అఅన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్ తీసుకుని మిషన్ భగీరథ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరోసారి గుర్తు చేశారు. దేశంలో ఎవరూ తీసుకోని సవాల్ స్వీకరించామని, దానికి తగినట్లు పని చేయాలని, సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు సురక్షిత మంచి నీరు ఇవ్వడం మన రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికే గ్రామాలకు మంచినీరు అందాలని, ఈ లోపుగానే ఇన్ టెక్ వెల్స్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి నీటిని అందించాలని చెప్పారు. సెప్టెంబర్ నుంచే పంపులు ప్రారంభించాలని, డిసెంబర్ నాటికి వందకు వంద శాతం పూర్తి కావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిషన్ భగీరథ జీవన్మరణ సమస్య అని, కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయింబవళ్లు పని చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం కోరారు. ఎక్కడ చిన్న జాప్యం జరిగినా ప్రభుత్వం దృష్టికి తేవాలని, ఏ సమస్య వచ్చినా జోక్యం చేసుకుని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మిషన్ భగీరథపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
రూ.43 వేల కోట్ల వ్యయంతో, దేశంలో మరెక్కడా లేని విధంగా యావత్ రాష్ట్రం కోసం ఇంత పెద్ద పథకం తెస్తున్నారని సీఎం చెప్పారు. అది పెద్ద సవాల్‌గా తీసుకున్నాం కనుక ఇకపై తానే స్వయంగా కార్యక్షేత్రాలను సందర్శిస్తానన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా తమ పరిధిలో పనులను నిరంతరం సమీక్షించాలని, పర్యటనలు జరపాలని ఆదేశించారు.
ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నదీ జలాలను జనవరి 1 నాడు నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ తరువాత ఆరు నెలల్లో గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, నల్లాలు బిగించడం లాంటి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే నెల నుండే ఇంటేక్ వెల్స్ నుండి డబ్ల్యూటిపిల ద్వారా మంచినీటిని పంపింగ్ చేయడం ప్రారంభించాలని చెప్పారు. మొదట్లో బాలారిష్టాలు తప్పవని, ఎప్పటికప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
”తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు మూడు. ఒకటి నిరంతర విద్యుత్ సరఫరా, రెండవది రైతులకు సాగునీరు అందివ్వడం, మూడవది ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం. విద్యుత్ సమస్యను విజయవంతంగా అధిగమించగలిగాము. నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతోంది. 45 శాతం వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే 100 శాతం పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాం. విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించాం. సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టుల నిర్మాణం జరుపుతున్నాం. బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు సమకూరుస్తున్నాం. మొత్తం ఏడాదికి రూ. 58వేల కోట్ల వరకు నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుండే గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి. ప్రాజెక్టుల నిర్మాణం పనులు అనూహ్యంగా జరుగుతున్నాయి. ప్రగతి నిరోధక శక్తులు, ప్రతీప శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నా ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు పోతున్నది. ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తున్నాం. ఇక మూడవది ముఖ్యమైనది అయిన ‘మిషన్ భగీరథ’ పనులు నిర్ణయించుకున్న ప్రకారం జరుగుతున్నయి. అధికారులు, ఇంజనీర్లు, వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద పని మరెక్కడా జరుగదు. ఇది అతి గొప్ప ఇంజనీరింగ్ ఫీట్. ఇప్పటికే 11 రాష్ట్రాలు వచ్చి చూసి పోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. నీతి అయోగ్ కొనియాడింది. ఇతర దేశాల ప్రతినిధులు వచ్చి చూస్తున్నారు. ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథను చూసి అబ్బుర పడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇంత గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకోవడం మనందరికీ గౌరవం. ఇంతటి గొప్ప పనిని మరింత బాధ్యతగా పూర్తి చేయాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన సహకారం అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ” అని సీఎం కేసీఆర్ అన్నారు.
”పనులు చేసే వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో వ్యవహరించాలి. ఏజెన్సీలు సమాఖ్యగా ఏర్పడి పరస్పరం సహకరించుకోవాలి. ఎక్కడైనా పనిలో జాప్యం జరిగినా, ఏజెన్సీకి వేరే ఇబ్బంది వచ్చినా ఇతర ఏజెన్సీలు జోక్యం చేసుకుని సహకరించుకోవాలి. మిషన్ భగీరథ పథకం కేవలం ప్రభుత్వానికే కాదు, వర్కింగ్ ఏజెన్సీలకు కూడా ప్రతిష్టాత్మకం. ఇంత గొప్ప పని చేయడం మీకు కూడా గౌరవ ప్రదం, మంచి అనుభవం. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఏ మాత్రం పెండింగు లేకుండా బిల్లులు చెల్లిస్తున్నది. సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి 1.5 శాతం ఇన్సెంటివ్ కూడా అందిస్తున్నది. ఈ అవకాశాన్ని వర్కింగ్ ఏజెన్సీలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ ఏజెన్సీ సకాలంలో పనులు పూర్తి చేసి ఇన్సెంటివ్ అందుకోవాలని నేను కోరుతున్నాను. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా స్థానికంగా వుండే మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించడానికి సిద్ధంగా వున్నారు. ప్రభుత్వం నుండి ఇంత సహకారం అందుతున్నా పనుల్లో జాప్యం జరిగితే మాత్రం సహించం. పనులు ఆలస్యంగా చేస్తున్న వర్కింగ్ ఏజెన్సీల నుండి పనులను తప్పించడానికి కూడా ప్రభుత్వం వెనుకాడదు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
”ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యేనాటికే వాటికి కావలసిన కరెంట్ కూడా అందుబాటులోకి రావాలి. దానికి అనుగుణంగా సబ్ స్టేషన్ల నిర్మాణం జరగాలి. విద్యుత్ కేటాయింపు జరగాలి. నిరంతర విద్యుత్ సరఫరా అందాలి. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించేందుకు ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్., ఎన్.పి.డి.సి.ఎల్ కు చెందిన ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
‘రాబోయే 30 ఏళ్ల అవసరాలను దష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించాం. దీనికి అనుగుణంగా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మేర మంచినీరు అందించే ఏర్పాటు జరగాలి. ట్యాంకులు, పైపులైన్ల సామర్థ్యాన్ని మరో సారి మదింపు చేయాలి. అవసరమైతే ట్యాంకుల సంఖ్య, వాటి నీటి నిలువ సామర్ధ్యం పెంచాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలో మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
సమావేశంలో వర్కింగ్ ఏజెన్సీలు జీఎస్టీ వల్ల తమపై అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరికరాలు, మెటీరియల్ కొనుగోలు సందర్భంగా తాము 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని, దీనివల్ల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని జీఎస్టీని తగ్గించడానికి కేంద్రంపై వత్తిడి తేవాలని కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ప్రజోపయోగ పనులకు అధిక జీఎస్టీ విధించవద్ధని తాము కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ సమావేశంలోనూ ఈ అంశాన్ని రాష్ట్రం తరపున గట్టిగా ప్రస్తావిస్తామని సీఎం హామి ఇచ్చారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పంది స్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించకుంటే వర్కింగ్ ఏజెన్సీలకు నష్టం కలగని విధంగా విధానం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చిట్టెం రామ్మెహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇ.ఎన్.సి. సురేందర్ రెడ్డి, ఎస్.పి.డి. సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో సిఇలు కృపాకర్ రెడ్డి, విజయ ప్రకాష్, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెగ్మెంట్ల పరిధిలో జరుగుతున్న ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, విద్యుత్ సరఫరా, వర్కింగ్ ఏజెన్సీల పనితీరు, పైపులైన్ల నిర్మాణం, రిజర్వాయర్లలో నీటి నిలువ, అంతర్గత పనులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.
49,238 కి.మీ పైపులైనుకు గాను 43,427 పైపులైన్లు సిద్ధంగా వున్నాయి.. 88% పూర్తయ్యాయి
19 ఇంటెక్ వెల్స్ 16 పూర్తయ్యాయి..
50 వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయి..
421 సంపుల్లో 247 పూర్తయ్యాయని,
143 జి.ఎల్.బి.ఆర్.లలో 73 పూర్తయ్యాయని,
562 ఒ.హెచ్.బి.ఆర్ లలో 192 పూర్తయ్యాయని,
248 పంపు హౌజ్ లలో 51 పూర్తయ్యాయని, మిగతావి కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయని అధికారులు చెప్పారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల పనులు అన్నీనిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని అధికారులు వివరించారు. గ్రామాల్లో అంతర్గత పనులు మినహా మిగతావన్నీ డిసెంబర్ లోగా పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
”జలాశయాల నీటిని వాడుకొనే విషయంలో మంచినీటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అందుకోసమే ప్రాజెక్టులలో 10 శాతం నీటిని మంచినీటి కోసం కేటాయిస్తూ చట్టం తెచ్చాం. తెలంగాణలోని అన్ని బ్యారేజిలు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్ భగీరథకు కేటాయిస్తాం. దీని కోసం రిజర్వాయర్లలో ఎం.డి.డి.ఎల్. (మినిమమ్ డ్రా డౌన్ లెవల్స్) ఉండేలా చూసుకోవాలి. దీనికోసం నీటి పారుదల శాఖతో కలిసి అంచనాలు రూపొందించాలి. ఏ రిజర్వాయర్లలో ఎంత మేర ఎం.డి.డి.ఎల్. ఉంచాలో నిర్ణయించాలి. దీనికోసం ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్ మార్చాలి. రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లోని నీటి వనరుల్లో కేవలం దుమ్ముగూడెం వద్ద మాత్రమే 365 రోజులు నీటి లభ్యత వుంటుంది. మిగతా 18 నీటి వనరులలో ఎప్పుడూ నీరు అందుబాటులో వుండడం కోసం ఎం.డి.డి.ఎల్. వుండేలా చూడడం అత్యంత ముఖ్యమైన విషయం”
– ముఖ్యమంత్రి కేసీఆర్