ఎం. దానకిషోర్ , ఐఏఎస్
నిత్య జీవితంలో నీరు లేనిదే జీవితమే లేదు. నీరే మనిషికి ప్రాణాధారం. నీటి ప్రాధాన్యత, అవసరం మనకు తెలియంది కాదు. ఒక్కరోజు నల్లాలు రాకపోతే గగ్గోలు పెడుతుంటాం. వాటర్ టాంకర్ రావడం కొంచెం ఆలస్యమైతే భరించలేం. అసలు నీరే లేకపోతే జీవితాన్ని ఊహించలేం. అందుకే ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. కానీ, అంతటి ముఖ్యమైన, ప్రాణప్రదమైన నీటిని మనం ఎలా వినియోగిస్తున్నామో, ఎంతనీటిని వృధా చేస్తున్నామో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేడు మనం వృధాచేసే ప్రతి నీటిబొట్టు ప్రభావం భావితరాలపై ఎంత ఉంటుందో తెలిస్తే ఎవరూ నీటి వృధాకు పాల్పడరు.
హైదరాబాద్ జలమండలి రోజుకు సుమారు ఒక కోటి మందికి సరిపోయే 460 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని 200 కిలోమీటర్ల దూరంలోవున్న కృష్ణా, గోదావరి నదుల నుండి లిఫ్టింగ్ చేస్తూ తీసుకుని వస్తున్నది. ఇందుకు ప్రతి నెల సుమారు రూ. 80 కోట్లు విద్యుత్ ఖర్చుల కోసం వ్యయం చేయాల్సి ఉంటుంది. ఒక వెయ్యి లీటర్ల నీటికోసం జలమండలికి 45 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం బస్తీల్లోని ప్రజలకు కేవలం 7 రూపాయలు, ఇతరులకు 10 రూపాయలకు నీటిని సరఫరా చేస్తున్నది . ఒక అంచనా ప్రకారం 460 మిలియన్ గ్యాలన్ల మంచి నీటిలో 50 మిలియన్ గ్యాలన్ల మంచినీరు వృధాగా పోతున్నది. పైపులు, వాల్వులు లీకేజీలకన్నా ఎక్కువ నీటి వృధా వినియోగదారుల ఇళ్లల్లో జరుగుతున్నట్లు సర్వేలో తేలింది. ట్యాంకర్లు, పబ్లిక్ నల్లాల ద్వారా నీరు అధికంగా వృధా అవుతున్నది. పైపులతో ఇంటి ఆవరణలు కడగడం, సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకర్లు నిండిపోయి నీళ్లు వృధాగా పోవడం, నీటి కుళాయిల కింద బట్టలు ఉతకడం, రన్నింగ్ టాప్స్ ద్వారా బ్రషింగ్, షేవింగ్, మొక్కలకు, గార్డెనింగ్ కు మంచినీటిని వాడటం, మోటార్ల ద్వారా మంచినీటిని లాగడం, స్నానానికి షవర్ బాత్ వాడటం, లీకేజీలున్న పైపులకు, నల్లాలకు మరమ్మతులు చేయించకపోవడం, వాహనాలు కడగడం, భవనాల క్యూరింగ్ కోసం నీటిని వృధా చేయడం వలన లక్షలాది మందికి అవసరమ్యే నీరు రోడ్లపై వృధాగా పోతున్నది.
దీనివల్ల నీరు వృధా అవడంతోపాటు రహదారులు పాడవుతున్నాయి. అంటురోగాలు ప్రబలుతున్నాయి. నగరంలో వృధా అవుతున్న మంచినీరు సుమారు ఎనిమిది నుండి పది లక్షల మంది అవసరాలు తీరుస్తుంది. మనం వృధా చేస్తున్న నీరు ఇటీవల చెన్నయ్ నగరంలో సరఫరా చేస్తున్న నీటికి సమానం. ఈ నీటి వృధా ను తగ్గించడం కోసమే ‘వాక్’ (ఔa్‌వతీ శ్రీవaసవతీరష్ట్రఱజూ aఅస జశీఅరవతీఙa్‌ఱశీఅ) అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ జలమండలి ప్రారంభించింది. మార్చి 22, 2019 ప్రపంచ నీటి దినోత్సవం నుండి హైదరాబాద్ జలమండలి ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. వాక్ అంటే జల నాయకత్వానికి ఒక కొత్త పేరు… జల సంరక్షణ కోసం ఒక కొత్త నాయకత్వం .. హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి నీటి సద్వినియోగంపై చేస్తున్న ప్రచారం వలన సుమారు ఒక లక్ష మందికి సరిపడే 1 నుండి 2 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని అదా చేయగలిగింది. ఇది నిజం. వృధాగా పోతున్న మరో 40 మిలియన్ గ్యాలన్ల నీటిని ఆదా చేసుకుంటేగానీ హైదరాబాద్ నగరానికి సరఫరా చేస్తున్న నీటికి లెక్క సరిగ్గా సరిపోతుంది. ఈ నీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయలు. నీటి వృధాను అరికట్టాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.
నిజానికి, హైదరాబాద్ నగరానికి నీటి కొరత లేదు. భవిష్యత్‌లో కూడా హైదరాబాద్ నగరం వాటర్ సెక్యూర్డ్ సిటీగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం. మిగతా నగరాలతో పోల్చుకుంటే ఈ నగరానికి గోదావరి, కృష్ణా నదులు రెండూ అండగా వున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, 10 టీఎంసీలతో నిర్మించే కేశవపూర్ రిజర్వాయర్‌లు నగరానికి అండగా
ఉంటాయి. మరో 10 టీఎంసీల కృష్ణా నది నీటితో నిర్మించే దేవలమ్మనగరం రిజర్వాయర్ కూడా అందుబాటులో ఉంటుంది. మరో అద్భుతమైన ప్రణాళిక ”రింగ్ మెయిన్” ప్రణాళిక. గోదావరి, కృష్ణా నదుల నీరు ఎప్పుడూ అందుబాటులో వుండే విధంగా నగరం చుట్టూ సుమారు 4725 కోట్ల రూపాయలతో 158 కిలోమీటర్ల ఔటర్ చుట్టూ 3600 ఎం.ఎం డయా
సామర్ధ్యంతో భారీ రింగ్ మెయిన్ పైప్ లైన్, 12 మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో నిర్మించే రింగ్ మెయిన్ వలన ఈ రెండు నదుల నీరు అత్యవసర పరిస్థితిలో ఆదుకుంటుంది. ఈ రింగ్ మెయిన్ వలన నగరానికి ఎటువైపు నుంచైనా నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. పైపులైన్లకు మరమ్మతులు ఏర్పడినా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా నగర నీటి సరఫరా ఆగిపోకుండా వుండే విధంగా అద్భుతమైన ప్రణాళికతో రూపొందించిన రింగ్ మెయిన్ వలన నగర నీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ విజన్, మిషన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మాజీ మంత్రి కేటీఆర్‌కి దక్కుతుంది.
ముందుకు వస్తున్న వాలంటీర్లు
ప్రస్తుతానికి హైదరాబాద్ నగరానికి వచ్చిన ముప్పేమీ లేకున్నప్పటికీ నీళ్లు ఫుల్లుగా ఉన్నాయని నీటిని వృధా చేయడం మంచిది కాదు. అందుకే ‘వాక్” కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వాక్ అంటే జల నాయకత్వం. వాక్ లో రిజిస్టర్ చేసుకున్నవారంతా జల నాయకులే. వాక్ యాప్ లో ఆరు వేల మంది తాము నీటి వృధాను అరికట్టడం కోసం వాలంటీర్లుగా పనిచేస్తామని రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో విద్యార్థులున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలున్నాయి. స్వచ్చంద సంఘాలున్నాయి. ఎన్.ఎస్.ఎస్, లయన్స్, రోటరీ, ఇన్నర్ వీల్ సంఘ సభ్యులు, కార్పొరేట్ సంస్థల సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులున్నారు, సీనియర్ సిటిజెన్‌లు ఉన్నారు. వీరందరికీ విడతల వారీగా వాక్ ఆశయాలని శిక్షణ ద్వారా హైదరాబాద్ జలమండలి తెలియ చేస్తున్నది.
స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా జి.హెచ్.ఎం.సి సాఫ్ హైదరాబాద్ షాందార్ హైదరాబాద్ అమలవుతున్న ప్రాంతాల్లో వాక్ కార్యక్రమం కూడా తీసుకోవడం వలన జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమీషనర్లు, హైదరాబాద్ జలమండలి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు అందరూ కూడా వాక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజుకు వృధా అవుతున్న సుమారు 50 మిలియన్ గ్యాలన్ల మంచినీటి పొదుపుపై ప్రతిరోజూ ర్యాలీలు, సమావేశాలు, వీధుల్లో నీరు వృధాగా పోతున్న పరిసరాలను గమనించి వారికి ఒకటి రెండు సార్లు మర్యాదగా చెప్పడం, లేదంటే చలాన్లు విధించడం జరుగుతున్నది. 47 వేల పట్టణ స్వయం సంఘాల్లో సభ్యులుగా వున్న సుమారు నాలుగు లక్షల 70 వేలమంది మహిళలకు నీటి పొదుపుపై, నీటి ఆదాపై శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరిలో ఆయా సభ్యుల టీమ్ లీడర్లకు నీటి పొదుపు, నీటి వృధాను తగ్గించడంలో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. జలమండలి మేనేజర్లకు, లైన్ మేన్స్‌కు, స్లమ్ లెవెల్ ఫెడరేషన్ లీడర్లకు, డీపీవోలకు, ఎన్జీవో, సిఆర్పీ లకు కూడా నీటి వృధాను తగ్గించడంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.
దేశంలోని నగరాలలో నీటి కొరత
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారంగా చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 2020 నాటికి నీటి కరవు ఉంటుందని హెచ్చరికలు వచ్చాయి. ఈ ప్రభావం ప్రస్తుతం చెన్నయ్ నగరంలో ఏర్పడింది. ఒక్క బిందెడు నీళ్లకోసం కిలోమీటర్ల దూరం వరకు లైన్ కట్టడం సోషల్ మీడియాలో అందరూ చూశారు. బెంగళూరు నగరం కూడా ఈ ఆపదనుండి బయట పడాలని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. 2030 నాటికీ దేశంలో నీటి అవసరాలు లభ్యత కన్నా నీటికోసం డిమాండ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2040 నాటికీ మనదేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు దొరకవు. 2050 నాటికీ ఢిల్లీ పట్టణంతో సహా మరో 21 నగరాలూ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. నీటి దుర్విని యోగం కొనసాగితే భారత్ జిడిపిలో 6 శాతాన్ని కోల్పోతుంది. ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర, చరాస్థి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ నగరానికి తక్షణం వచ్చే ఆపద ఏమీ లేకున్నప్పటికీ, నీటి దుర్వినియోగం ఆపాల్సిన బాధ్యత అందరిమీద వుందని పిలుపునిచ్చారు.
ఇంకుడు గుంతలే శరణ్యం
ఇష్టారీతిన భూగర్భ జలాల వినియోగంతో ”డే జీరో” పరిస్థితి వస్తుంది. ఒక బకెట్ నీరు భూమిలో ఇంకితే మూడు బకెట్ల నీరు తోడటం జరుగుతున్నది. భూమిలోపలి పొరల్లోని నీటిని కూడా భారీ మిషన్లతో తోడటం వలన భూమి పొరల్లో నిక్షిప్తమైన వేడి చల్లారదు. పైగా అంతలోతులో నుండి తీసిన నీరు తాగడం వలన ఆరోగ్యానికి పనికిరావు. జల సంరక్షణకు ఇంకుడు గుంతలు మాత్రమే ఆధారం. బోర్లు కూడా ఎండిపోవు. భూమిపై పడే ప్రతి నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా సంరక్షించుకోవడమే రేపటి తరానికి మనమిచ్చే కానుక. డబ్బులు, ఆస్తులకన్నా నీటిని రేపటి తరానికి మనం మిగిల్చడం అవసరం. హైదరాబాద్ నగరంలో సుమారు 15 వేల ఇంకుడు గుంతలు వివిధ సమయాల్లో జి.హెచ్.ఎంసీ, హెచ్.ఎం.డి.ఏ, జలమండలి నిర్మించినవి ఉన్నాయి. పలు భవంతుల పరిసరాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరు వైపులా రీఛార్జ్ గుంతలు నిర్మించినవి ఉన్నాయి.
స్థానికుల సహకారంతో 18 మే, 2019 ఒక్కరోజే ఒక వేయి ఇంకుడు గుంతలను బాగు చేయడం జరిగింది. అలాగే, నీటి వృథాను తగ్గించడం కోసం శాశ్వత భవనాలున్న పలు ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతాధికారులకు లేఖ రాయడం జరిగింది. వారి కార్యాలయాల్లో వున్న నల్లాలన్నింటికీ ”ఏరేటర్స్” బిగించడం వలన నల్లాలో వచ్చే నీటి ప్రవాహ వేగం తగ్గుతుందని చెప్పడం జరిగింది. జలమండలికున్న 10 లక్షల మంది వినియోగదారులకు కూడా నీటి వృధాను తగ్గించడం కోసం అవగాహనా సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.
నీటి వృధాను తగ్గించుకుంటూ, ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, భవిష్యత్ తరాల కోసం అనేక కొత్త నీటి వనరులను సష్టించుకుంటున్న హైదరాబాద్ నగరం ఇతర నగరాలకు, పట్టణాలకు ఒక రోల్ మోడల్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు.