శ్రీమహావిష్ణువు దశావతారాలలో ప్రత్యేకత కల్గినట్టిది నరసింహావతారం – ఇది నాల్గవ అవతారం. భక్త పాలన కొరకు భగవంతుడు నృసింహావతారం దాల్చి స్వల్పకాలం మాత్రమే వర్తించి ప్రసిద్ధుడైన స్వామిని గూర్చి పోతన్న ‘లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్‌’ అని స్తుతించినారు. ఈ విశేషాలన్నిటిని గమనించి. తమ కుల స్వామియైన నృసింహ స్తుతి చేసిన విశేషం సంక్రమించగలదని భావించిన ఆసూరి మరింగంటి వెంకటనరసింహా చార్య కవి 4 ఆశ్వాసాల్లో 1019 గద్య, పద్యాల్లో నృకంఠీరవాభ్యుదయమును అనేక విశేషాలతో రచించినాడు. ఈయన అనేక రామాయణాలను, రామకథా గ్రంథాలను, బహుళ పురాణాలను శోధించి జనక సుతాభ్యుదయ ప్రబంధాన్ని రచించినట్లే (చూ. తెలంగాణ 2018 ఏప్రిల్‌) సాత్త్విక రాజస తామసపురాణాలను, సంహితలను సంస్యృత హరివంశ – భాగవతములను పరిశీలించి ”శ్రీ నృసింహజయమున్‌ శాస్త్రోక్తమార్గంబుగా లోకాధ్యక్షులు స్వాంతమందులను నాలోకించి మోదించునట్లు” నృకంఠీవాభ్యుదయాన్ని రచించుచున్నానన్నాడు.

ఎర్రన నృసింహపురాణం బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీ నరసింహా వతారాన్ని చెప్పగా, పోతన భాగవతం సంస్కృత భాగవతాన్ని (7స్కం.) అనుసరించింది. ప్రబంధ పరమేశ్వరుని నృసింహ పురాణం అహోబిల క్షేత్ర మాహాత్మ్య ప్రతిపాదనం ముఖ్యం చేసికొనినట్టిది. ప్రస్తుత గ్రంథ కర్త, ఈ పద్ధతిని కాస్తా గ్రహించినా, క్రొత్త రీతికి ఆస్కారం కల్పించగలిగినాడు.

శ్రీహరియే అందరికన్న మిన్నయని సాత్త్విక పురాణాలు చెప్పుచుండగా దీన్ని తామసపురాణాలు అన్యథాకరించటం తెలిసిన విషయమే ! శరభిరూపియైన శివుడు నృసింహునకోడిపోయి శరణు వేడినట్లు తైత్తరీయతృతీయప్రశ్నం ఆగ్నేయపురాణ చత్వారింశదధ్యాయము. గరుడపురాణం అష్టనవతి తమ అధ్యాయం. నారసింహపురాణము, అగ్ని పురాణోత్తరఖండం. ఉత్తర కూర్మం, పద్మవామనపురాణాల్లో వివరంగా వున్నట్లు అనేకములైన ఉదాహరణాల నిస్తూ చెప్పిన నృసింహావతార కథ దిలీపునికి వశిష్ఠుడు చెప్పినాడని సూతుడు శౌనకాది మహర్షులకీ కథను వినిపించటం ఒక వినూతన పద్ధతి.

నృకంఠీరవాభ్యుదయ కర్త. నృసింహావిర్భావం. స్వామి కృత్యాలు, భిల్లాంగనా (చెంచులక్ష్మి) స్వీకారం. వివాహం, గరుడాద్రియనబడే అహోబిలంలో స్వామి నివసించే విషయాలు ముఖ్యంగా చెప్పినాడు. మొదటి రెండాశ్వాసాల్లో నృసింహావిర్భావం. ప్రహ్లాద సంరక్షణ, స్తంభాంతర్గత నృసింహ రూప ప్రాముఖ్యం తెల్పి, శరభరూపుడైనట్టి శివుని యుద్ధంలో నృసింహ స్వామి ఓడించటం, దాని సంబంధ విషయాలు. మిగిలిన ఆశ్వాసాల్లో సరోవరం రుక్మపుష్పాల నుండి బాలికాజననం. ఈమెయే నీలాంశగాజనించిన బాలిక. తరువాత ఈమె వసంత, భిల్లాంగన అయ్యింది. ఈ బాలికనే చెంచులు పెంచటం. నృసింహుని వేట. చెంచురూప ధారియైన స్వామి ఈమెను పరిణయమాడటం అనే విషయాలు అధికంగా వర్ణితమైనాయి.

కవి నృకంఠీరవాభ్యుదయానికి పురాణ కథలే ఆధారమని తెల్పినా, తృతీయ, చతుర్థాశ్వాసాల్లోని చెంచు స్త్రీ కథ. శ్రీ వేంకటేశ్వరుని గూర్చిన చెంచిత కత వలెనే కలదు. ఈ విధమైనకథలన్నిటికి తెలుగులో వాసంతికా పరిణయ గరుడాచల యక్షగాన కథలు ఆధారం. అందుకే సవతుల పోరుకు గరుడా చలం ప్రసిద్ధి అంటారు. ఈ విధమైన కథలను మనవారు చెప్పటంలో ఒక వస్తుధ్వని కలదు. ఆటవిక జాతులు నిరసింపదగినవి కావు. వీరు కూడా అందరి వంటివారే. భక్తిః సర్వాధికారాః జాతులయందు ఉచ్చనీచముల గణింపరాదు. అని నిరూపించుటే దీనిలో ముఖ్యం. అందుకే నర-సింహ- మానవ ఆటవిక ధర్మనీతుల ప్రతీక. కవి వీటిని తెలియబరచదలచి ఆటవికుల మధ్య వాసంతీ నృసింహుల పరిణయాన్ని వైదికంగా జరిపించి ఆనందాన్ని కల్గించినాడు. గ్రంధకర్త నృసింహావతార ప్రాముఖ్యానికి పురాణాదులను ఆధారంగా గ్రహించి కథా కథనంలో ఎర్రన, పోతనల ననుకరించినాడు. ఐనా తన స్వతంత్ర ప్రవృత్తికి కొన్ని సందర్భాలను మార్చినాడు.

హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు దితి సంతానమని నృసింహపురాణం తెల్పగా. భాగవతంలో భద్రానుభద్రులనే రుద్రానుచరులని – భూతగణ ప్రేరితులుగా జనించినారని భాగవత కథనం. ఈ గ్రంథ కర్త మాత్రం వీరు దితి వలన కశ్యప మహర్షికి కల్గిన సంతానమన్నాడు.

బ్రహ్మవరంతో దిక్పతుల జయించిన హిరణ్యకశిపుడు – జంభాసురుని బిడ్డను వివాహమాడినాడు. పేరు తెల్పలేదు. ఎర్రన కూడా హిరణ్య కశిపుని భార్యపేరు చెప్పలేదు. పోతన మాత్రం ‘లీలావతి’ అన్నాడు. నారదీయ పురాణకర్త ఈమె పేరు ‘కల్యాణి’ యన్నాడు. ఇట్లా చిన్న చిన్న కథా భేదాలతో నృకంఠీరవాభ్యుదయం రచితమైనది.

ఎర్రన – పోతనలను ఆదర్శంగా గ్రహించిన గ్రంథకర్త నాల్గు సందర్భాలలో సుదీర్ఘ వచనాలను ప్రౌఢశైలిలో రచించి తన కవితా శక్తిని – మంత్రోపాసనావైభవాన్ని నిరూపించినాడు. వీటిలో స్తంభోద్భవ వచనం బీజాక్షర పరిపూరిత రచన. నృసింహోపాసకుడైన కవికిది యిష్ట రచన కావచ్చు.

భాగవతంలో వక్షఃకవాటంబు వ్రక్కలు చేయుచో… అనే దాన్ని ‘కనక కశ్యపువక్ష ఘటిత కవాటంబు వ్రక్కలంబు కుఠార వైఖరనగ అని – ఇట్లే మరి కొన్ని చోటుల్లో వసు, మను చరిత్రల కళాపూర్ణోదయాది రచనల ఛాయలున్నవి. చంద్రికా వర్ణనను సాంద్రతరచంద్రికగా నిట్లు చెప్పినాడు.

సాంద్రతరచంద్రికా పయోబ్దీంద్ర సుంద

రాంక పంకజ దృక్సమలం కృతాతి

రాజమానాభిలోరగ రాజతౌల్య

భ్రాజియై తేజరిల్లెను రాజుమింట

వెంకటనరసింహాచార్య కవి తనయితర రచనలలో తెల్పినట్లే దీనిలోను వంశ వివరములను కవిస్తుతి. దైవస్తుతి మొదలైనవాటిని విశదంగా తెల్పి తమ అగ్రహారాదుల గ్రామములను పేర్కొన్నాడు.

కృత్యాది పద్యాల్లో ఒకదాన్ని ‘మధుకర పదసీసం’ అన్నాడు. ఇది షట్పదం (తుమ్మెద) 6 పాదాల సీసపద్యం అని గ్రహింపవలెను.

భాగవతంలోని 7-298 పద్యానికి అనుకరణగా

అహరహంబులుగానియట్టికు సంధిని

సదన బాహ్యముగాని చప్పరమున

ఖచర భూచరనికర గర్భోద్భవము గాని

గుంభితంబగు నుక్కు కంబమునను

సకల హోతివ్రాత సందోహములుగాని

వరవజ్రినఖముఖ వ్రాతములను

దేవమానవముఖ్య దివ్యరూపము గాని

నరకేసరాకృతి సరభసముగ

పటుతరంబయి జీమూత పటలియందు

వెడలు చంచల లావణ్య విధముదనర

వరుణ జంభాది వరదిశల్‌ తల్లడిల్ల

విబుధు లలరంగనపుడు నావిష్కరించె

కవిగారీ ప్రబంధరచనను విశేషంగా భావించినా తననాడు జనవ్యవహారంలో వున్న కొన్ని పదాలను ఉచ్చారణ తీరును బట్టి అట్లేవాడి వాటికి స్థిరత్వం కల్గించటం ఒక విశేషం. వాటిలో ఆస్త=ఆసక్తి, లేకహనం – ఇది లేలిహానం కావలెను. వధువరులు – వధూవరులనుటకు, వెంగ్యము – వ్యంగ్యము అనుటకు ప్రహలాదం ప్రహ్లాదకావలెను. ఈ విధంగా మరి కొన్ని పదాలున్నాయి.

ఛందో విషయంలో కవి ప్రతిభ వ్యక్తమగుచున్నది. వచన రచనలో ప్రౌఢత్వంతో బాటు ఉత్సాహ, కవిరాజ విరాజిత, మత్తకోకిల, మాలిని స్రగ్ధరావృత్తాలున్నాయి. సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో వివిధ రీతులైన నృసింహ విభవ రచనలు వచ్చినవి. కొందరు పరిశోధనలు చేసినారు. ఐనా దేని ప్రత్యేకత దానిదే. తమ సర్వస్వం నృసింహ స్వామి యేయని నమ్మి, ఆస్వామికే కవితా సర్వస్వాన్ని సమర్పించి న్యస్తభరులైన వెంకట నరసింహాచార్యకవి పరిశోధించి రచించిన నృకంఠీరవాభ్యుదయం ప్రత్యేక పరిశీలన చేసి విషయ వివరణ మొనరింపదగిన ప్రబంధం, కృతినామం, కథా కథనం, మొదలైన వాటిల్లో ఎంతో నూతనత్వాన్ని ప్రోది చేసిన వెంకట నృసింహార్య కవి కృతుల్లో ఇది ప్రత్యేకం.

Other Updates