విష్ణు పాదోద్భవి గంగ

చంద్రశేఖరుని జటాఝూటంలో చిక్కుకుపోయింది

నింగి జార్చిన నీటిచుక్క

సముద్రం పాలవుతుంటే

సమంగా భూమిపై పరచి

పంటల పచ్చలహారం వేసేందుకు

రేయింబవళ్ళ విశ్వకళ్యాణ యజ్ఞం

నిరంతరంగా సాగుతుంది

పంపింగ్‌ ఒకవైపు ఆకాశం నుండి జరుగుతూ ఉంటే

బీళ్ళను మాగాణం చేసేందుకు రివర్స్‌ పంపింగ్‌

సుళ్ళు తిరుగుతూ వడివడిగా కదులుతుంది

కాళేశ్వరం ప్రపంచానికి కొత్తకోణాన్ని చూపుతుంది

నేలను ఎక్కడ గిచ్చినా

పచ్చని పంటల కోసం

నీరు ధారగా కారుతుంది

తెలంగాణ ఆకుపచ్చ బంగారమై

నోటికి అన్నం ముద్ద మనకు గౌరవం పద్దు

జగమంతా విస్తరించే విస్తరౌతుంది

నాలుగు దిక్కులు ఎటునుంచి చూసినా

అందరికీ తెలంగాణ ఫలాలు

కనిపిస్తూ నోరూరిస్తున్నాయి

చండీయాగం ఎంత నిష్ఠగా జరిగిందో

ప్రతిపనీ అంతే తన్మయత్వంతో జరుగుతూ

అందరి కడుపుల్ని అన్నంతో నింపుతూ

మనసుల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి

సముద్రమంత నీటివిస్తరి

భూమిపై పరుచుకుంటుంది

ప్రపంచం మంత్రించినట్లు

మనవైపే చూస్తూ ఉండిపోతుంది.

– జి. నర్సింహస్వామి

Other Updates