ఉల్లాసంగా కనపడ్డారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలు సహపంక్తి భోజనాలు చేయడంతో భూ నిర్వాసిత కుటుంబ వాసులు సంబరపడ్డారు.
కొచ్చగుట్టపల్లి.. ఇక రంగనాయక పురం..!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది తొలి ఆర్ అండ్ ఆర్ కాలనీ అనీ, దేశంలోనే కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం కొత్త గ్రామంగా చరిత్రలో నిలిచిందన్నారు. 2013 – పునరావాస కేంద్ర చట్టం ప్రకారం పేదలకు (ఐఏవై- ఇందిరా ఆవాస్ యోజన) కింద 75 గజాల స్థలంలో లక్షా 25వేల రూపాయలతో ఇళ్లు కట్టించి ఇవ్వడం ఉండేదని., కానీ త్యాగం చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే 250 గజాల స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టివ్వాలని సీఏం కేసీఆర్ నిర్ణయించి అమలు చేయించారని వెల్లడించారు.
నిర్వాసితులను ఉద్దేశించి
మీ త్యాగం వెల కట్టలేనిదని.. అందరి కంటే ముందు సంతకం పెట్టి సహకరించారని, మీరు చేసిన త్యాగానికి సిద్ధిపేట పట్టణానికి సమీపంలో స్థలాన్ని వెతికి ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, పెద్ద మనస్సుతో సహకరించిన మీకు మేం ఎంత చేసిన తక్కువేనని మంత్రి హరీష్ చెప్పారు. కొచ్చగుట్టపల్లి ఇక.. కొత్తగుట్ట పల్లంటూ.. ఈ కొత్త కాలనీ ఇవాళ్టి నుంచి రంగనాయక పురంగా పిలుస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించుకుంటున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి రంగనాయక పురంగా నామకరణం చేసుకుంటున్నామని వెల్లడించారు.
నిర్వాసితుల త్యాగాలు వెలగట్టలేనివి
వారికి సంపూర్ణ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితులు అందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సిద్ధిపేట మున్సిపాలిటీ తరపున సీసీ కెమెరాలు, ఫంక్షన్ హాల్, పాఠశాలను తొందరలోనే పూర్తి చేయిస్తానని, వీటితోపాటు కాలనీలో అంగన్ వాడీ, మిల్క్ సెంటర్, దేవాలయం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతగిరి రిజర్వాయరులో చేపలు పట్టేందుకు భూ నిర్వాసితులందరికీ శాశ్వత హక్కులు కల్పించి ప్రతి యేటా నికర ఆదాయం వనరులు మీకు లభిస్తాయని చెప్పారు. అలాగే చెరువుల్లో చేపలు పట్టేందుకు కొచ్చగుట్టపల్లి గ్రామస్తులకు సర్వ హక్కులు కల్పిస్తామని హామీనిచ్చారు.ఈ అంతగిరి రిజర్వాయరు ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని., ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మేడ్చల్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఇదంతా మీ త్యాగ ఫలితం.., మీ మంచితనంతోనే సాధ్యమైందని రంగనాయక, అంతగిరి రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్ళు నిండే ఉంటాయని., చేపలు, రొయ్యలతో ప్రతి ఏటా నికర ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో ఏడాది కాలం పాటు నీళ్లు ఫుల్‌గా ఉంటాయని, యేడాదంతా ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణం పూర్తయ్యేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంతరం సమన్వయం చేసుకుని అన్ని వసతులతో కూడిన కాలనీ నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బర్ల మల్లిఖార్జున్, నాయకులు రామస్వామి, బాలయ్యలు ఈ కాలనీకి ప్రతిరోజు వచ్చి బాగోగులు చూడాలని కోరారు. ఊరుకు.. ఊరే మారిందని.. ఇవాళ ఈ ఊరుకు రంగనాయకపురంగా నామకరణం చేసుకున్నట్లు తెలిపారు.
సీఏం కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ అంటూ.. అందు కోసమే రిజర్వాయర్లకు.. ప్రాజెక్టులకు దేవుళ్లు, దేవతల పేర్లు పెట్టుకున్నామని వివరించారు. దైవ కపతో అన్ని అడ్డంకులు దాటుకుంటూ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాం. దేవుడి కపతో వరంగల్ జిల్లాకు తొలి ఫలితం వచ్చిందని, త్వరలోనే అంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయని., రెండు పంటలు పండే కాలం త్వరలోనే ఉన్నదని, నల్గొండ జిల్లాలోని చిట్ట చివరి చెరువు నింపుతామని తెలిపారు.
ఇది రైతు ప్రభుత్వంగా కల నిజమైందని, కాళేశ్వరం ప్రాజెక్టులోని బాహుబలి పంపుగా పేరు పెట్టిన 7 పంపులు విజయవంతమయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేట ప్రాంతానికి ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయని., ఈ రంగనాయక పురంలో చదువుకున్న వారు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. భూ నిర్వాసితులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమపై ఉందని., ఊరుకు ఊరును రూపొందించాం.. అన్ని వసతులను ఇక్కడ కల్పించామని, ఎక్కడా రాజీ లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో సింగూరు ప్రాజెక్టు నిర్వాసితులు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని., కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా భూ నిర్వాసితులకు న్యాయం చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు కోర్టుకు పోకుండా సహకరించి ముందుకు వచ్చినందుకు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. కొచ్చగుట్టపల్లి గ్రామస్తులకు మంచి కాలనీ నిర్మించి ఇచ్చామని., ప్రజా ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాల కోసం త్యాగం చేయాల్సి వస్తుందని, గ్రామస్తులకు చెబితే ఒప్పుకుని ముందుకొచ్చారని వారికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని వసతులతో కాలనీ నిర్మాణం చేపట్టి ఇవాళ పండుగ వాతావరణంలో గహ ప్రవేశాలు జరుపుకున్నామని తెలిపారు.
మీరు చేసిన త్యాగం చిన్నది కాదని, మీ త్యాగ ఫలితమే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణం జరిపి ఇవాళ గృహ ప్రవేశాలు చేసుకుని సంబరంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు. రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్ధిపేట జిల్లాకు ప్రత్యేకత ఉందని., వచ్చే 3, 4 నెలల్లో జిల్లాలోని ముంపునకు గురయ్యే గ్రామాలన్నీ ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. కాలనీ నిర్మాణంలో భాగంగా ఆరోగ్యం, విద్య, జీవనోపాధి ఎంపిక చేసుకోవాల్సిన ఉపాధి మీకు కావాల్సి ఉంటుందని, మంత్రి హరీష్ రావు చొరవతో యువత, కుటుంబాలకు ఉపాధి కల్పన అవకాశాలు కూడా వస్తాయని విశ్వాసంతో ఉండాలని నిర్వాసితులను కలెక్టర్ కోరారు.
కొత్త ఇండ్లకు వచ్చినం.. సంబరంగా ఉంది
మా ఆయన నర్సయ్య దుబాయ్‌లో ఉంటూ మమ్మల్ని చూసుకుంటుండు. మాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ సరిత డిగ్రీ, కొడుకు సిధార్థ 3వ తరగతి చదువుతుండ్రు. మా ఊరు మునిగిపోతదని మమ్మల్ని ఏవరూ పట్టించుకోరని అనుకున్నం. మా ఊరికి ఇచ్చిన మాట ప్రకారం సీఏం కేసీఆర్ సారూ, మంత్రి హరీష్ రావు సార్లు మమ్మల్ని మంచిగ ఆదుకున్నరు. కొత్త ఇండ్లకు వచ్చినందుకు మస్తు సంబరంగా ఉంది. వారి బంధు బలగంతో కలిసి కొత్త ఇంట్లో దేవుడికి లగ్గం చేస్తూ తాడూరి లక్ష్మి చెప్పింది.
తాడూరి లక్ష్మీ-నర్సయ్య
కేసీఆర్ సార్ అంటే నమ్మకం..
నాకు కొచ్చగుట్టపల్లిలో 3 ఏకరాల పొలం ఉంది. ఎవుసం చేసుకుంట కూరగాయల పంటలు, వరి పండిస్త. నాకొక బిడ్డ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వేరే సర్కారోళ్లు ఉంటే అయ్యే పని కాదు. మాకు సీఏం కేసీఆర్ సార్ అంటే ఒక గట్టి నమ్మకం. మా ఊరు దూరాన్ని వదిలిపెట్టి వచ్చినా నలుగురి కోసం మంచిపని చేసి నీళ్లు ఇస్తున్నమని సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట లెక్క మీద ఉండి.., హరీష్ రావు సారూ ఇంత తొందరగా పని చేసి మమ్మల్ని ఇండ్లకు తోలిండు. ఇయ్యాల మా కుటుంబ సభ్యులమంతా మా మొత్తం బలగం 50 మందితో కొత్త ఇంట్ల పండుగ చేసుకుంట సంతోషంగా ఉన్నాం. మన తెలంగాణ సర్కారు, కేసీఆర్, హరీష్ రావు సార్లు సల్లంగా ఉండాలేనని దేవుణ్ణి కోరుతున్న.
బండి లక్ష్మి- దేవయ్య
గింత సక్కగా ఇళ్లు కట్టిత్తరని తెల్వదు
మేం కూలీ పని చేసుకుని బతుకుతున్నాం. మాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలలో ఒకరు డిగ్రీ, ఇంటర్మీడియట్, కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. గవర్నమెంటోళ్ళు గింత సక్కగా ఇళ్లు కట్టిత్తరని మేం ఎన్నడూ సూడలే. ఇన్నేండ్లు గూన పెంకల ఇంట్లో ఉండి పిల్లలతో మస్తుగ ఇబ్బందులు పడ్డం. మా కొచ్చగుట్టపల్లి ఊరు నీళ్లలో మునిగిపోతదని ఊరు ఖాళీ చేయాలని చెబితే.. బతుకుదెరువు ఎట్లా అని మస్తుగ కుమిలిపోయినం. దేవుడోలే హరీష్ రావు వచ్చి మీరేం రంధి పడొద్దని సీఏం కేసీఆర్ సారూ చెప్పిండని మీకు అన్ని సౌలత్‌లతోటి మంచిగ ఇళ్లు కట్టిస్తమని చెప్పిండు. చెప్పినట్లుగానే హరీశ్ రావు సారు పుణ్యమా అని మాకు మంచి ఇళ్లు కట్టించిండ్రు. కూలీ పని చేస్కొని బతికేటోల్లం అంటూ.. కొత్తింట్ల తన బిడ్డలతో కలిసి పొయ్యి మీద పాలు పొంగించింది. ఇగ మాకు, మా పిల్లలకు బతుకుదెరువు కోసం ఏదైనా చూడాలని కేసీఆర్ సారూ, హరీష్ రావు సార్లను కోరుతున్నాం.
లక్కె వెంకయ్య-శంకరవ్వ
దేశంలోనే ఆదర్శం..!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొండ పోచమ్మ జలాశయంలో ముంపునకు గురవుతున్న గజ్వేల్ నియోజక వర్గం పరిధిలోని జగదేవ్‌పూర్ మండలం తానేదార్‌పల్లి తండా భూ నిర్వాసితులకు తెలంగాణ సర్కారు ములుగు మండలం తునికి-బొల్లారంలో సకల వసతులతో పునరావాసం కల్పించిందని నిర్వాసిత కుటుంబాలు పరవశించి పోయాయి. ఈ నేపథ్యంలో ములుగు మండలం తునికి-బొల్లారంలో 1800 ముంపు కుటుంబాల కోసం దేశంలోనే అతి పెద్ద ఆర్‌అండ్ ఆర్ కాలనీ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ఆర్‌అండ్ ఆర్ కాలనీలో నిర్మించిన తానేదార్‌పల్లి గ్రామ తండా భూ నిర్వాసితులు 80 మంది సామూహికంగా గహ ప్రవేశాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, అటవీ అభివద్ధి సంస్థ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ లతో కలిసి గహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
2013 చట్టం కన్నా మెరుగైన ప్యాకేజీని భూ నిర్వాసితులకు సీఏం కేసీఆర్ అందిస్తున్నారని, నిర్వాసితులపై సీఏంకు ప్రత్యేక గౌరవం ఉన్నదని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి చెప్పారు. జిల్లాలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నదని, భూ సేకరణ, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచామని కలెక్టర్ పేర్కొన్నారు. మిడ్ మానేరు నుంచి త్వరలోనే కొండ పోచమ్మకు నీళ్లు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. నిర్వాసితులకు సీఏం కేసీఆర్ మంచి ప్యాకేజీ అందించడంతో పాటు 250 గజాల స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలోనే ఏక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మించి ఇస్తున్నామని, ఈ కాలనీలో అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. భూ నిర్వాసితులు చేసిన త్యాగాలు సీఏం కేసీఆర్ మర్చిపోలేదని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఏం సూచించారని, బైలాంపూర్, మామిడ్యాల, తానేదార్ పల్లి గ్రామాల ప్రజలు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఇండ్లను తీసుకుని, గ్రామాలను వీలైనంత తొందరగా ఖాళీ చేయాలని., ఈ ప్లాట్లు అత్యంత ఖరీదుగా మారుతాయని, ఎవరూ ఈ ప్లాట్లను అమ్ముకోవద్దని కోరారు. త్వరలోనే అచ్చాయపల్లి, తునికి-బొల్లారం శివారులో ఉన్న 600 ఎకరాల ప్రభుత్వ భూమిలో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
అనంతరం అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రముఖ ప్రజా ప్రతినిధులు, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.