rain– తైదల అంజయ్య

వానకు దోసిళ్లు వట్టాలె మన వాగు వంకలు పొంగి పొర్లాలె

ఊరూరి సెరువులు నిండాలె అవి ఊట సెలిమెలయ్యి ఊరాలె ||వానకు||

గొలుసు సెరువులన్ని కలిసిమెలిసి యింక వొడువని ముచ్చట్లు వెట్టాలె

మొదలు దుంకె మడిల నీటి సప్పుళ్లతో ఎదలు నిండె పాట పాడాలె

సెప్పక సెయ్యక వచ్చిన కప్పలు వానరాగమెత్తుకోవాలె

దరువాజకెదురుంగ వరి గొలుసుల మీద ఊరవిశ్కలు ఊగులాడాలె

పిరికిగా ఉరికేటి నీరు గడ్డలన్ని నీటిమీద నాట్యమాడాలె

ఎన్నీలగురిసేటి సెరవు నీళ్లలోన సందమామలు సెంగలియ్యాలె ||వానకు||

మునిగి తేలుతున్న బుడువుంగలను విలిసి సిట్టిసేతులు పడవలెయ్యాలె

నాసుల దాగున్న కొర్రమట్టల జూసి పోరగాండ్లు గాలమెయ్యాలె

పిట్టగూళ్లముందు బొమ్మరిండ్లుగట్టి బువ్వ కూరలొండుకోవాలె

నల్లరేగడి మన్ను మెత్తటిసేతుల్ల కొత్త బొమ్మల కొలువుజెయ్యాలె

తీర్థములగొన్న సిలుక బొమ్మనింక సీకట్లనే మురిసిపోవాలె

గునగున నడిసేటి బాలవీరులంత గాలిమోటరెక్కి పోవాలె ||వానకు||

పొలిమేరల వున్న పోశవ్వతల్లికి సాకవోసి మొక్కిరావాలె

కష్టాలు దీర్చేటి కట్టమైసమ్మకు కొత్తవడ్ల బోనమొండాలె

కమ్మంగ ఉడికేటి బొమ్మెశాపల కూర వాసన వాడంత గమ్మాలె

గలగల పొంగేటి గుండె తలుపులు దెరిసి అలుగులు ఎగజిమ్మిపారాలె

పారేటి నీళ్లల్ల తుంగమొలుకమీద శెనిగెపిట్ట ఊగిపోవాలె

తుమ్మగజ్జెలు గట్టి సెరువు కట్టమీద సెమ్మసెక్కలాట లాడాలె ||వానకు||

ఒడ్డున నిలుసుండి గుడ్డితౌసుజేసె కొంగ బావ కడుపు నిండాలె

నల్ల తుమ్మమీద తియ్యటి కలగన్న తీతువు పిట్టేదొ కుయ్యాలె

కాయకష్టంజేసె కూలి తల్లులకు కలల పంటలెన్నో పండాలె

జమ్మి కొమ్మమీద కూసుండి సూసేటి పాలపిట్ట మురిసిపోవాలె

బిగిబిగి గూడులో గజిబిజిగా ఉన్న గిజిగాడు ఉయ్యాల లూగాలె

సెక్కున్న మెరిసేటి సెరువునీటిలోన మొగులు మొకము జూసుకోవాలె ||వానకు||

పొద్దున్న వొడిసేటి సూర్యుడు నీళ్లల్ల కుంకుమ్మ తానాలు జెయ్యాలె

జలజల జారేటి పొర్లు మత్తళ్లన్ని జలతారు మెరుపులు మెరువాలె

తళతళ మెరిసేటి నీటి పడవవోలె పల్లె బతుకు సాగిపోవాలె

నిండిన సెరువుల్ల పూలతెట్టెమీద బంగారి బతుకమ్మ తేలాలె

కంటనీరులేక యింటింటి కండ్లన్ని కలువరేకులయ్యి విరియాలె

అద్దమోలె వున్న సెరువు సెంపమీద సుక్కలు ముగ్గులు పెట్టాలె ||వానకు||

ఎండకు వానకు కాకిలగ్గమయ్యి తూరుపున సింగిడివొడువాలె

తీరొక్క దినుసుల్ల తీరిక లేకుంట పునాస పంటలు పండాలె

కట్ట కానుగుసెట్టు కష్టజీవులకు ఇసనకర్రలై వూపాలె

లొట్టిమీద కాకి సెట్టు కల్లుదాగి జానపదములెన్నొ పాడాలె

ఎటువడితె అటునడిసె ఎండ్రికాయలు గలిసి దొంగకొంగల మెడలు గొరుకాలె

పూడికదీసిన సెరువు కుంటలల్ల కరువునంతా పాతిపెట్టాలె ||వానకు||

Other Updates