ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కలలు కన్నటువంటి బంగారు తెలంగాణ సాకారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కృషి చేస్తున్నది. కొత్త రాష్ట్రం ప్రధానంగా దృష్టి సారించిన అంశాల్లో నీటి పారుదల రంగం ఒకటి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ నీటిపారుదల రంగాన్ని సరిచేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మన ప్రభుత్వ మొదటి ప్రాధమ్యాలు: నదీజలాలలో మన న్యాయమైన వాటా సాధించుకోవడం, ఆ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, చెరువుల వ్యవస్థను పునరుజ్జీవింపజేసుకోవడం. రాబోయే ఐదేండ్లలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం. ఈ దిశగా ప్రభుత్వం గత సంవత్సరకాలంలో తీసుకున్న కార్యాచరణను క్లుప్తంగా పరిశీలిద్దాం.
నదీజలాలలో మన న్యాయమైన వాటా
మన రాష్ట్రం అంతా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోనే వుంది. కృష్ణా నదీజలాలపై బచావత్ ట్రిబ్యునల్, ఆ తరువాత ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన పంపకాలలో తెలంగాణకు నీటివాటా న్యాయబధ్ధంగా లభించలేదు. సమైక్య ప్రభుత్వాలు ట్రిబ్యునళ్ళ ఎదుట సమర్థవంతంగా వాదించనందువల్లే మనకీ దుర్గతి పట్టిందని, ట్రిబ్యునళ్ళ ఎదుటకూడా మన వాదనను వినిపించే అవకాశం కలగలేదు కనుక కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు – అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య పంపిణీ చేయాని మన ప్రభుత్వం గత జులైలోనే కేంద్ర ప్రభుత్వానికి అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం, సెక్షన్ (3) ప్రకారం ఫిర్యాదు చేసింది. మన ఫిర్యాదు కేంద్ర పరిశీలనలో ఉంది. త్వరలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయడం కానీ లేక ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్తీకరణ చట్టం, 2013 ప్రకారం మరో రెండేళ్ళు పదవీకాలాన్ని పొడిగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు మన ఫిర్యాదు పరిశీలించమని కేంద్రం కోరే అవకాశం ఉంది.
బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపైన ప్రస్తుతం సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది – ఈ తీర్పు అమలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ తో పాటు మన ప్రభుత్వం కూడా అప్పీల్ చేయడం జరిగింది. తొలుత తెలంగాణ ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చుకోవాలా వద్దా అనే అంశంపైన ఇతర రాష్ట్రాల వాదనలు విన్నాక మనల్నికూడా చేర్చుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడటం శుభపరిణామం – సుప్రీంకోర్టు తీర్పు త్వరలో రావొచ్చు.
మరో రెండేళ్ళు పదవీకాలం పొడిగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ పరిధి నాలుగు రాష్ట్రాల మధ్య అని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు, తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్యనే అని మహారాష్ట్ర, కర్ణాటకలు వాదిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణకు సంక్రమించిన నీటిని కాపాడుకోవడం, గతంలో జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టి మరింత వాటా సంపాదించేందుకోసం విశేషమైన కృషి చేస్తోంది ఈ ప్రభుత్వం.
మన వాదనను బలంగా సుప్రీం కోర్టులో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వినిపించడంకోసం మన ప్రభుత్వం సమర్థులైన అడ్వొకేట్ వైద్యనాథన్‌ని, వారివాదనకు మద్దతుగా సాంకేతికంగా అవసరమైన నివేదికలు అందించేందుకు అనుభవజ్ణులైన ఐ.ఐ.టి. ప్రొఫెసర్లు డా. సుభాష్ చందర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీ, ఢల్లీి మరియు డా. మోహన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీ, చెన్నయిలను నియమించడం జరిగింది.
ఇదిలా ఉండగా కొత్త చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నీటి సమస్యను పరిష్కరించే నిమిత్తం కృష్ణ, గోదావరి నీటి యాజమాన్య మండళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది – అయితే విచిత్రం ఏమంటే ట్రిబ్యునళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారమే ప్రాజెక్టుకు నీటిని పంచాల్సిన బాధ్యత ఈ బోర్డుకుందిగానీ స్వతంత్రంగా నీటి పంపకం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు.
కృష్ణా నదీ మేనేజ్ మెంట్ బోర్డు:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినట్లుగానే కృష్ణా నది నీటిని సీమాంధ్ర తరలించుకుపోయే ప్రయత్నాలను అడ్డుకొని తెలంగాణ వాటాను సాధించుకున్నాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, 2014 సెక్షన్ 85 ప్రకారం ఏర్పాటైన కృష్ణా నది మేనేజ్ మెంట్ బోర్డు తన పరిధిని దాటి నీళ్ళ పంపకాలు చేయడానికి పూనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా తన వాదనలు వినిపించి ఏకపక్షంగా ఆంధ్ర పక్షపాతంగా సాగుతున్న నిర్ణయాలను మార్చి తెలంగాణకు న్యాయం జరిగేటట్లు చేసింది. శ్రీశైలం నుండి రాయసీమలోని అక్రమ ప్రాజెక్టులకు నీటి తరలింపును అడ్డుకుంది తెలంగాణ ప్రభుత్వం. శ్రీశైంలో +854 లెవెల్ వరకు మాత్రమే వాడాలన్న వాదనను త్రిప్పికొట్టి, +834 అంతకు తక్కువ లెవెల్ వరకు నీటిని విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకుని బోర్లపై ఆధారపడ్డ తెలంగాణ రైతులను ఆదుకునే వెసులబాటు తెలంగాణకు ఉంది అన్న విషయాన్ని ప్రభుత్వం బోర్డుకు స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు ట్రిబ్యునల్ ఆదేశాలకు భిన్నంగా ఇంతకు ముందువలే నాగార్జునసాగర్ నుండి అక్రమంగా నీటిని విడుదల చేయకుండా ఆపివేసింది. తమ వాటాకు వచ్చిన నీటిని ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ తనకుందని మన ప్రభుత్వం స్పష్టం చేసింది – ఆంధ్రా పాలకుల అభ్యంతరాలను ప్రక్కన బెట్టి మన వాటా నీటిని మనం సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రెండో పంటకు కొంతమేరకు ఇచ్చుకోగలిగాం.
కేంద్ర జవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2015-16 సంవత్సరానికి కృష్ణా నదీ జలాల వాటా విషయంలో ఉభయ రాష్ట్రాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. సమర్థవంతంగా వాదించిన మన ప్రభుత్వం మన రాష్ట్రానికి కేటాయించబడ్డ నీళ్ళు బచావత్ ఉత్తర్వు ప్రకారం ఎన్‌బ్లాక్ (గంపగుత్తగా) ఇవ్వబడ్డాయన్న విషయాన్ని ఒప్పించి చారిత్రక విజయం సాధించింది. మనకు కేటాయించబడ్డ నీటిని ఆదే ప్రాజెక్టులో కాకుండా ఎక్కడైనా వాడుకునే వెసులుబాటును సాధించుకుంది. అంటే భీమా లాంటి ప్రాజెక్టుల్లో మనం పూర్తిగా 20టీఎంసీల నీటిని ఉపయోగించుకునే పరిస్థితిలేదు కాబట్టి వేరొకచోట తెలంగాణలో వాడుకునే వెసులుబాటు లభించింది.
మనం సాధించిన మరొక విజయం – ఈ ఒప్పందం కేవలం ఈ సంవత్సరానికే వర్తిస్తుంది అన్న అంశం. మనకు కొత్త ప్రాజెక్టులు కట్టడం, చెరువుల పునరుధ్ధరణ ఇంకా పూర్తికాలేదు కాబట్టి వచ్చే సంవత్సరానికో, ఆపై సంవత్సరానికో తిరిగి అవి పూర్తయి ఆనాటి పరిస్తితులనుబట్టి కేటాయింపు ఒప్పందం చేసుకొనే వెసులుబాటు లభించింది. అట్లాగే ఈ ఒప్పందం కేవలం తాత్కాలికమైనదే అనడం వల్ల ట్రిబ్యూనళ్ళ ముందు ఈ ఒప్పందపు అంశాలు వాదప్రతివాదాలకు ఆధారాలుగా నిలువవు.
బోర్డు ఇప్పడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే నిర్వహించాలి కాబట్టి, దాని ఆధారంగా ఇప్పటికే తయారుచేయబడిన వాటా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అంగీకరించబడిరది. ఆ పైన (811 కంటే ఎక్కువగా) వచ్చే నీటిని కూడా అదే నిష్పత్తిలో పంచుకోవాలి. మనకు నేడు కావలిసినంత నిలువ సామర్థ్యం లేకపోవడం దీనికి కారణం. అయితే ఈ ఒప్పందం తాత్కాలికం మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.
సీలేరు ప్రాజెక్టుపై తమకే హక్కు ఉందన్న ఆంధ్ర ప్రదేశ్ వాదన తప్పని, విభజన చట్టం ప్రకారం తమకు కూడా అందులో భాగస్వామ్యం ఉండాలని గోదావరి నది మేనేజ్‌మెంట్ బోర్డు ముందు ఏకరువు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
మిషన్ కాకతీయ:
చెరువులు, కుంటలు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. వాటి నిర్మాణం కాకతీయు కాలం నాటినుండే జరిగింది. కొనసాగింపుగా, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ పాలకులు కూడా ఎన్నో చెరువులు నిర్మించారు, పాతచెరువులను కాపాడారు. వాటి నిర్వహణకు ఒక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామాల్లోని సంకట పరిస్థితులకు చాలావరకు పరిష్కారం ఈ చెరువు పునరుధ్ధరణ వల్ల జరుగుతుంది. అందువల్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువుల పునరుధ్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం చిన్న నీటిపారుదల వనరుల పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం అనే ఒక బృహత్తర కార్యక్రమం మిషన్ కాకతీయ అనే పేరు మీద మన ఊరు-మన చెరువు అనే నినాదంతో, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా గోదావరి నదుల్లో చిన్న నీటిపారుదల రంగంలో కేటాయించబడ్డ 265టీఎంసీలను నిలువచేసేందుకు చేపట్టటం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల గణనను జులై 2014లో చేపట్టారు – చిన్న నీటిపారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న చెరువు, పంచాయత్ రాజ్ శాఖ నిర్మించి తరువాత నీటిపారుదల శాఖకు